‘ఎస్ఐఆర్’పై కాంగ్రెస్ పస లేని విమర్శలు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ. ఇది ఒక పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. కాంగ్రెస్ లేదా బిజెపి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఓటర్ల జాబితా పారదర్శకత, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం కోసం ఈసీ ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేపడుతుంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వేలు నిర్వహిస్తుంది. అయితే, రాజకీయ పార్టీలు తమ స్వప్రయోజనాలు, భవిష్యత్తు ఎన్నికల సమీకరణాల కోసం ఈ ప్రక్రియను వివాదాస్పదం చేయడం దురదృష్టకరం.
అవినీతి, అక్రమాలకు పర్యాయపదంగా మారిన కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు. కేంద్రంలో, అనేక రాష్ట్రాల్లో అధికారానికి దూరమైనా కాంగ్రెస్ తమ ఓటమికి కారణాన్ని గుర్తించలేకపోతుంది. తమ నాయకత్వం వైఫల్యాలను అంగీకరించలేక ఓటమికి కారణాలు వెతకడం కాంగ్రెస్ కు అలవాటుగా మారింది. సాధారణంగా ఒక రాజకీయ పార్టీ తమ పరాజయానికి అసలు కారణాలను విశ్లేషించి, ఆ ఫలితం పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి. కానీ, కాంగ్రెస్ తమ నాయకత్వానికి మరీ ముఖ్యంగా పప్పుగా ప్రజలు చీదరించుకుంటున్న యువరాజు అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఈవీఎంలు టాంపర్ అయ్యాయని, ఎస్ఐఆర్ ను దుర్వినియోగం చేస్తున్నారని సాకులు వెతుకుతూ కాలం గడుపుతోంది.
ఈవీఎంలను తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఒకవేళ ఈవీఎంలను టాంపర్ చేయగలిగితే అందుకు మొదటి అవకాశం కాంగ్రెస్ కే ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ ఈవీఎంలను టాంపర్ చేసి, వరుసగా అధికారాన్ని నిలబెట్టుకొని ఉండేది. కానీ, కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం ఈవీఎంలు టాంపర్ అయ్యాయంటూ తమను తాము మభ్యపెట్టుకుంటోంది. అదే కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ప్రజలు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చారంటారు. అప్పుడు ఈవీఎంలు టాంపర్ అయ్యాయనే విషయం గుర్తుకురాదు. ఇప్పుడు ఆ కోవలోనే కాంగ్రెస్ ఎస్ఐఆర్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఎస్ఐఆర్ ను బిజెపి దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీల ఓట్లు, లౌకిక ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తోందని వాదిస్తోంది. ఇవి ఫక్తు రాజకీయ ఆరోపణలు మాత్రమే. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు.
టీ. ఎన్. శేషన్ 1990 డిసెంబర్లో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నికల కమిషన్ శక్తేంటో ప్రజలకు తెలిసింది. శేషన్ ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల నియమావళిని కఠినంగా అమలు చేసి ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దీనిని ఓర్వలేని కాంగ్రెస్ రాజ్యాంగ సవరణతో అప్పటివరకు ఒకే ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పనిచేసిన ఎన్నికల కమిషన్‌ను ముగ్గురు సభ్యుల సంస్థగా మార్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించింది. కాంగ్రెస్ హయాంలో నియమితులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ షాబుద్దీన్ యాకుబ్ ఖరేషి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కరోనా సోకాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు. ఇలా ఎలక్షన్ కమిషన్ ను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఎస్ఐఆర్ విషయంలో బిజెపిపై ఆరోపణలు చేయడం గురివింద సామెతను జ్ఞప్తికి తెస్తోంది.
గతంలో కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి సవరణలు జరిగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి ఈ ప్రక్రియను తప్పుబట్టలేదు, విమర్శించలేదు. ఇప్పుడు బిజెపి హయాంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా ఓటర్ల జాబితాలోని డూప్లికేట్, చనిపోయిన వారి ఓట్లను తొలగిస్తుంటే కాంగ్రెస్ అనవసరమైన రాజకీయ ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. కాంగ్రెస్ హయాంలో రాజ్యాంగబద్ధమైన ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పుడు రాజ్యాంగ విరుద్ధం ఎలా అయ్యింది? ఓటుబ్యాంకు రాజకీయాలే కారణమా?
అర్హులైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించడం ఎంత ముఖ్యమో, అనర్హుడి ఓటును తొలగించడమూ అంతే ముఖ్యం. ఓటరు జాబితా ఎంత పరిశుద్ధంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పరిపుష్టంగా ఉంటుంది. అందుకే ఎస్ఐఆర్ సమర్థంగా అమలు చేసేలా బిజెపి తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు విస్తృతంగా శిక్షణ ఇస్తోంది. జాతీయస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు కార్యశాలలు నిర్వహిస్తోంది. అర్హుడైన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు దక్కేలా, అనర్హుడికి తొలగించేలా బీఎల్ఏ-1, బీఎల్ఏ-2 లకు పలుమార్లు శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ కూడా ఒక్క అర్హుడి ఓటు తొలగించకుండా, అనర్హుడికి ఓటు హక్కు దక్కకుండా తమ కింది స్థాయి కార్యకర్తలకు తగిన శిక్షణ ఇవ్వాలి. దానిని విస్మరించి కేవలం బిజెపిని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించాలన్న నెపంతో విమర్శిస్తే ఆ పార్టీనే ప్రజల్లో అభాసు పాలవుతుంది.
ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం ప్రజలదే. అధికారంలో ఎవరు ఉండాలో ఓటు ద్వారా ప్రజలే నిర్ణయిస్తారు. ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయ పార్టీలు ప్రజల నమ్మకం పొందాలి, విశ్వాసాన్ని సంపాదించాలి, సానుకూల అభిప్రాయాన్ని కూడగట్టాలి. అందుకు ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాటికి పరిష్కారాలు చూపింపాలి. ఈ విషయాన్ని 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ గుర్తించడం లేదు. సుపరిపాలన, పారదర్శకత, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ప్రజల విశ్వాసాన్ని పెంచుతాయి. అందుకే బిజెపి ప్రజల మనసు గెలుచుకుంటోంది, వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ ఉంది.

