Metro

మెట్రోను ఆగమాగం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం

హైదరాబాద్‌ మెట్రో ప్రారంభమైనప్పుడు దేశంలో మరే నగరంలో లేని విధంగా ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. ప్రారంభించిన వెంటనే మెట్రోను అంత విశేషంగా మరే ఇతర నగరంలో ఆదరించిన దాఖలాలు లేవు. అయితే అప్పటి నుండి ఎదుగు, బొదుగూ లేకుండా మొదట్లో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలివేస్తూ వస్తున్నాయి. పెరిగిన రద్దీకి అనుగుణంగా బోగీలను పెంచడం లేదు. మొదట్లో ప్రారంభించిన మూడు బోగీలతోనే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం కొత్త ప్రాంతాలకు విస్తరించడం లేదు. ముఖ్యంగా కేవలం రాజకీయ కారణాలతో పాతబస్తీకి మెట్రోను విస్తరించడం లేదు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో సదుపాయం కల్పించే ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడం లేదు. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద కబుర్లు చెప్పడమే కానీ ఆచరణలో ఏమీ చేయడం లేదు. తాజాగా, ప్రభుత్వ సహాయనిరాకరణ కారణంగా మెట్రో నిర్వహణను కొనసాగించలేమని ఎల్‌ అండ్‌ టీ చేతులు ఎత్తేయడంతో సమస్యలు ఏమిటో చర్చించి, పరిష్కరించే ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే టేకోవర్ చేస్తుందంటూ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఎల్‌ అండ్‌ టీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరినీ ఆశ్చర్యపరిచింది.  పైగా, ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్‌ చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆశ్చర్యపోయారు’ అంటూ రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో టేకోవర్‌ అమలు అధికార యంత్రాంగానికి ఓ గుదిబండగా తయారైనట్లు తెలుస్తున్నది. అతి చవక ధరకు మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకున్నామని  ప్రభుత్వం పైకి సంబురం వ్యక్తం చేస్తున్నా,  వాస్తవ లెక్కలు తేలిస్తే ఎల్‌ అండ్‌ టీకి ఆర్థికంగా భారీ ఊరటనిచ్చి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది.

మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి రూ.15వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోగలిగితే గాని, విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. ఆ విధంగా జరిగినా ఆ తర్వాత మెట్రో నిర్వహణ, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోగలదో అన్నది ప్రశ్నార్థకమే. ఎల్‌ అండ్‌ టీకి ఇస్తామని అంగీకరించిన రూ.2వేల కోట్లను సమకూర్చడమే సర్కార్‌కు గగనంగా మారగా, ఆ సంస్థపై ఉన్న రూ.13వేల కోట్ల రుణాన్ని బదలాయించుకునేందుకు ప్రభుత్వం ఒప్పుకోవడం విస్మయం కలిగిస్తోంది. ఈ దశలో వేస్తున్న అడుగులకు అనేక సాంకేతిక అవరోధాలు ఎదురవుతున్నట్లు తెలుస్తున్నది. టేకోవర్‌ను వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు గడువు విధించినా నిధులు సమకూర్చడం అసాధ్యమని స్పష్టం అవుతుంది. మరోవైపు,  ప్రభుత్వం స్వాధీనం చేసుకునే మెట్రోకు మనమెందుకు ఖర్చులు పెట్టాలని ఎల్‌ అండ్‌ టీ గత రెండు, మూడు నెలలుగా చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తున్నది. దీంతో రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా సరైన సౌకర్యాలు మెరుగుపడక జనం నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు.

రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చేసరికే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు సర్వే కూడా పూర్తయింది. అయితే, అధికారంలోకి రాగానే అనాలోచితంగా ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు. రానున్న వంద సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మెట్రోను విస్తరిస్తామంటూ ఎడాపెడా ప్రణాళికలు రూపొందించి, కేంద్రానికి పంపారు. కానీ మొదటి దశతో వీటిని ఎలా అనుసంధానించాలనే కనీసం అవగాహన, ఆలోచన లేకుండానే డీపీఆర్‌ను కేంద్రానికి పంపడంతో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతుంది. అసలు మొదటి దశ మెట్రోను పొడిగిస్తూ విస్తరణ ప్రణాళికలు ఉన్నందున ఇప్పటికే మొదటి దశలోని 72 కిలోమీటర్లను నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ ఎల్‌ అండ్‌ టీ వెంటనే ఉన్న మెట్రో మొదటి దశను వదులుకుంటానే తప్ప కాంగ్రెస్‌ ప్రభుత్వంతో విస్తరణ ప్రాజెక్టు ఒప్పందం చేసుకునేదే లేదని ఏకంగా కేంద్రానికే లేఖ రాసింది. దీంతో రేవంత్‌ సర్కార్‌ విస్తరణ ప్రాజెక్టు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. అసలే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎల్‌ అండ్‌ టీతో అంతర్గతంగా రేవంత్‌ సర్కార్‌కు ఉన్న విభేధాలతో పాటు మెట్రో ఒప్పందం చేసుకోనని కేంద్రానికి లేఖ రాయడంతో పాలకులకు కోపం వచ్చింది. వెంటనే మొదటి దశ మెట్రోను తామే తీసుకుంటామంటూ ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రక్రియను ముగించారు. ఈ హడావిడిలో ఎల్‌ అండ్‌ టీకి భారంగా ఉన్న రూ.13వేల కోట్ల రుణాన్ని తమ భుజాన వేసుకోవడంతో పాటు అదనంగా రూ.2వేల కోట్లను ఈక్విటీ కింద నగదు ఇచ్చేందుకు అంగీకరించారు. అసలు మెట్రో భారం నుంచి ఎలా తప్పించుకోవాలని ఎదురు చూస్తున్న ఎల్‌ అండ్‌ టీకి ఇదో బంపర్‌ ఆఫర్‌గా పరిణమించింది.

ఎల్‌అండ్‌టీ సంస్థ 2010లో జరిగిన ఒప్పందం ప్రకారం 2035 వరకు ఇదేరీతిన మెట్రోను నడిపి, చివరకు 210 ఎకరాల భూమితో పాటు మెట్రోను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉంది. అంటే అప్పటివరకు మెట్రో నిర్వహణ భారంతో పాటు నిర్మాణానికి తీసుకున్న రూ.13వేల కోట్ల రుణాన్ని తీర్చేందుకు ఏటా రూ.960 కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రేవంత్‌ సర్కారు ఇచ్చిన ఆఫర్‌తో రూ.2వేల కోట్ల నగదు తీసుకొని రుణ, మెట్రో నిర్వహణ భారాన్ని ప్రభుత్వంపై మోపి తప్పుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా హైదరాబాద్ మెట్రో భవిష్యత్ అగమ్యగోచరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రవీణ్