విద్యార్థులపై వామపక్ష భావజాలం రుద్దే ప్రయత్నం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం గల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో “తెలంగాణ విద్యా విధానం-2026” పేరిట రిపోర్ట్ తయారు చేయించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేలా ఉన్నాయని ఆయన అన్నారు. మార్చి 10న ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో “తెలంగాణ విద్యా విధానం – 2026” అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ PGRRCDE మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, తెలంగాణ ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్లు ప్రొఫెసర్ టి. పాపిరెడ్డి, ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. తిరుపతి రావు, NCERT మాజీ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ పి. మురళి మనోహర్ తో పాటు పలువురు విద్యావేత్తలు, నిపుణులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యా రంగానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
ఈ సమావేశంలో ప్రసంగిస్తూ ఇటీవల విద్యా కమిషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన విషయాన్ని రాంచందర్ రావు ప్రస్తావించారు. తెలంగాణలో విద్యా వ్యవస్థ గత బీఆర్ఎస్ పాలనలోనే పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. రాష్ట్రంలో అర్హత కలిగిన బీఈడీ టీచర్లు ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు. టీచర్లకు జీతాల చెల్లింపుల్లో ఆలస్యం, ప్రమోషన్లలో జాప్యం, విద్యా పరిపాలనలో డీఈవోలు, ఎంఈవోల స్థాయిలో అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్న పరిస్థితి ఏర్పడిందని, అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత కొనసాగుతోందన్నారు. విద్యార్థులు ఉన్న చోట టీచర్లు లేకపోవడం, టీచర్లు ఉన్న చోట విద్యార్థులు లేకపోవడం వంటి పరిస్థితి విద్యా వ్యవస్థలో ఏర్పడిందని అన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం వంటి కనీస సదుపాయాలు కూడా లేవని తెలిపారు. గురుకులాల్లో జరిగిన విషాహార ఘటనలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అలాంటి ఘటనల్లో సుమారు 44 మంది విద్యార్థులు మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020లో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, రైట్ టు ఎడ్యుకేషన్ అమలుపై కూడా కేంద్ర విధానంలో స్పష్టమైన సూచనలు ఉన్నాయని రాంచందర్ రావు గుర్తు చేశారు. అయితే రాష్ట్ర విద్యా కమిషన్ సూచనలు వివాదాస్పదంగా మారాయని తెలిపారు. నూతన విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని, భారతీయ సంస్కృతి, విలువలను ప్రతిబింబించే విధంగా విద్యా విధానం ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్ర విద్యా కమిషన్ రిపోర్టులో సంస్కృతాన్ని తొలగించాలని సూచించడం సరైంది కాదని, సంస్కృతం ప్రాచీన భాషగా దేశ సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. గిరిజన శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాలను తొలగించాలనడం అభ్యంతరకరమని అన్నారు. ప్రభుత్వ టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించిందంటూ ప్రచారం జరుగుతుందని, టీచర్ల జీతాలు తగ్గించి మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన తప్పుదారి పట్టించేదని విమర్శించారు. తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు తయారు చేసేటప్పుడు విద్యావంతులు, విద్యా రంగ నిపుణులతో సరైన సంప్రదింపులు జరపలేదని అన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ విద్యా వ్యవస్థ భవిష్యత్తు, విధాన మార్పులు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, ఉపాధ్యాయ వ్యవస్థ, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది.

