Nitin Nabin SPM

శ్యామా ప్రసాద్ కలలను సాకారం చేస్తున్న మోదీ ప్రభుత్వం

Nitin Nabin SPMప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలకు సాకారం చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేయడం డాక్టర్ ముఖర్జీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. జూన్ 23న దిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. దేశ తొలి పరిశ్రమల మంత్రిగా, గొప్ప జాతీయవాదిగా, దూరదృష్టి కలిగిన నాయకుడిగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ సేవలను నితిన్ నబీన్ స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, జాతీయవాద భావజాల పరిరక్షణ కోసం ఆయన చేసిన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పంజాబ్ వంటి సరిహద్దు రాష్ట్రాల భౌగోళిక సమగ్రత, జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు డాక్టర్ ముఖర్జీ చేసిన పోరాటం నేటికీ ఆదర్శమేనని నితిన్ నబీన్ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బిజెపి బలపడటం ఆయన ఆలోచనలకు లభిస్తున్న మద్దతుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జాతీయవాద భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు జనసంఘ్‌ను స్థాపించారని గుర్తుచేశారు. నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 14 కోట్లకు పైగా బిజెపి కార్యకర్తలు అదే జాతీయవాద సిద్ధాంతంతో దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలుగన్న భారతాన్ని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, లక్ష్యాలను నెరవేర్చేందుకు బిజెపి కార్యకర్తలు, మోదీ ప్రభుత్వం చేస్తున్న కృషే డాక్టర్ ముఖర్జీకి నిజమైన నివాళి అని అన్నారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బి.ఎల్. సంతోష్, జాతీయ ప్రధాన కార్యదర్శులు అరుణ్ సింగ్, దుష్యంత్ గౌతమ్, లోక్‌సభ సభ్యుడు, బిజెపి జాతీయ మీడియా విభాగం అధిపతి అనిల్ బలూనీ తదితరులు పాల్గొన్నారు.

సుంతుష్టీకరణ రాజకీయాలను వ్యతిరేకించిన ముఖర్జీ

భారతదేశంలో నేడు పశ్చిమ బెంగాల్ అంతర్భాగంగా ఉందంటే, దానికి డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోషించిన దృఢమైన, చారిత్రాత్మక పాత్రే కారణమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. హిందువుల రక్షణ కోసం ఆయన నిర్భయంగా పోరాడారని అన్నారు. విభజన, ఓటు బ్యాంకు, సంతుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారని స్పష్టం చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా జూన్ 23న హైదరాబాద్‌లోని బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఎన్. రాంచందర్ రావుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితర నాయకులు డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. దేశానికి చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. 

ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ రావు మాట్లాడుతూ… డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగానికి, ధైర్యానికి, రాజీలేని నిబద్ధతకు ఒక నిదర్శనమని కొనియాడారు. 1950ల నాటి కాశ్మీర్, హైదరాబాద్ పరిస్థితులను పోలుస్తూ నాడు అద్వానీ సూచన మేరకు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయ భవనానికి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరు పెట్టారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. నాటి రోజుల్లో హైదరాబాద్ నిజాం పాలనలో ఉండగా, జమ్మూ కాశ్మీర్ కూడా భారతదేశంతో పూర్తి విలీనం అయ్యే విషయంలో సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎలాగైతే నిర్ణయాత్మక పాత్ర పోషించారో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశంలో పూర్తి స్థాయిలో అంతర్భాగం చేయడం కోసం డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారని అన్నారు. 

డాక్టర్ ముఖర్జీ గొప్ప మేధావి, పరిపాలనదక్షుడు అని, అత్యంత పిన్న వయస్సులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారని గుర్తుచేశారు. ఎన్నో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగత అధికారం లేదా పదవుల కంటే కూడా ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. జాతీయ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న సంతుష్టీకరణ, రాజీ ధోరణిని అంగీకరించలేక డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ క్యాబినెట్ నుండి రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఆయన జీవితం బిజెపి కార్యకర్తలకు నేషన్ ఫస్ట్ (దేశానికే తొలి ప్రాధాన్యం) అనే మార్గదర్శక మంత్రాన్ని అందించిందని అన్నారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, కమ్యూనిస్టు, టీఎంసీ పార్టీలు బెంగాల్‌ను అభివృద్ధికి దూరం చేశాయని, అయితే నేడు బిజెపి నాయకత్వంలో బెంగాల్‌లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను పునరుద్ధరించడం జరుగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి బిజెపి కార్యకర్త బెంగాల్‌లోని బిజెపి విజయాల నుండి స్ఫూర్తి పొంది, దానిని తెలంగాణలోనూ పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు.