సముద్ర వాణిజ్య శక్తిగా భారత్
2047 నాటికి ప్రపంచంలోని ఐదు నౌకానిర్మాణ దేశాలలో ఒకటిగా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం మన సముద్రయాన రంగాన్ని బలోపేతం చేసే దిశగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. సముద్రరంగ సింగిల్ విండో 2.0 సంస్కరణలు డిజిటల్ క్లియరెన్స్‌లను అందించడం ద్వారా నౌకలు ఖాళీగా నిలిచి ఉండే సమయాన్ని తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర రేవుల అనుసంధాన ప్రణాళిక కింద నౌకాశ్రయాల ఆధునికీకరణ, అనుసంధాన ప్రాజెక్టులను చేపడుతున్నారు. ఒక వాణిజ్య పత్రికకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వావలంబన, సామర్థ్యం దిశగా భారతదేశం తన నౌకాయాన రంగాన్ని ఎలా విస్తరిస్తోందో వివరించారు. ఆ ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు:
ప్ర: మీరు 2047 వరకు నౌకాయాన మూలధన వ్యయం గురించి మాట్లాడారు. ఇది చాలా దూరం ఉంది. కానీ ఎగుమతిదారుల లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించేందుకు వచ్చే కొన్నేళ్ళకు నిర్దేశించుకున్న లక్ష్యాలేమిటి?
జ: 2047 నాటికి భారతదేశం నిర్దేశించుకున్న దీర్ఘకాలిక నౌకాయాన మూలధన వ్యయ ప్రణాళికలో ఎప్పటికప్పుడు సాధించే స్వల్పకాలిక లక్ష్యాలు భాగమే. 2024-2026 మధ్య ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ సాగరమాల 2.0, పీఎం గతిశక్తి, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కింద రు 1.05 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రాధాన్యమిచ్చింది.
2025–26కి ముఖ్య లక్ష్యాలు ఏమిటంటే:
- సగటు నౌక టీఆర్టీ (టర్న్అరౌండ్ సమయం, అంటే ఒక నౌక ఓడరేవుకు వచ్చిన తర్వాత అది లోడింగ్ లేదా అన్ లోడింగ్ పూర్తిచేసుకుని బయటికి వచ్చే సమయం)ని 49.5 గంటల నుండి 48.2 గంటలకు తగ్గించడం.
- కంటైనర్ టీఆర్టీని 30.1 గంటల నుండి 28.8 గంటలకు తగ్గించడం.
- ఎగుమతి నిల్వ సమయాన్ని (ఎగుమతిచేసే వస్తువులు రేవులో ఉండే సమయం) 86.1 గంటల నుండి 79.7 గంటలకు తగ్గించడం.
ఈ లక్ష్యాలు లాజిస్టిక్స్ ఖర్చులను 5-8 శాతం వరకు తగ్గిస్తాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రధాన ఓడరేవులు సామర్థ్య విస్తరణలో దూసుకుపోతున్నాయి. అయితే ఓఎన్ఓఫై (ఒక దేశం-ఒక పోర్ట్), సముద్రరంగ సింగిల్ విండో 2.0 సంస్కరణలు డిజిటల్ క్లియరెన్స్‌లను అందించడం ద్వారా నౌకలు ఖాళీగా నిలిచి ఉండే సమయాన్ని తగ్గిస్తున్నాయి.
ప్ర: 2024–25లో ప్రధాన ఓడరేవులు బలమైన కంటైనర్ వృద్ధిని సాధించి 85.5 కోట్ల మెట్రిక్ టన్నుల (MMT) ని దాటాయి. నిర్వహణ పరంగా ఇంకా లోపాలు ఎక్కడున్నాయని మీరు భావిస్తున్నారు?
