మార్పు తీసుకురావాలన్న సంకల్పం గొప్ప బలం
మే 31న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
కేరళలోని ఆలువాలో సాజి వలాశేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్బును నడుపుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజి దివ్యాంగ పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్ని సంవత్సరాల కిందట ఒక పడవ ప్రమాదంలో చాలా మంది విద్యార్థులు మరణించారు. ఆ సంఘటన సాజిని తీవ్రంగా కలచివేసింది. పిల్లలకు ఈత వచ్చి ఉంటే ఎన్నో ప్రాణాలను కాపాడి ఉండేవాళ్ళమని ఆయన భావించారు. ఆ ఆలోచనతో ఆయన ఈ కృషి ప్రారంభించారు. సాజి వలాశేరిల్ జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. సేవకు గొప్ప వనరులు అవసరం లేదు. కావాల్సింది మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాలను మార్చవచ్చు.
ఇటీవల నాకు నెదర్లాండ్స్‌ను సందర్శించే అవకాశం లభించింది. నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ ప్రధానమంత్రి కూడా హాజరయ్యారు. ఈ రాగి ఫలకాల గురించి ప్రజల్లో చాలా ఆసక్తి ఉంది. అక్కడ 21 పెద్ద, మూడు చిన్న రాగి ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సంబంధించినవి. ఆనైమంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటున్నాయి. ఈ రాగి ఫలకాలు చోళ రాజవంశం విజయాలను కూడా వివరిస్తాయి. అవి చోళ సామ్రాజ్యం బలమైన సముద్ర శక్తిని వెల్లడిస్తాయి. ఆగ్నేయాసియా దేశాలతో వారి సంబంధాల గురించి కూడా అవి సమాచారాన్ని అందిస్తాయి.
భారతదేశ అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. ఈ విషయంలో ‘జ్ఞాన భారతం అభియాన్’ కింద ఛత్తీస్‌గఢ్‌లోని మల్హార్‌లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ మూడు అరుదైన రాగి ఫలకాలు లభించాయి. ఇవి పాండువంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు ఆరవ-ఏడవ శతాబ్దానికి చెందినవి. అంటే పద్నాలుగు వందల, పదిహేను వందల సంవత్సరాల పూర్వం నాటివన్నమాట. ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి, పాలి భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి.
మన భారతీయులకు ఖగోళశాస్త్రంపై ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతమైన గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి. పంచాంగం కానివ్వండి. లేదా మన పండుగలు ఏవైనా సరే… వాటన్నింటికీ ఆకాశం, నక్షత్రాలతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలోనూ ఖగోళశాస్త్రం కుతూహలాన్ని రేకెత్తించింది. ఇది అన్వేషణకు స్ఫూర్తినిచ్చింది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళశాస్త్ర క్లబ్‌లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుండి పార్కుల వరకు కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో ఖగోళశాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఒక కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ‘ఖగోళ్ మండల్’ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ప్రారంభించింది.
రాత్రిపూట నక్షత్రాలను చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలన శిబిరాలు, వర్క్‌షాప్‌లను నిర్వహిస్తుంది. ఇక్కడ యువత టెలిస్కోపులను తయారు చేయడం, నక్షత్ర పటాలను ఉపయోగించడం నేర్చుకుంటారు. రాజ్‌కోట్‌లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుండి రాన్ ఆఫ్ కచ్ వరకు అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలను నిర్వహించింది. ‘జ్యోతిర్విద్యా పరిసంస్థ’ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థలలో ఒకటి. ఇది పరిశీలన సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐఎస్ఏఏసి (ఐజాక్-ISAAC) గురించి కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఇది విద్యార్థులు నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్‌వర్క్. ఇది ఖగోళశాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్‌లను అనుసంధానిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. ‘నమామి గంగే అభియాన్’ కింద ప్రవేశపెట్టిన అంబులెన్స్ ఆ డాల్ఫిన్‌కు ఆశ కల్పించింది. అప్పుడు దాన్ని జాగ్రత్తగా రక్షించారు. దానికి పరీక్షలు చేసి, చికిత్స అందించి, ఆ తర్వాత సురక్షితంగా రాప్తి నదిలోకి విడిచిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తిరిగి వచ్చింది. ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా ప్రత్యేకమైనది. దీన్ని ఒక మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్‌ను సురక్షితంగా ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్‌కు గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుండి వేరుపడినా దానికి తక్షణమే సహాయం అందించవచ్చు. మనం గంగా డాల్ఫిన్‌ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడటం లేదు. మనం గంగానది జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి, మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని పరిరక్షిస్తున్నాం.
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమ నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో పరిశుభ్రంగా, జీవకళతో నిండిన ఆ నదిలో కాలక్రమేణా ప్లాస్టిక్ పేరుకుపోవడం మొదలైంది. ఆ మురికి పెరుగుతూనే ఉంది. “ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే” అనేది ఆయన మంత్రంగా మారింది. ఆయన తన స్నేహితులను సమీకరించారు. వారి దగ్గర కేవలం ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నిటికంటే మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలనే దృఢ సంకల్పమనే గొప్ప బలం ఉండేది. ఈ యువకులు నదిలోకి దిగి, నీటి నుండి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్‌ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒక్క రోజులోనే నది నుండి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్ళీ శుభ్రంగా కనిపించడం ప్రారంభించింది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజలలో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది.
బాలకృష్ణ గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పని చేయాలనే ఆయన ఉత్సాహం మాత్రం అలాగే ఉంది. మడ్డి-తోలాప్ ప్రాంతంలోని నీటి సమస్య ఆయనను తీవ్రంగా కలవరపరిచింది. ఆయన కూడా ఒక పరిష్కారం కోసం కృషి చేయడం ప్రారంభించారు. పైప్‌లైన్లు వేయడంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజూ నీటి కోసం పోరాడవలసి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది.
తమిళనాడులోని నాగర్‌కోయిల్‌లో ఒక ఉపాధ్యాయురాలిని కలిశాను. నేను దాదాపు మూడు దశాబ్దాల కిందట కూడా ఆమెను కలిశాను. ఆమె గిరిజా అమ్మ. ఈ సమావేశంలో ఆమెతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. గిరిజా అమ్మ సుమారు 15 పాఠశాలలను నడుపుతున్నారు. వీటిలో చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైనది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి ప్రేరణనిస్తుంది. ‘మన్ కీ బాత్’ స్ఫూర్తితో ఆమె దేశంలోని ఎందరో సైనికులకు విరాళం ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేశారు. ఇది చేయడానికి, ఆమె తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థులను ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజూ ఒక రూపాయి విరాళంగా ఇవ్వమని ఆమె పిల్లలను కోరారు. అంటే విద్యార్థుల్లో ప్రతి ఒక్కరి నుండి ఒక సంవత్సరంలో 365 రూపాయలు సేకరించారు. ఈ చిన్న విరాళాలు సుమారు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజా అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆమెకున్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య, సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించడంలో ఈ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయం.

