ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు

న్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి అబద్ధాలతో నిందలు వేయడం మొదటి నుంచీ కాంగ్రెస్ నైజం. గత రెండున్నర సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చూస్తే ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకే పాఠాలు చెప్పే స్థాయిలో ఎదిగారని అర్థమవుతోంది. తన గారడీ మాటలు, ఎత్తులు జిత్తులతో ఎల్లకాలం తెలంగాణ ప్రజలు తన బుట్టలో పడిపోతారనేది రేవంత్ రెడ్డి గుడ్డి నమ్మకం. కేసీఆర్ పై ప్రజల్లో నెలకొన్న తీవ్ర ఆగ్రహం, బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటే అన్న అబద్ధపు ప్రచారం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలిచాడే తప్ప, కాంగ్రెస్ గొప్పతనం కాదు, రేవంత్ చరిత్ర ఎంతమాత్రమూ కాదు.

మొదటి నుంచీ రేవంత్ రెడ్డి నైజం ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు ఉంటుంది. దిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలైన కవితకు కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వీతో బెయిల్ ఇప్పించి, ఇందుకు ప్రతిగా ఆయనను తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపించిన రేవంత్ రెడ్డి, బిజెపి-బీఆర్ఎస్ ఒక్కటి కావడంతోనే బెయిల్ వచ్చిందని చెప్పడం ఆయన ఈ నైజానికి మరో నిదర్శనం. అప్పుడు సుప్రీం కోర్టు చివాట్లు పెడితే కోర్టుకు క్షమాపణలు చెప్పాడు కానీ, తన అబద్ధాల మాటల గారడీని మాత్రం మానుకోలేదు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న మరో నైజం ‘‘అప్పట్లో బుట్టో.. ఇప్పుడు ముషారఫ్’’ అన్న మాటతీరు. నెహ్రూ నుంచి మొదలుకొని రాహుల్ గాంధీ వరకు ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీలను రేవంత్ రెడ్డి తిట్టని తిట్టు లేదు. వైఎస్సార్ బతికున్నంత కాలం ఆయనను ఏనాడూ మెచ్చుకోలేదు. పీవీ నర్సింహా రావు విషయంలోనూ అదే తీరు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కొత్తలో ఎన్టీఆర్ కు తనే రాముడు, కృష్ణుడు అన్న అహంభావం ఉండేదని అవమానకరంగా విమర్శించారు. ఇప్పుడు తన రాజకీయ అవసరాల కోసం తిట్టినోళ్లకే భజన చేస్తున్నారు. తెలంగాణ బలిదేవతగా అభివర్ణించిన సోనియాగాంధీని భారతమాత అని కీర్తిస్తూ, తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెనువెంటనే భార్యతో సహా ఆమెకు బహిరంగంగా పాదాభివందనం చేయడం ఆయనలోని ద్వంద్వ వైఖరికి ఓ ఉదాహరణ.

గత రెండున్నర నెలలుగా ధాన్యం కొనుగోళ్లలో రైతులను అష్టకష్టాలు పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని కలచివేసి, ‘వడ్లు కొనండయ్యా, మక్కలు కొనండయ్యా’ అని కాంగ్రెస్ నాయకులకు చెప్పేలా చేసింది. కళ్లాల్లో రైతులు గుండె ఆగి చనిపోయారు. ధాన్యం కొనుగోళ్లలో రైతుల కష్టాలకు కారణం కాంగ్రెస్, రేవంత్ ప్రభుత్వ వైఫల్యామా.. లేక కుట్రనా అనేది తెలంగాణ ప్రజలకు అర్థం కాని విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేని ధాన్యం కొనుగోలు సమస్య ఒక్క తెలంగాణలోనే ఎందుకు వస్తుందని కిషన్ రెడ్డి రాష్ట్ర సర్కార్ ను నిలదీశారు. దేశంలో మొత్తం ధాన్యం కొనుగోలులో 60 శాతం తెలంగాణ నుంచే ఉన్నా కాంగ్రెస్ నాయకులు, రేవంత్ చేస్తున్న దగాకోరు ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రతి గింజా కొంటామన్నారే తప్ప.. కేంద్రం కొంటేనే మేం కొంటామనలేదు. కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 53 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కొంటామని ఒప్పందం చేసుకుంటే, రైతుల దగ్గర సరైన ధరకు కొననీయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు రైస్ మిల్లర్లను బెదిరించి, కళ్లాల్లోనే ధాన్యం ఎండకు ఎండి, వానకు నాని తీవ్రంగా దెబ్బతినేలా చేశారు. ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్రకు వచ్చిన విశేష స్పందనకు జడిసి కాంగ్రెస్ మంత్రులు కళ్లాలకు బయలు దేరారు తప్పితే రైతులపై ప్రేమతో కాదు. 

డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. అటు పిమ్మట 6 సంవత్సరాలు రాష్ట్రంలో, కేంద్రంలో, సంబంధిత పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోను కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నా, తుమ్మిడిహట్టి దగ్గర ప్రధాన బ్యారేజ్ ఎత్తు విషయంలో ఒప్పందం చేసుకోలేని దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలిసినప్పటికీ బిజెపిని, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఓ వీధి రౌడీలా బెదిరిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి అవకాశవాద ఆరోపణలు, అహంకార బెదిరింపులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా తిప్పికొట్టారు. ‘‘నన్ను ఆపే వ్యక్తి తెలంగాణలో పుట్టలేదు, కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్లు ఇచ్చింది, దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధం, దమ్ముంటే చర్చకు రా’’ అని సవాల్ విసిరారు. అది తప్పైతే కేంద్రమంత్రి పదవికి రాజీనామా కూడా చేస్తానని చెప్పారు. 

హైడ్రాను హిట్లర్ నుంచి స్ఫూర్తిగా తీసుకున్నానని రేవంత్ రెడ్డి చెప్పడం ఆయనలోని హిట్లర్ నియంతృత్వానికి నిదర్శనం. హైడ్రా గ్రీకు పురాణాల్లో తొమ్మిది తలల రాక్షసి, ఒక తల నరికితే రెండు తలలు పుట్టే లక్షణం దానికుంది. అలాంటి రాక్షసి పేరుతో ఒక సంస్థను పెట్టి పేద, మధ్య తరగతి హిందువుల ఇళ్లను, గుడిసెలను నిర్ధాక్షిణ్యంగా కూల్చారు. చెరువు మధ్యలో మట్టితో నింపి కట్టిన ఓవైసీ ఫాతిమా కాలేజీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యాసంస్థలు, గండిపేట ప్రాంతంలో పొంగులేటి, పట్నం మహేందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకుల భవనాలను హైడ్రా కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. రేవంత్ రెడ్డి హైడ్రా హిందువుల ఇళ్లను కూల్చడానికి, ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆస్తులను రక్షించడానికేనా? గోహత్యా నిషేధం చట్టం అమలులో ఉన్నప్పటికీ ఎంఐఎం ఎమ్మెల్యే ఆవుల లోడుతో వెళ్తున్న లారీని ఎత్తుకెళ్తుంటే, అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా, బాజాప్తా పంపించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందూ ద్వేషం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. గత రెండున్నర సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఆర్టీసీ కార్మికులు అష్టకష్టాలు పడుతుండడాన్ని తెలంగాణ సమాజం గ్రహిస్తోంది. వీధి రౌడీ మాటలు మాట్లాడి తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించగలనని అనుకుంటే రేవంత్ రెడ్డి కన్నా మూర్ఖుడు మరొకరు ఉండరు. రేవంత్ రెడ్డి రౌడీ మాటల వెనుక కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.