జ: నౌకాశ్రయాల రంగంలో సంస్కరణల కారణంగా 2024–25 ఒక కీలక సంవత్సరంగా నిలుస్తుంది. 2025–26లో మా దృష్టి నౌకల టర్న్అరౌండ్, రేవులో ఉండే (డ్వెల్) సమయాలు, బెర్త్ ఉత్పాదకతలో మరింత సామర్థ్యాన్ని పెంచడంపై ఉంది. జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ (JNPA, ముంబై) , పారాదీప్, దీనదయాళ్, కామరాజర్, కొచ్చిన్, విశాఖపట్నం వంటి ముఖ్య నౌకాశ్రయాలు CPCP (సమగ్ర రేవుల అనుసంధాన ప్రణాళిక) కింద ఆధునికీకరణ, అనుసంధాన ప్రాజెక్టులను అమలు చేస్తున్నాయి. ఈ సంస్కరణలు 2025–26లో ప్రధాన రేవుల్లో సరకుల రవాణాను 904 MMTకి పెంచుతాయి. ఎగుమతి ఖర్చులను 8 శాతం వరకు తగ్గిస్తాయి. 2030 నాటికి భారతీయ రేవులను ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన వాటిలో ఒకటిగా నిలబెడతాయి.
ప్ర: జల రవాణా తక్కువ ఖర్చుతో కూడిన రవాణా విధానం అయినప్పటికీ, భారతదేశం ఇప్పటికీ ఎక్కువగా రోడ్డు రవాణాపై ఆధారపడుతోంది. కారణం ఏమిటి?
జ: చివరి మైలు అనుసంధానతలో ఉన్న అంతరాలు, నియంత్రణాపరమైన అడ్డంకులు, పరిమిత తీరప్రాంత మౌలిక సదుపాయాల కారణంగా సరుకు రవాణా ఇప్పటికీ ఎక్కువగా రోడ్డు మార్గంలో జరుగుతోంది. జలరవాణాను ప్రోత్సహించేందుకు విధానపరమైన సంస్కరణలు, లక్షిత మౌలిక సదుపాయాలపై పెట్టుబడి అనే ద్విముఖ వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. తీర నౌకాయాన బిల్లు, ప్రాధాన్యతా బెర్తింగ్, గ్రీన్-ఛానల్ అనుమతులు, పోర్ట్ రిబేట్లు నౌకలు ఖాళీగా ఉండే (ఐడిల్) సమయాన్ని, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తున్నాయి. సాగరమాల, CPCP కింద ప్రాజెక్టులు తీరప్రాంత బెర్త్‌లు, డ్రెడ్జింగ్ సామర్థ్యం, బహుళ-విధాన అనుసంధానతలను విస్తరిస్తున్నాయి.
ఇక్కడ లక్ష్యం స్పష్టం: జల రవాణాను రోడ్డు మార్గం వలె అనుకున్న సమయానికి జరిగేదిగా, సౌకర్యవంతంగా మార్చడం, తద్వారా ఎగుమతిదారుల లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తూ, పర్యావరణ అనుకూలమైన, మరింత సుస్థిరమైన వాణిజ్యానికి అవకాశాలు కల్పించడం.
ప్ర: భారతదేశంలో 40కి పైగా షిప్‌యార్డులు ఉన్నప్పటికీ, నౌకానిర్మాణ సామర్థ్యంలో ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. ఈ అంతరాన్ని ఎలా తగ్గిస్తారు?
జ: నౌకాదళ నౌకల విషయంలో భారత్ పెద్దఎత్తున స్వయంసమృద్ధిని సాధించింది. మన షిప్‌యార్డులలో ఎక్కువ భాగం సైనిక నౌకల వైపు మొగ్గు చూపుతున్నాయి. వాణిజ్య నౌకల విషయంలో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి ప్రపంచంలోని ఐదు నౌకానిర్మాణ దేశాలలో ఒకటిగా మారాలనే లక్ష్యంతో మన సముద్రయాన రంగాన్ని బలోపేతం లక్ష్యంతో ప్రభుత్వం పథకాలను ప్రకటించింది.
ప్ర: ఇంజిన్లు, కీలకమైన సాంకేతిక వ్యవస్థల కోసం దిగుమతులపై ఆధారపడటం గురించి ఆందోళనలు ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం?
జ : ఆధునిక వాణిజ్య నౌకల కీలక భాగాలలో ఇంజిన్లు, చోదక వ్యవస్థలు ముఖ్యమైనవి. కొత్త ఉద్గార లక్ష్యాలు, స్వచ్ఛ నౌకాయానం, రెండురకాల ఇంధనాన్ని ఉపయోగించే నౌకలు వంటి సాంకేతికతల వైపు పరిశ్రమ మొగ్గు చూపుతున్నందున ఈ రంగంలో ఏది మనకు మున్ముందు ముఖ్యమో నిర్ణయించుకోవడం అవసరం. భారతదేశం ఇంతవరకు చాలా పెద్ద నౌకానిర్మాణ దేశం కానందున చైనా లేదా దక్షిణ కొరియాలో అభివృద్ధి చెందినంత మేరకు నౌకానిర్మాణానికి మద్దతుగా అనుబంధ పరిశ్రమలు అభివృద్ధి చెందలేదు. ఈ పరిశ్రమల వృద్ధిని ప్రభావితం చేసే ప్రధాన అంశం డిమాండ్. నౌకానిర్మాణ సామర్థ్యం పెంపునకు కొత్తగా రూపొందించిన ప్రణాళికలతో అనుబంధ పరిశ్రమలు కూడా పెరుగుతాయని అనుకుంటున్నాం.
ప్ర: ఇరాన్ లో భారత్ సహకారంతో నిర్మిస్తున్న చాబహార్ పోర్టుపై ఆంక్షల నుంచి మినహాయింపును అమెరికా రద్దు చేసింది (తాజాగా ఆరు నెలల మినహాయింపు ఇచ్చింది). ఈ నేపథ్యంలో భారత్ తన 10 సంవత్సరాల రేవు నిర్వహణ ఒప్పందాన్ని ఎలా కాపాడుకోనుంది?
జ: ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా ప్రాంతంతో భారత్ కనెక్టివిటీ కోణంలో చాబహార్ రేవు చాలా కీలకం. ఇరాన్‌తో కుదిరిన 10 సంవత్సరాల నిర్వహణ ఒప్పందం కింద ఇండియా పోర్ట్స్ గ్లోబల్ (IPGL) 2018 డిసెంబర్ నుంచి షహీద్ బెహిష్తి పోర్టులో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. నిరంతర దౌత్య సంబంధాల ద్వారా పోర్టు కార్యకలాపాలు కొనసాగేటట్టు చూసేందుకు భారత్ కృషి చేస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయ బాధ్యతల కూడా కట్టుబడి ఉంటుంది. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య చాబహార్ వద్ద స్వల్పకాలంలో సరకు రవాణా వృద్ధి తగ్గినప్పటికీ వ్యూహాత్మక లక్ష్యం, భాగస్వామ్య పరిధి మారవు. ఇటువంటి నష్టాలను తగ్గించడానికి IPGL ఒక వైవిధ్యీకరణ వ్యూహాన్ని అమలుచేస్తోంది. మయన్మార్, బంగ్లాదేశ్, మడగాస్కర్, థాయిలాండ్, శ్రీలంక, ఒమాన్ తో సహా కీలక ప్రాంతాల్లో నిర్వహణ, భాగస్వామ్య అవకాశాలను అన్వేషిస్తోంది.
ప్ర: ముంబైలో ఇటీవల జరిగిన ఇండియా మారిటైమ్ వీక్ (IMW)2025 ప్రాంతీయ సముద్ర సహకారానికి కీలక వేదికగా నిలిచింది. ఈ వేదిక ఎలా రూపాంతరం చెందనుంది?
జ: మన క్రియాశీల ప్రధాని నేతృత్వంలో ఓడరేవుల మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమంగా IMW సముద్ర సాంకేతికత, రేవుల అభివృద్ధి, లాజిస్టిక్స్, సుస్థిరతలో తాజా పురోగతులను ప్రదర్శించడానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ఈ సదస్సు సహకారాన్ని పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, భారతదేశ సముద్ర రంగం భవిష్యత్తును, ప్రపంచ వాణిజ్యం, సముద్ర ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో దాని పాత్రను పెంచడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసే లక్ష్యంగా పనిచేస్తుంది. IMW 2025 మారిటైమ్ ఇండియా విజన్ 2030, మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులను, 2047 నాటికి 1.5 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

