నేటికీ మార్గదర్శకంగా అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు
ఏప్రిల్ 14న రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ భీంరావ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనలు, ఆదర్శాలు దేశ నిర్మాణ దిశలో నేటికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయని అన్నారు. అంబేద్కర్ జీవితం సమాజాన్ని సంస్కరించడం, విద్యావంతం చేయడం, అన్ని వర్గాలను కలుపుకొని పోవడం దృష్టికోణంలో సాగిందని అన్నారు. రాజ్యాంగ రూపకర్తగానే కాకుండా మహిళలకు హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ విశేష కృషి చేశారన్నారు. అంతేకాదు, సమాజంలోని అంతరాలు తొలగి ప్రతి వర్గం బలోపేతం కావాలని ఆశించారు. ఈ దిశగా ఆయన కృషి నేటికీ స్ఫూర్తినిస్తుందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆయన ఆదర్శాలను ఆచరణలోకి తీసుకురావడానికి అంకితభావంతో పని చేస్తోందని తెలిపారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, అంత్యోదయ సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి పథకాల ప్రయోజనాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి చేరేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. భారత పునర్నిర్మాణం, పునరుజ్జీవన దిశగా నరేంద్ర మోదీ పనిచేస్తున్న విధానం అంబేద్కర్ ఆదర్శాలను మరింత ప్రతిఫలింపజేస్తోందని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలతో పాటు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రవచించిన అంత్యోదయ సూత్రం కూడా నేటి ప్రభుత్వ విధానాల్లో ప్రతిఫలిస్తోందని అన్నారు.
గతంలో దేశంలో నెహ్రూ-గాంధీ కుటుంబం తప్ప మరెవరికి గుర్తింపునివ్వలేదని, స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాల తర్వాత కూడా రాజ్యాంగ శిల్పి అంబేద్కర్ కు తగిన గౌరవం ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి మద్దతు ఉన్న యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ఆయనకు భారతరత్న లభించిందని నితిన్ నబీన్ గుర్తుచేశారు. అటల్ బిహారీ వాజపేయి పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి, సర్వశిక్షా అభియాన్ ద్వారా ఆయన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారని, నేటి విద్యావంతమైన సమాజ నిర్మాణంలో అది కీలక పాత్ర పోషించిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ జీవితంతో ముడిపడి ఉన్న స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేశారని, రాజ్యాంగ దినోత్సవాన్ని పాటిస్తున్నారని, అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రాన్ని దేశానికి అంకితమిచ్చారని వివరించారు. 
ఫూలే స్మరణలో..
ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా బిజెపి కేంద్ర కార్యాలయంలో నితిన్ నబీన్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడితో పాటు జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివ ప్రకాశ్, జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర కార్యాలయ ఇంచార్జ్ అరుణ్ సింగ్, జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, దుశ్యంత్ కుమార్ గౌతమ్, జాతీయ అధికార ప్రతినిధులు కె.కె. శర్మ, సర్దార్ ఆర్.పీ. సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక సంస్కరణలు, మహిళా సాధికారతలో చేసిన కృషిని స్మరించుకున్నారు. సతి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడి మహిళలను కాపాడారని, బాలికా విద్యను విశేషంగా ప్రోత్సహించారని, అనేక సామాజిక సంస్కరణల్లో ఫూలే ముద్ర సుస్పష్టమని నితిన్ నబీన్ అన్నారు.

