చట్టసభల్లో మహిళా నాయకత్వం బలోపేతం
భారతదేశం ప్రస్తుతం ఒక అసాధారణ అవకాశం ముంగిట నిలిచి ఉంది. తన చట్టసభలను పునర్నిర్మించుకోవడానికి, మహిళా నాయకత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి, ప్రజల శక్తిసామర్థ్యాలను ప్రతిబింబించే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి ఇది తగిన సమయం. ఎప్పుడైతే మహిళలు పాలనలో తమ సరైన స్థానాన్ని పొందుతారో, అప్పుడు విధానాలు అందరి అవసరాలకు అనుగుణంగా రూపొందుతాయి, దేశం మరింత గొప్ప సంకల్పంతో, శక్తితో ముందుకు సాగుతుంది.
2023 సెప్టెంబర్లో ఆమోదించిన 106వ రాజ్యాంగ సవరణ చట్టం — ‘నారీ శక్తి వందన్ అధినియం’ — ఇటీవలి కాలంలో అత్యంత కీలకమైన రాజకీయ సంస్కరణలలో ఒకటి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చట్టం, దేశ ప్రజాస్వామ్య చట్రంలో మహిళల పాత్రను విస్తరించాలనే దృఢమైన రాజకీయ సంకల్పానికి నిదర్శనం. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్’ అనే దార్శనికతతో కూడిన ఈ చారిత్రాత్మక చట్టం, లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు మూడవ వంతు సీట్లను కేటాయిస్తూ ‘వికసిత్ భారత్’ నిర్మాణానికి బలమైన ముందడుగు వేసింది. ఇది కేవలం ఒక రాజ్యాంగ నిబంధన మాత్రమే కాదు; మహిళలు ప్రజాస్వామ్యంలో కేవలం భాగస్వాములుగా కాకుండా, దాని రూపురేఖలను స్వయంగా నిర్ణయించే శక్తిగా ఎదగాలనే ఒక పరివర్తనాత్మక దార్శనికతకు సంస్థాగత రూపం. మహిళా సాధికారత, సమ్మిళిత అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నిరంతరాయంగా చేస్తున్న ప్రయత్నాలు దీర్ఘకాలిక ఆకాంక్షలను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి బలమైన ప్రేరణనిచ్చాయి.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలకు కేవలం మహిళల సంఖ్య పెరగడం మాత్రమే కాదు, విధాన నిర్ణయాలను ప్రభావితం చేయగల అధికారం, సామర్థ్యం, అవకాశం ఉన్న మహిళలు అవసరం. గత దశాబ్ద కాలంలో ప్రస్తుత ప్రభుత్వం మహిళల సామాజిక-ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి గణనీయమైన కృషి చేసింది. ఇది శాసన వ్యవస్థల్లో మార్పులకు బలమైన పునాది వేసింది.
- జన్ ధన్ ఖాతాదారులు: 56 శాతానికి పైగా మహిళలే ఉండటం వల్ల ఆర్థిక సమ్మిళితం అపూర్వ రీతిలో పెరిగింది.
- ముద్రా యోజన: లబ్ధిదారులలో దాదాపు 67 శాతం మంది మహిళలే కావడం వారి పెరుగుతున్న వ్యవస్థాపక పాత్రకు నిదర్శనం.
- పీఎం ఆవాస్ యోజన: మంజూరైన ఇళ్లలో 73 శాతానికి పైగా మహిళల పేరిట ఉన్నాయి.
- ఉజ్వల యోజన: 10 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు మహిళల సంక్షేమానికి దోహదం చేశాయి.
ఈ చర్యలన్నీ ఒక స్పష్టమైన విధాన దిశను సూచిస్తున్నాయి: భాగస్వామ్యానికి సాధికారతే మార్గం. అయితే కేవలం భాగస్వామ్యంతోనే ఆగిపోకుండా, నిర్ణయాధికార స్థాయికి చేరుకోవడంపైనే ఇప్పుడు ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
మన దేశ అనుభవాలే దీనికి బలమైన ప్రాతిపదికను అందిస్తున్నాయి. స్థానిక స్థాయిలో, పంచాయతీ రాజ్ సంస్థలలో దాదాపు 50 శాతం మంది మహిళా ప్రతినిధులు ఎన్నికయ్యారు. మొత్తం 12 లక్షల మందికి పైగా మహిళా నాయకులు స్థానిక పాలనను విజయవంతంగా నడిపిస్తున్నారు. నీరు, పారిశుధ్యం, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక అభివృద్ధి అంశాలపై వారు చూపిస్తున్న ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. నాయకత్వంలో వైవిధ్యం ఉంటే విధానపరమైన మార్పులు ఎలా సాధ్యమవుతాయో వారు నిరూపించారు.
మహిళలు సమర్థమైన నాయకత్వం అందించగలరా అనే ప్రశ్నకు ఇప్పుడు తావులేదు; దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికే మన కళ్లముందే ఉన్నాయి. ఇప్పుడు మన అత్యున్నత శాసన వ్యవస్థలు మహిళా నాయకత్వాన్ని సంపూర్ణంగా స్వీకరించి, విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఇప్పటికే దీనికి పటిష్టమైన పునాది వేసింది. రాజకీయ పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక విధానాన్ని పునఃసమీక్షించుకోవడం, ప్రచార నిధుల లభ్యతను పెంచడం, మహిళా నాయకులకు స్పష్టమైన మార్గాలను కల్పించడం ద్వారా ఈ వేగాన్ని అందుకోవాలి. సరైన సంస్కరణలతో, శాసన వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యం కేవలం ఒక ఆశయంగా కాకుండా, ఒక సజీవ వాస్తవంగా మారుతుంది.
పార్లమెంటు, అసెంబ్లీలు సంస్థాగతంగా ఈ కీలక సంస్కరణను అమలు చేసేటట్టు చూసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలిసారిగా ఎన్నికయ్యే మహిళా సభ్యులకు లోతైన విధాన పరిశోధన, శాసన ప్రక్రియలో సమగ్ర శిక్షణ, ఇతర సభ్యులతో సంప్రదింపులు, సమన్వయానికి సదుపాయాలను కల్పించడం ద్వారా ప్రభుత్వం వారి నిర్ణయాధికార సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది. ప్రధాని మోదీ నాయకత్వంలో మా ప్రభుత్వం మహిళా నేతృత్వంలో అభివృద్ధి అనే దార్శనికతతో పనిచేస్తూ, భారత వృద్ధి కథనంలో ‘నారీ శక్తి’ని కేంద్ర బిందువుగా నిలిపింది. ఈ సందర్భాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. నిజమైన అధికారంతో కూడిన ప్రాతినిధ్యం సంస్కరణలను వేగవంతం చేస్తుంది. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో మన శాసన వ్యవస్థల బలం కీలక పాత్ర పోషిస్తుంది. మహిళల శాసన నాయకత్వాన్ని పెంపొందించడం కేవలం న్యాయానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు; అది పాలనా వ్యవస్థను పటిష్ట చేయడం కూడా. ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఒక గొప్ప మార్పునకు నాంది పలికింది. ఈ చారిత్రాత్మక అవకాశాన్ని శాశ్వతమైన మార్పుగా మలిచే బాధ్యత రాజకీయ సంస్థలు, పార్టీలు, విధానకర్తలపై ఉంది. కేవలం పదవులను అధిష్టించే వారు మాత్రమే కాదు, చట్టాలను రూపొందించే వారు, సాహసోపేతమైన అజెండాలను నిర్ణయించే వారు, తరతరాల పాలనను తీర్చిదిద్దే మహిళా నాయకులే పురోగతికి నిజమైన కొలమానం. ఈ చట్టం అమలుతో భారత చట్టసభల స్వరూపం మారడమే కాకుండా వాటి ఉద్దేశం, శక్తి, భవిష్యత్తు పూర్తిగా మారిపోతాయి.
అన్నపూర్ణా దేవి,
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి

