ఉత్సాహంగా ఐక్యతా పరుగు
భారత మాజీ ఉప ప్రధాని, దేశ సమైక్యతా శిల్పి, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా ‘రన్ ఫర్ యూనిటీ’ ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని బషీర్ బాగ్ వద్దనున్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం నుండి ప్రారంభమై, అసెంబ్లీ సమీపంలోని పబ్లిక్ గార్డెన్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు కొనసాగింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఆశిష్ షెలార్, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఏవీయన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, తదితర నాయకులు సర్ధార్ పటేల్ సేవలు, త్యాగాలు, దేశ సమైక్యత పట్ల ఆ మహనీయుడు చూపిన దృఢ సంకల్పాన్ని స్మరించుకుంటూ ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’ సందేశంతో ఈ రన్ ఫర్ యూనిటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తరువాత, భారతదేశపు మొదటి హోంశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన కృషితోనే ఈ దేశంలోని చిన్న చిన్న సంస్థానాలను కలిపి, దాదాపు 560 సంస్థానాలను సమైక్యపరచి, ఈరోజు మనం గర్వంగా చెప్పుకునే అఖండ భారతాన్ని నిర్మించారు. ఈరోజు తెలంగాణ భారతదేశంలో భాగమైందంటే — అది కూడా సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, ధైర్య నిర్ణయాల ఫలితం. నిరంకుశ నిజాం పాలనకు ముగింపు పలికేందుకు ‘పోలీస్ యాక్షన్’ తర్వాత హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం, సేవలు యువతకు ప్రేరణ. ఆయన లాంటి ఉక్కు సంకల్పం, నిర్ణయ శక్తి మనందరికీ మార్గదర్శనం కావాలి. అలాంటి స్ఫూర్తినే ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా కొనసాగిస్తున్నారు. సర్దార్ పటేల్ లా దేశ అఖండతను కాపాడుతూ, ఉగ్రవాదం, తీవ్రవాద సంస్థలపై దృఢంగా చర్యలు తీసుకుంటున్నారు. గుజరాత్ లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ సర్దార్ పటేల్ స్ఫూర్తిని తరతరాలకు అందిస్తుంది.” అని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ”సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు; గుజరాత్‌లో రైతు ఉద్యమ నాయకుడుగా కూడా ప్రజల మనసుల్లో నిలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు, లేదా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు లాంటి నాయకులు నచ్చరు. వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తుండరు. సర్దార్ వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి దేశభక్తులను కాంగ్రెస్ ఎప్పుడూ తక్కువ చేసి చూపింది. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడిన వీరులందరినీ చరిత్రలో నిలిచేలా చేయడం — నవతరానికి వారి త్యాగాలను తెలియజేయడం — భారత ప్రభుత్వం చేపట్టిన గొప్ప కర్తవ్యం. సర్దార్ చొరవతోనే ఈ తెలంగాణ గడ్డపై భారత త్రివర్ణ పతాకం ఎగిరింది.” అని అన్నారు.

