spm

ముఖర్జీకి ఘన నివాళి పశ్చిమ బెంగాల్ విజయం

(జులై 6 డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

ఏడాది జులై 6న డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆయన స్థాపించినప్పటికీ (జనసంఘ్) సొంతరాష్ట్రమైన బెంగాల్లో ఇప్పటివరకు ఒక్క ఎన్నికలో కూడా గెలవని బిజెపి చివరకు అదే రాష్ట్రంలో అఖండ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నిస్సందేహంగా ఇది ఆయనకు కోట్లమంది బిజెపి కార్యకర్తలు అర్పించే ఘననివాళి ఇది. దశాబ్దాల సుదీర్ఘ సైద్ధాంతిక నిబద్ధత, నిరంతర క్షేత్రస్థాయి కృషి తర్వాత బిజెపి ఒకప్పుడు అసాధ్యమనిపించిన దాన్ని సాధించి చూపించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు 2026 లో బిజెపి సాధించిన ఈ ఘన విజయం కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు, దశాబ్దాల క్రితం బెంగాల్ ఉత్తమ పుత్రులలో ఒకరైన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పునాది వేసి కలలు గన్న ఒక భావజాల పునరుజ్జీవనం.

ఈ ఎన్నికల తీర్పు సైద్ధాంతిక, సాంస్కృతిక ప్రాముఖ్యాన్ని అర్థం చేసుకోవాలంటే మనం చరిత్రలోకి ఒక్క అడుగు వెనక్కి వేసి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితాన్ని సింహావలోకనం చేసుకోవాలి. ఆయన కేవలం విపక్షంలో ఉన్నాం కనుక వ్యతిరేకించాలని వ్యతిరేకించిన నాయకుడు కాదు; జాతీయ సమగ్రత, సాంస్కృతిక విశిష్టత గురించి బలమైన ఆలోచనలు కలిగిన ఒక దార్శనిక చింతనాపరుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. నిజానికి ఈరోజు పశ్చిమ బెంగాల్ ఉనికిలో ఉందంటే దానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీయే కారణం. మొత్తం బెంగాల్‌ను (తూర్పు, పశ్చిమ) పాకిస్తాన్‌లో చేర్చాలనే ముస్లిం లీగ్ డిమాండ్‌కు వ్యతిరేకంగా ఒక బలమైన గోడలా నిలిచారు. భారత యూనియన్‌లో బెంగాలీ హిందువుల కోసం పశ్చిమ బెంగాల్ అనే సొంతగడ్డను ఏర్పాటు చేయడానికి, 1947 లో బెంగాల్ విభజన కోసం ‘బెంగాలీ హిందూ హోమ్‌ల్యాండ్ మూవ్‌మెంట్’ను ప్రారంభించారు.

పశ్చిమ బెంగాల్ ఇచ్చిన ఈ ఎన్నికల తీర్పులో లోతైన చారిత్రక ప్రాధాన్యం దాగి ఉంది. డెబ్భై నాలుగు సంవత్సరాల క్రితం, 1951-52 లో జరిగిన భారతదేశపు మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలలో, భారతీయ జనసంఘ్ తన తొలి ప్రయత్నంలో దేశవ్యాప్తంగా కేవలం మూడు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. విశేషమేమిటంటే, ఆ మూడు విజయాలలో రెండు బెంగాల్ నుంచే వచ్చాయి. ఒకటి ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సౌత్ కలకత్తా నుండి గెలవగా, మరొకటి ఝార్ గ్రామ్ నుండి దుర్గా బెనర్జీ సాధించారు. అప్పట్లో ఒక సాధారణమైన ఆరంభంగా అనిపించిన ఆ విజయం, ఈ రోజు ఒక ఉద్యమ నిప్పుకణంగా స్ఫూరిస్తోంది. పశ్చిమ బెంగాల్ గడ్డపై పుట్టిన ఆ ఉద్యమం, దశాబ్దాల పోరాటం, పట్టుదల తర్వాత ఎట్టకేలకు తన సొంత గూడైన బెంగాల్ కు చేరుకుంది. బిజెపిని తీర్చిదిద్దడమే కాకుండా, నవ భారత నిర్మాణానికి పునాది వేసిన గొప్ప స్రష్ట, మేధావి, న్యాయకోవిదుడు, సామాజిక సంస్కర్తకు ఒక హృదయపూర్వక నివాళి.

డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తండ్రి ప్రసిద్ధ బెంగాలీ విద్యావేత్త, న్యాయమూర్తి, గణిత శాస్త్రజ్ఞుడైన సర్ అశుతోష్ ముఖర్జీ. అశుతోష్ ముఖర్జీని ఆయన ధైర్యసాహసాలు, విద్యా నిబద్ధత, అద్భుతమైన పరిపాలనా సామర్థ్యానికి గాను ‘బంగ్లార్ బాగ్’ (బెంగాల్ పులి) అని పిలిచేవారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి వరుసగా నాలుగు సార్లు (1906-1914), అలాగే ఐదవ సారి (1921-23) వైస్-ఛాన్సలర్‌గా సేవలు అందించారు. కలకత్తాలో పలు ప్రధాన విద్యా, శాస్త్ర సాంకేతిక సంస్థల స్థాపనకు ఆయనే కారణం. పండితుడైన తండ్రి మాదిరిగానే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కూడా 33 ఏళ్ల పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత చిన్న వయస్కుడైన వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టి, 1938 వరకు ఆ పదవిలో కొనసాగారు. డాక్టర్ ముఖర్జీ లింకన్స్ ఇన్‌లో న్యాయశాస్త్రం అభ్యసించి, 1926 లో బార్ కౌన్సిల్‌లో చేరారు. 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి డి.లిట్ పట్టా పొందారు. తన పదవీకాలంలో ఆయన అనేక ప్రయోజనకరమైన మార్పులను తీసుకువచ్చారు. కలకత్తాలోని ఏషియాటిక్ సొసైటీ, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కౌన్సిల్, ఇంటర్-యూనివర్శిటీ బోర్డులతో చురుగ్గా పాలుపంచుకున్నారు.

డాక్టర్ ముఖర్జీ కలకత్తా విశ్వవిద్యాలయం తరఫున బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు కూడా ఎన్నికయ్యారు. కృషక్ ప్రజా పార్టీ-ముస్లిం లీగ్ సంకీర్ణం అధికారంలో ఉన్నప్పుడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఏ.కే. ఫజ్లుల్ హక్ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్ కోయలిషన్ మినిస్ట్రీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, దానికి ఆర్థిక మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 1939 లో హిందూ మహాసభలో చేరి, 1940 లో దానికి తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడమే హిందూ మహాసభ ఏకైక రాజకీయ లక్ష్యమని ఆయన ప్రకటించారు. 1946 లో ఆయన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ క్యాబినెట్‌లో పరిశ్రమలు, సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వ తొలి పారిశ్రామిక విధానాన్ని ఆయనే రూపొందించారు.

1947 లో భారతదేశ విభజన సమయంలో, అప్పటి బెంగాల్ ప్రధానమంత్రి హుస్సేన్ షహీద్ సుహ్రావర్దీ.. బెంగాల్ ప్రావిన్స్‌ను అఖండ, సార్వభౌమ రాజ్యంగా మార్చాలనే కుటిలమైన ‘యునైటెడ్ బెంగాల్’ (ఐక్య బెంగాల్) ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఆర్థిక సమగ్రత, పరస్పరం ఆధారపడటం, బలమైన రాజ్యాన్ని నిర్మించాల్సిన అవసరం దృష్ట్యా బెంగాల్ అవిభాజ్యమైనదని ఆయన గట్టిగా వాదించారు. అయితే ఈ ఐక్య బెంగాల్ ప్రతిపాదన హిందువులను ముస్లిం పాలనలో బతికే పరిస్థితికి గురిచేస్తుందని నమ్మిన డాక్టర్ ముఖర్జీ నేతృత్వంలోని హిందూ మహాసభ, దీనికి వ్యతిరేకంగా తీవ్రమైన ఉద్యమాన్ని ప్రారంభించింది. వైస్రాయ్ మౌంట్‌బాటన్‌కు రాసిన లేఖలో ముఖర్జీ ఇలా వాదించారు: “గడిచిన పదేళ్ల బెంగాల్ పరిపాలనపై ఎప్పుడైనా నిష్పాక్షికమైన సర్వే జరిగితే.. హిందువులు కేవలం మతపరమైన అల్లర్లు, అలజడుల వల్లే కాకుండా విద్యా, ఆర్థిక, రాజకీయ, మతపరమైన అన్ని రంగాలలోనూ తీవ్రంగా నష్టపోయారని స్పష్టమవుతుంది.”

డాక్టర్ ముఖర్జీ 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్‌ను స్థాపించి, దానికి మొదటి అధ్యక్షుడయ్యారు. ఇదే 1980లో బిజెపిగా అవతరించింది. ఆయన పార్లమెంటులో 32 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. స్వతంత్ర భారతదేశ క్యాబినెట్‌లో డాక్టర్ ముఖర్జీ అనధికారిక ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు. అధికరణం 370 జమ్మూ కాశ్మీర్‌కు సొంత జెండా, సొంత చట్టం, సొంత ప్రధానమంత్రిని అందించింది. అలాగే భారతీయులు తమ సొంత ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒకసారి, ‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే” (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు) అని సింహగర్జన చేశారు. డాక్టర్ ముఖర్జీ 1953 లో కాశ్మీర్‌ను సందర్శించడానికి వెళ్లారు. కాశ్మీర్ సరిహద్దు దాటుతుండగా మే 11 న ఆయనను అరెస్టు చేశారు. తనకు పెన్సిలిన్ అలర్జీ ఉందని ఇన్-ఛార్జ్ వైద్యుడికి తెలిపినప్పటికీ, ఆయనకు పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు. ఫలితంగా 1953 జూన్ 23 న ఆయన నిర్బంధంలోనే కన్నుమూశారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆయన అరెస్టును, మరణాన్ని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ‘నెహ్రూ కుట్ర’గా అభివర్ణించారు.

బిజెపి 2026 విజయాన్ని చారిత్రాత్మకం చేసింది దాని గెలుపు స్థాయి కాదు, దాని ప్రతీకాత్మక ప్రాధాన్యం. భారతీయ జనసంఘ్ ఏ గడ్డ మీదయితే ఉద్భవించిందో, ఆ నేలను సాంస్కృతికంగా పునరుద్ధరించడమే దీని ప్రత్యేకత. 1952 లో పశ్చిమ బెంగాల్ నుంచి పార్లమెంటులో కేవలం రెండు సీట్లు సాధించిన నాటి నుంచి 2026 లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 200 కి పైగా సీట్లు సాధించే వరకు-పశ్చిమ బెంగాల్ చరిత్ర చివరకు తన అసంపూర్ణ అధ్యాయాన్ని అత్యంత అద్భుతంగా ముగించింది!

శిశిర్ బజోరియా, పశ్చిమ బెంగాల్‌ బిజెపి నాయకుడు
శుభేందు ఆనంద్, సుప్రీంకోర్టు న్యాయవాది