తెలంగాణలోనూ ఘనంగా ‘వందేమాతరం@150’ వేడుకలు
వందేమాతరం గేయం 150 సంవత్సరాల వేడుకలు రాష్ట్రంలోనూ ‘వందేమాతరం@150’ పేరుతో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లోనూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నవంబర్ 7న కోఠి హనుమాన్ వ్యాయామశాల వద్ద నిర్వహించిన ‘వందేమాతరం@150’ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ”రాష్ట్ర యువత, విద్యార్థులు వందేమాతరం గీతం అసలైన మహత్తును అర్థం చేసుకోవాలి. వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు- అది భారతీయుల జీవన జ్యోతి. మన దేశ స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన శక్తిగా వందేమాతరం గేయం నిలిచింది. ఆ జ్వాల, ఆ ప్రేరణ మనలో ప్రతి రోజూ సజీవంగా ఉండాలి. స్వాతంత్ర్య పోరాటం జరిగిన రోజుల్లో ప్రజలు ఒకరినొకరు ఐక్యతను చాటిచెప్పేలా ‘వందేమాతరం’ అని అభివాదం చేసేవారు. అదే ఉత్సాహం, ఆ భావం ప్రతి భారతీయుడిని, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలవాలి.” అని అన్నారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ”మనందరం మన ఆత్మగౌరవం, దేశ గౌరవం, సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన ఎందరో మహానుభావులు ‘వందేమాతరం’ రణ నినాదంతో పోరాడారు. బానిస సంకెళ్లను తెంచడంలో ఈ గేయం స్వతంత్ర పోరాటంలో అద్భుతమైన స్ఫూర్తిని నింపింది. అందుకే, నేటి యువతరం ఈ స్ఫూర్తిని భావితరాలకు అందించాలి. ఇది ఒక్క మతానికి సంబంధించిన నినాదం కాదు; ఇది అన్ని వర్గాలలో స్ఫూర్తిని నింపింది. భారతదేశానికి స్వాతంత్ర్యం అందించడంలో కీలక పాత్ర పోషించిన నినాదం ఇదే. బ్రిటిషర్లపై పోరాటంలోనే కాదు, నిజాం, రజాకార్ల వ్యతిరేక పోరాటంలో కూడా వందేమాతరం నినాదం కీలక పాత్ర పోషించింది. ఈ పోరాటంలో నారాయణరావు పవర్, వందేమాతరం రామచందర్, రామానంద తీర్థ కావచ్చు… ఎందరో మహానుభావులు నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పోరాటం చేశారు. వారి త్యాగాల ఫలితంగానే ఈ గడ్డపై మూడు రంగుల జెండా ఎగిరింది. ఇక్కడి ప్రజలు ‘వందేమాతరం’ అని నినదిస్తుంటే రజాకార్లు హత్యలు, అత్యాచారాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రామచందర్ అనే విద్యార్థి నిజాం వ్యతిరేకంగా నినాదం ఇస్తే, అతన్ని కాలేజీ నుండి బహిష్కరించి అనేక ఇబ్బందులు పెట్టారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజును తుపాకులతో కాల్చినప్పుడు కూడా చివరి క్షణంలో ‘వందేమాతరం’ నినాదం ఇచ్చారు. బంకించంద్ర ఛటర్జీ వందేమాతరం గేయాన్ని రూపొందిస్తున్నప్పుడు, ఈ దేశంలోని మాతల పేర్లు, నదుల పేర్లు, ప్రాంతాల పేర్లు ఉండేలా చూసుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ కొందరు దీనిని విమర్శిస్తున్నారు. ఇక్కడ ఉన్న అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ అయినప్పటికీ, ‘భారతమాతా కీ జై’ అనే నినాదం ఇవ్వరు. కానీ, పార్లమెంటులో ‘జై పాలస్తీన్’ అన్నాడు. అతనికి భారతమాత పేరు చెప్పాలంటే నచ్చదు. భారతమాత సంకెళ్లను తెంచడంలో కీలక పాత్ర పోషించిన ఈ వందేమాతరం ఉత్సవాలను మనం ఏడాది పాటు ఘనంగా జరుపుకుందాం. ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి.” అని అన్నారు.

