మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతం

భారతదేశ సుదీర్ఘ, స్ఫూర్తిదాయక చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలెన్నో! అవి జాతి భావోద్వేగాలను వీణలా మీటి, వెన్నుతట్టి సమష్టి కార్యాచరణకు పురిగొల్పాయి. ఛత్రపతి శివాజీ సైన్యం ఉద్వేగంగా ఆలపించిన యుద్ధగీతాలు మొదలు… స్వాతంత్య్రోద్యమంలో ప్రతిధ్వనించిన దేశభక్తి గీతాలు, ఎమర్జెన్సీ కాలంలో యువగళాలు వినిపించిన ధిక్కార గీతాలు మన ఉమ్మడి చైతన్యాన్ని జాగృతపరిచాయి. వీటన్నింటిలోకీ అత్యంత ప్రత్యేకమైనది వందేమాతరం. ఈ అమర గీతం వెలువడి 150 సంవత్సరాలైనందున, ఏడాదిపాటు దేశమంతటా ఉత్సవాలు నిర్వహించాలని కేంద్రం నిశ్చయించింది.

మిగతా గీతాల్లా వందేమాతరం యుద్ధ రంగంలో, పోరు బాటలో ఉద్భవించింది కాదు. కవీంద్రుడు బంకించంద్ర ఛటర్జీ ప్రశాంత, దృఢచిత్తంలో ఉద్భవించిన పాట అది. 1875లో కార్తిక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు ఆయన కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం… స్వాతంత్య్ర ఉద్యమ శ్లోకంగా నిలిచి నేటికీ జాతీయ రాగంగా భాసిల్లుతోంది. భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. అధర్వణ వేదంలోని ”మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః…(భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడను)” అనే శ్లోకం, సర్వ మంగళ మాంగళ్యే శివే… అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణలు.

బంకిం బాబు వందేమాతరం ప్రార్థన స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాద ప్రకటనగానూ నిలిచింది. భారతదేశమంటే కేవలం భూభాగం కాదనీ, యుగాలుగా పరిఢవిల్లిన నాగరికత అనీ చాటిచెప్పింది. భారత్‌ అంటే మ్యాపు మీద కొన్ని రేఖలను కలిపితే వచ్చే ప్రదేశం కాదనీ… ఉమ్మడి సంస్కృతి, విలువలు, శౌర్యత్యాగాలను పంచుకున్న భరతమాత బిడ్డల చిరకాల ఆవాసమనీ ఘోషించింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు- బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. ఆయన రాసిన ఆనందమఠం కేవలం నవలే కాదు, గద్యరూపంలోని మహామంత్రం. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కనుగొనేలా జాగృతం చేసిందది. ”నా రచనలన్నీ గంగానదిలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు. ఈ ఒక్క దివ్యగీతం(వందేమాతరం) మాత్రం అజరామరంగా నిలిచిపోతుంది. దేశ ప్రజల మనసులను గెలుచుకునే మహత్తర గీతమది” అని బంకిం బాబు ఒక లేఖలో పేర్కొన్నారు. ఆయన మాటలు అక్షర సత్యాలయ్యాయి. బ్రిటిష్‌ అంధకార యుగంలో బంకించంద్రుడు రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువున మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడే వ్యక్తి మాత్రమే వందేమాతరం వంటి గీతం రాయగలరు. ఆ గీతానికి 1896లో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బాణీ కట్టి, కలకత్తా కాంగ్రెస్‌ మహాసభల్లో ఆలపించి దానికి అమరత్వం సంతరించిపెట్టారు. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతిని కదిలించింది. తమిళనాట మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఈ గీతాన్ని తమిళంలోకి అనువదించారు. పంజాబ్‌లో విప్లవకారులు బ్రిటిష్‌ వలస పాలకులపై ధిక్కార ప్రకటనగా వందేమాతరం అంటూ నినదించారు. 1905లో బెంగాల్‌ విభజనపై నిరసన వెల్లువెత్తినప్పుడు వందేమాతరం అంతటా మార్మోగింది. దాంతో బ్రిటిష్‌ పాలకులు ఆ పాటను నిషేధించారు. కానీ, 1906 ఏప్రిల్‌ 14న బారిసాల్‌లో వేలమంది ఉద్యమకారులు ఆ నిషేధాన్ని ధిక్కరించి వందేమాతరం అంటూ ఘోషించారు. లాఠీ దెబ్బలకు రక్తమోడుతున్నా లెక్కచేయకుండా స్త్రీ పురుషులు అలా ఘోషిస్తూనే ఉన్నారు. బెంగాల్‌ నుంచి వందేమాతరం విప్లవ జపమై గదర్‌ పార్టీ ద్వారా కాలిఫోర్నియా చేరి అక్కడా మార్మోగింది. సింగపూర్‌ నుంచి నేతాజీ నాయకత్వంలోని ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ యోధుల ద్వారా భరతభూమికి తిరిగి వచ్చింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్‌ ఇండియన్‌ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అంటూ నినదిస్తూ బ్రిటిష్‌ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు. ఖుదీరాం బోస్‌ నుంచి అష్ఫకుల్లా ఖాన్‌ వరకు, చంద్రశేఖర్‌ ఆజాద్‌ నుంచి తిరుపూర్‌ కుమరన్‌ వరకు విప్లవకారులందరి గళాలు వందేమాతరం అని గర్జించాయి.

వందేమాతరం ఇక ఎంతమాత్రం పాట కాదు, భారతీయాత్మ సమష్టి స్వరం. మొద్దునిద్రలో ఉన్నవారినైనా మేల్కొలిపే మంత్రశక్తి వందేమాతరానికి ఉందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు. ఉదారవాదులనూ విప్లవకారులనూ విద్వాంసులనూ సైనికులనూ ఏకతాటిపైకి తెచ్చి ఉద్యమోన్ముఖుల్ని చేసిందీ గీతం. అరవిందుడు చెప్పినట్లు, అది భారతదేశ పునరుజ్జీవన మంత్రమైంది. అక్టోబరు 26 నాటి మన్‌కీ బాత్‌ ప్రసంగంలో ప్రధాని మోదీ వందేమాతరం ఉజ్జ్వల వారసత్వాన్ని జాతికి గుర్తుచేశారు. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తిరూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని కీర్తిస్తూ కేంద్రం ఇటీవల ‘భారత్‌ పర్వ్‌’ నిర్వహించింది. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. సర్దార్‌ సాధించిన భారతదేశ ఏకీకరణలో వందేమాతరం స్ఫూర్తి మూర్తీభవించింది.

వందేమాతరం కేవలం గత వైభవ స్మరణ కాదు, ఉజ్జ్వల భవిష్యత్తును ఆవహించే మంత్రజపం కూడా. 2047కల్లా వికసిత్‌ భారత్‌ను సాధించడానికి స్ఫూర్తి ఉత్సాహాలనిచ్చే గీతమది. ఘనమైన భారతదేశ సంస్కృతీ నాగరికతలపై మనకున్న గర్వాభిమానాలకు నిదర్శనమైన ఆ గీతస్ఫూర్తిని ఆచరణలోకి తీసుకురావడం మనందరి బాధ్యత. వందేమాతరం పరతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి… నిరంతరం స్ఫూర్తి పొంది… సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానమే- వందేమాతరం! 

అమిత్ షా,
కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి