బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిరాయింపుల దుష్ఫలితమే జీవన్ రెడ్డి ఎపిసోడ్
ప్రస్తుతం నడుస్తున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పిడి ఎపిసోడ్ గత 12 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత నీతిబాహ్యంగా, చట్టవిరుద్ధంగా నడిపిన పార్టీ ఫిరాయింపుల దుష్ట రాజకీయాల ఫలితమే.
2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే రాజ్యాంగ వ్యతిరేక, నీతిబాహ్య పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వడం ఈ చట్టవ్యతిరేక జాడ్యానికి ఆజ్యం పోసినట్టయింది. గత 12 ఏళ్లుగా బీఎస్పీ, వైసీపీ, ఫార్వర్డ్ బ్లాక్, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీల నుంచి కేసీఆర్ చేసిన నీతిబాహ్య ఫిరాయింపులను అసహ్యించుకున్న తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టాలన్న కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మాటలను నమ్మి, కేసీఆర్ ను ఓడించి, కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత 27 నెలలుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలోనూ, అవకాశ రాజకీయాల్లోను, పార్టీ ఫిరాయింపుల్లోనూ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కడంలోనూ సంపూర్ణంగా కేసీఆర్ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
దాదాపు 6 దశాబ్దాల క్రితం హర్యానాలో గయాలాల్ అనే ఒక స్వతంత్ర ఎమ్మెల్యే 2 వారాల్లో మూడు పార్టీలు మారిన నేపథ్యంలో హిందూ ద్వేషులైన కమ్యూనిస్టులు ఈ అవకాశ రాజకీయ ఫిరాయింపులకు రాముని పేరు జోడించి, రాముడిని అవమానించేవిధంగా ‘ఆయా రాం గయా రాం’ ముద్ర వేసి, దానిని బలంగా ప్రజల్లోకి పంపగలిగారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవకాశవాద, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులు దేశవ్యాప్తంగా తెలంగాణకు అత్యంత చెడ్డపేరు తెచ్చిపెట్టాయి.
1984లో కాంగ్రెస్ కుట్రతో ఎన్టీ రామారావు నాయకత్వంలోని టీడీపీని చీల్చి, గవర్నర్ పదవిని దుర్వినియోగం చేస్తూ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న రామారావు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి, మెజారిటీ లేని నాదెండ్ల భాస్కర్ రావును ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి, ఫిరాయింపు ఎమ్మెల్యేలతో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. ఇదే జీవన్ రెడ్డి 1984లో ఎన్టీరామారావు ద్వారా రాజకీయ భిక్ష పొంది, ఆయనకు వెన్నుపోటు పొడిచి, నాదెండ్ల భాస్కర్ రావు మంత్రివర్గంలో మంత్రి అయి, మెజారిటీ లేని ఆ ప్రభుత్వం కూలిపోయాక, గత్యంతరం లేక కాంగ్రెస్ లో చేరారు. అప్పటి జీవన్ రెడ్డి పాపం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందా అని తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన 1984 లోక్ సభ ఎన్నికల్లో 400 పైచిలుకు స్థానాలు గెలుచుకున్న రాజీవ్ గాంధీ.. పార్టీ ఫిరాయింపుల భయంతో తమ అవసరం కోసం ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. దశాబ్దాల పాటు కాంగ్రెస్ ప్రోత్సహించిన ఫిరాయింపు రాజకీయాల వల్ల ⅓ కండీషన్ ఫిరాయింపులను ఆపలేకపోయింది. ఈ దుష్పరిమాణాన్ని గమనించిన వాజ్ పేయి ప్రభుత్వం ఆ ⅓ ని ⅔ గా మార్చి ఫిరాయింపులను నిరోధించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు.
పార్టీ చీలికకు ⅔ వంతు మెజారిటీ అవసరం వచ్చిన పరిస్థితుల్లో అది అవకాశవాద పార్టీ ఫిరాయింపులకు సాధ్యం కాక, తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒకరితర్వాత ఒకరు నీతిబాహ్య, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులను సంపూర్ణంగా ప్రోత్సహించారు. కేసీఆర్ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గెలిచిన పదవులతో పార్టీ ఫిరాయించిన నాయకులను రాళ్లతో కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చి, తాను ఆ విధంగా చేస్తానని నమ్మించి, కేసీఆర్ వ్యతిరేకతకు తోడు బూటకపు హామీలతో నెగ్గి, గద్దెనెక్కి, కేసీఆర్ పద్ధతుల్లోనే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకోవడంతో ఇప్పడు ఈ దుర్మార్గ పార్టీ ఫిరాయింపులు ప్రజల్లో బలమైన అంశంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోనే ఉన్నారని, అత్యంత హేయమైన తీర్పు ఇవ్వడంతో రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి ఉన్న గౌరవం తుడిచిపెట్టుకుపోయింది.
ఎన్టీఆర్ భిక్షతో రాజకీయ జీవితాన్ని ఆరంభించి, అదే రామారావుకు వెన్నుపోటు పొడిచి, నాందెండ్ల మంత్రివర్గంలో మంత్రి అయి, తర్వాత కాంగ్రెస్ లో చేరిన జీవన్ రెడ్డి, ఇప్పుడు అదే కాంగ్రెస్ దుర్మార్గపు ఫిరాయింపులకు బలిపశువు అయ్యారు. రాజ్యాంగ వ్యతిరేక కాంగ్రెస్ ఫిరాయింపులను వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి అదే పద్ధతికి ఆజ్యం పోసిన కేసీఆర్ పార్టీలో చేరడం తెలంగాణ ప్రజలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కొసమెరుపు ఏంటంటే.. కేసీఆర్ పై రెండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు దేవుడే తనను కేసీఆర్ దగ్గరకు పంపించాడని చెప్పడం సిగ్గుమాలిన అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట.

