Metro

మెట్రోరైల్‌ ఫేజ్‌-2లో రేవంత్ ప్రభుత్వ అలసత్వం బహిర్గతం

మెట్రోరైల్‌ ఫేజ్‌-2 అనుమతులు, పెండింగ్‌ నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగా జాప్యం చేస్తున్నదని, ముఖ్యంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న ఆరోపణలకు బ్రేక్ పడింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్ లతో వరుసగా ముఖ్యమంత్రి జరిపిన ఉమ్మడి భేటీలలో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జాప్యం ఏమాత్రం లేదని, రాష్ట్ర ప్రభుత్వ ఆలస్యం కారణంగానే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడం లేదని స్పష్టమైంది. రైల్వే శాఖ పరంగా ఎలాంటి అడ్డంకులు లేవని, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి జరుగుతున్న జాప్యం ఎక్కడ ఉందో తెలుసుకోమని రైల్వే మంత్రి తేల్చి చెప్పడంతో రేవంత్ రెడ్డి ఏమీ మాట్లాడలేకపోయారు. పైగా, జపాన్‌ నుంచి నేరుగా రుణం వచ్చిందని ఎందుకు అబద్ధాలు చెప్తున్నారంటూ నిలదీయడంతో ముఖ్యమంత్రి సమాధానం చెప్పలేకపోయారు. పైగా, ఈ విషయంలో కిషన్ రెడ్డిని దోషిగా చూపుతూ సీఎం రేవంత్‌ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలపై అశ్వినీ వైష్ణవ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ‘కిషన్‌ రెడ్డి, కేంద్ర ప్రభుత్వం వేర్వేరు కాదు. మీరు కిషన్‌ రెడ్డిని తిడుతూ కేంద్రం వద్ద సహాయం ఎలా అడుగుతారు? మెట్రోపై మీకసలు చిత్తశుద్ధి లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నారా? ఖట్టర్‌ను కలవండి. అంతా ఒకే అనుకుంటే అప్పుడు చూద్దాం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. 

మెట్రో అంశం రైల్వే శాఖ పరిధిలోనిది కానందున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో తాను మాట్లాడతానని హామీ ఇవ్వడంతో పాటు వెంటనే ఆ శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం నిన్నమొన్నటి వరకు మెట్రో నిధుల విషయంలో పరస్పరం తీవ్ర విమర్శలు, సవాళ్లతో విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి రాజకీయ విభేదాలను పక్కనబెట్టి చివరకు ఒక్కటిగా వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. ఈ సమావేశాలకు అపాయింట్మెంట్‌ కూడా కిషన్‌ రెడ్డే తీసుకున్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కిషన్‌ రెడ్డి ఆపేశారని, ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ) ఖాతాలో జమయిన రూ.13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని అంతకుముందు వారం సీఎం రేవంత్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బిజెపికి లేదని తీవ్రంగా ఖండించిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులతో జరిపిన భేటీలలో ముఖ్యమంత్రి ఆడుతున్న అబద్దాలను బహిర్గతం కావించారు. జపాన్‌ ప్రభుత్వం సహకరిస్తామని చెప్తున్నా వారితో ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం రేవంత్‌ అసమర్థత, అడ్మినిస్ట్రేటివ్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం కాదా? అని కేంద్రం అసహనం వ్యక్తంచేసినట్టు తెలిసింది. 

ప్రభుత్వం మెట్రో రైల్‌ ప్రాజెక్టుల్లో అనేకసార్లు మార్పులు చేస్తున్నా, డీపీఆర్‌ సరిగ్గా సమర్పించకపోయినా వాటిని స్వీకరిస్తూ రాష్ర్టానికి నిర్మాణాత్మక సలహాలు, సహకారాన్ని అందించామని కేంద్రం వెల్లడించింది. అయినా సీఎం రేవంత్‌రెడ్డి ఐఆర్‌ఎఫ్‌సీ గురించి, ఎల్‌అండ్‌టీ-ఐఆర్‌ఎఫ్‌సీ ఒప్పందం గురించి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, జపాన్‌ ప్రభుత్వం నుంచి మెట్రో ప్రాజెక్టుకు నేరుగా రుణం వచ్చిందని చెప్పడం పూర్తిగా అబద్ధమని కేంద్రం కడిగిపారేసినట్టు తెలిసింది. హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టు ఫేజ్‌-1కు వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ కింద ఇప్పటివరకు రూ.1,204 కోట్లు ఇచ్చామని, కానీ.. ఫేజ్‌-1, ఫేజ్‌-2 విషయంలో కాంగ్రెస్‌ సర్కార్‌ అనుసరిస్తున్న తీరు తన అసమర్థ విధానాలను ప్రతిబింబిస్తున్నదని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఫేజ్‌-2 విషయంలో తర్జనభర్జనలు జరుగుతున్న సమయంలోనూ చొరవ తీసుకొని రెండు ప్రత్యామ్నాయాలను సూచించినట్టు తెలిపింది. రూ.10 వేల కోట్లు తక్కువ ఖర్చయ్యేలా ఆర్‌ఆర్‌టీఎస్‌ ఫార్ములాను సూచించామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని తెలిపింది. రాష్ట్రం చెప్పిన ఫార్ములా ప్రకారం సహకరించేందుకు అంగీకరించినా రేవంత్‌ ఎందుకు అసహనం ప్రదర్శిస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నది. కాగా రేవంత్‌ సీఎం కాకముందు నుంచే తాను హైదరాబాద్‌ మెట్రో కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు కిషన్‌ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని పలుమార్లు కలిసి నివేదికలు అందజేసినట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున అధికారులను త్వరగా నామినేట్‌ చేయాలని, తద్వారా ప్రక్రియ ఆలస్యం కాకుండా మెట్రో విస్తరణ వేగవంతం అవుతుందని సీఎం రేవంత్‌ రెడ్డికి సూచించానని వివరించారు. కానీ తనపై ముఖ్యమంత్రి తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

భారతదేశంలో మౌలికవసతుల ప్రాజెక్టులకు జపాన్‌ 25 ఏండ్లుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నది. దిల్లీ మెట్రోలో జైకా మొట్టమొదటిసారిగా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2002లో నాటి ప్రధాని వాజ్ పేయి 8.3 కిలోమీటర్ల దిల్లీ మెట్రో ఫస్ట్‌ సెక్షన్‌ (రెడ్‌ లైన్‌– 6 స్టేషన్లు)ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు జపాన్‌ రూ.55 వేల కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. 2026లో జపాన్‌ ప్రభుత్వం అఫీషియల్‌ డెవలప్మెంట్‌ అసిస్టెన్స్‌ (ఓడీఏ) రుణాలు ఇచ్చింది. బెంగళూరు ఫేజ్‌-3 మెట్రోకు రూ.6,100 కోట్లు, ముంబై మెట్రో లైన్‌ 11 ప్రాజెక్టు-1కు రూ.5,500 కోట్లు ఇచ్చింది. ఇది కాకుండా చెన్నై మెట్రో, అహ్మదాబాద్‌ మెట్రోకు కూడా జపాన్‌ ప్రభుత్వం సహకరిస్తున్నది. తమకు కూడా జపాన్‌ బ్యాంకు డబ్బులిస్తున్నదని రేవంత్‌ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ అసలు విషయం ఏంటంటే జపాన్‌ ప్రభుత్వం సహకరిస్తామని చెప్తున్నా వారితో ఒప్పందం కుదుర్చుకోలేకపోవడం రేవంత్‌ అసమర్థత, అడ్మినిస్ట్రేటివ్‌ ఫెయిల్యూర్‌కు నిదర్శనం కాదా? అనే విమర్శలు చెలరేగుతున్నాయి.

కృష్ణ చైతన్య