మీనాక్షీ నటరాజన్‌కు వెన్నుపోటుపై తెలంగాణ కాంగ్రెస్ అతలాకుతలం
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ్యప్రదేశ్ మంత్రి కైలాష్ విజయ్ వర్గీయ పేల్చిన బాంబుకు ఏఐసీసీ నేతలు కకావికలం అయ్యారు. కుట్రకు మూలం ఎక్కడ? ఈ పని ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని దిల్లీ కాంగ్రెస్ వార్‌రూంలో చర్చలు జజరిగినా ఫలితం లేకపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నేతలే తనకు వెన్నుపోటు పొడిచారని మీనాక్షీ నటరాజన్ స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెప్పినట్టు తెలిసింది. నామినేషన్ పత్రాల వ్యవహారాలు చూసుకొనేందుకు పార్టీ లీగల్ సెల్ ఉన్నప్పటికీ, తనకు సహకారం అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. కోవర్టు రాజకీయాల వల్లే ఈ అంశం మధ్యప్రదేశ్ దాకా వెళ్లిందని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పినట్టు తెలిసింది.
మీనాక్షి ఫిర్యాదు నేపథ్యంలోనే తనను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద రాహుల్ సీరియస్ అయినట్టు తెలిసింది. అయితే పార్టీ పరువు కాపాడటం కోసం కాంగ్రెస్ లో వారెవ్వరి ప్రమేయం లేదని, అంతా బిజెపి జరిపిన కుట్ర అంటూ ఆమె హైదరాబాద్ మీడియా సమావేశంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందిస్తూ దీని వెనుక అసలేం జరిగిందనే కోణంలో ఇప్పటికే అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతున్నదని తెలిపారు. పార్టీ అంతర్గత సమాచారం, వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో ఉంటూనే ప్రతిపక్షాలకు మేలు చేస్తున్న కోవర్టులెవరో గుర్తించే పనిలో నాయకత్వం ఉందని స్పష్టం చేశారు. ‘ఈ వ్యవహారంలో లీకుల వీరులు ఎవరో? గ్రీకువీరులు ఎవరో త్వరలోనే బయటపడుతుంది’ అని హెచ్చరించారు. తన ప్రభుత్వ వ్యవహారాలపై తరచూ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్న మీనాక్షి నటరాజన్‌తో ముఖ్యమంత్రి సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటుండడంతో ఈ విషయమై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు భావిస్తున్నారు.
గాంధీ భవన్ అడ్రస్ మీదే మీనాక్షికి కోర్టు నోటీసులు వచ్చినా, వాటిని గోప్యంగా ఎందుకు ఉంచారు? కేసు వివరాలను దాచిపెట్టడంలో ఉద్దేశం ఏమిటి? నిరుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తెలంగాణకు రావడం, ఇక్కడి ముఖ్యనేతలను కలవడానికి ప్రత్యేకమైన కారణాలేం ఉన్నాయి? అంటూ లోతుగా శోధిస్తున్నారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం నామినేషన్ పత్రాల్లో పోలీసు, కోర్టు కేసులు వెల్లడించాల్సి ఉంటుందనే విషయం తెలిసి కూడా, పోలీస్ క్లియరెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
కాంగ్రెస్ లో కోవర్ట్ ఎవరు?
మీనాక్షి నటరాజన్‌పై ఉన్న కేసును బయటపెట్టిన కాంగ్రెస్ కోవర్టు ఎవరు? అంటూ బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ మద్దతుదారులు మీనాక్షీ నటరాజన్ అంశంపై బిజెపి మీద ఆరోపణలు చేస్తున్నారని, అయితే తెలంగాణలో నమోదైన కేసును పబ్లిక్ డొమైన్‌లోకి తీసుకొచ్చిందెవరు? అని ఆయన ప్రశ్నించారు. ముందు కాంగ్రెస్‌లోని కోవర్టులను పట్టుకొని పరిస్థితులు చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్ పార్టీకి ఆయన హితవు పలికారు. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంలో ఆమెపై కేసు వివరాలను చాటుగా సీఎం రేవంత్ రెడ్డే ఇచ్చి ఉండొచ్చని బిజెపి ఎంపీ డి. అర్వింద్ అనుమానం వ్యక్తంచేశారు. ‘తెలంగాణలో మీనాక్షీ నటరాజన్‌పై కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్‌కు కల ఏమైనా వచ్చిందా?’ అంటూ ఎద్దేవా చేశారు. ఇది కాంగ్రెస్ కుట్రనా? రేవంత్ కుట్రనా? అనేది ఆ పార్టీ విచారణ చేయించుకోవాలని సూచించారు. మహిళకు రాజ్యసభ సీటిస్తే బిజెపి అడ్డుకుంటున్నదని మంత్రి సీతక్క ఆరోపిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా మీనాక్షి నామినేషన్‌ను నితిన్ నబీన్ నింపాడా? అని ఎదురు ప్రశ్నించారు. మరోవంక, మీనాక్షీనటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్ర కోణం దాగి ఉన్నదంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ సీసీఎస్ పోలీసులకు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ‘తెలుగు స్ర్కైబ్’ యూట్యూబ్ చానల్ మీద సైబర్‌క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన ఎంపీ చామల ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రతిష్ట, వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తెలుగు స్ర్కైబ్ వ్యవహరించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై పలు మీడియాసంస్థలు కాంగ్రెస్ నుంచే బిజెపికి లీకులు వెళ్లాయని వార్తలు రాశాయి.
ఇంతకీ ఏమిటా కేసు?
నారాయణపేట కాంగ్రెస్ నేతపై ఉన్న లైంగిక ఆరోపణల కేసులే మీనాక్షి మెడకు చుట్టుకున్నట్టు తెలిసింది. ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేయడంతో పాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌రెడ్డిపై ఒక మహిళా కాంగ్రెస్ నాయకురాలు ఫిర్యాదు చేశారు. శివకుమార్ రెడ్డి మీద 2022 మే 7న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో, 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్‌స్టేషన్‌లో వేధింపుల కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్టు చేయాలంటూ సదరు మహిళ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ముందస్తు బెయిల్ కోసం శివకుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆయనను ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్‌గా నియమించింది. ఆయన మేనకోడలికి టికెట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి, శివకుమార్ రెడ్డి ఒకే వేదిక మీద కూర్చున్న వీడియోలు సంపాదించి, ఆయనపై చర్యలు తీసుకోవాలని సదరు మహిళ మీనాక్షి నటరాజన్ వద్దకు వెళ్ళింది. శివకుమార్ రెడ్డిని ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని చెప్పినట్టు సమాచారం. ఈ సమాధానంపై సంతృప్తి చెందని సదరు మహిళ కోర్టును ఆశ్రయించి, మీనాక్షిని కూడా తన పిటిషన్లో ప్రతివాదిగా చేర్చారు.
ప్రవీణ్

