జెన్ Z

ఘనంగా “నమో జెన్Z కాన్‌క్లేవ్”

gen Zరాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు యువత పెద్ద ఎత్తున ముందుకు రావాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక బలమైన యువజన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. నేటి యువతకు విద్యా నైపుణ్యాలతో పాటు రాజకీయ చైతన్యం, అవగాహన కూడా ఎంతో అవసరమన్నారు. రాష్ట్రంలో యువత హక్కుల కోసం, ఉద్యోగాల కోసం, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ తక్షణ విడుదల కోసం బిజెపి తరఫున రాజీలేని పోరాటం చేస్తామని, ఈ పోరాటంలో యువతకు బిజెపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఆధ్వర్యంలో “నమో జెన్Z కాన్‌క్లేవ్” జూన్ 23న హైదరాబాద్‌ బాగ్ లింగంపల్లిలోని RTC కళాభవన్ లో ఘనంగా జరిగింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బిజెపి శాసనసభా పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని యువతకు మార్గదర్శనం చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశంలో చోటుచేసుకున్న అభివృద్ధి, యువత సాధికారత, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్ట్‌అప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు లభించిన అవకాశాల గురించి వివరించారు. యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే మోదీ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు యువత జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులపై విస్తృత చర్చ జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎన్. రాంచందర్ రావు ప్రసంగిస్తూ.. జాతి నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని, క్రమశిక్షణతో కూడిన సమయ పాలన, దేశభక్తి కలిగిన యువతతోనే నవభారత నిర్మాణం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. విద్య అనేది కేవలం ఒక ఉద్యోగం కోసం మాత్రమే కాదని, కేవలం ప్రొఫెషనల్ కోర్సుల వెనుకే పరుగెత్తకుండా విద్యార్థులు తమకు నచ్చిన బీఏ, బీఎస్సీ, బీఈడ్, ఎమ్మెస్సీ వంటి సంప్రదాయ కోర్సులను కూడా ఎంచుకోవాలన్నారు. ఎంతో మంది మహానుభావులు సాధారణ కోర్సులు చదివే దేశంలో ఉన్నత స్థానాలకు ఎదిగారని ఉదహరించారు. యువతకు నచ్చిన రంగంలో వైవిధ్యమైన నైపుణ్యాలు ప్రదర్శిస్తూ ముందుకు సాగాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి. హరీశ్వర్ రెడ్డి, మల్కా యశస్వి, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, అనితా రెడ్డి, శరత్ చంద్ర, సాయినాథ్, రాష్ట్ర కార్యదర్శులు శివచంద్రగిరి, వరప్రసాద్ రెడ్డి, అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, ప్రదీప్ రావు, ఝాన్సీ, కోశాధికారి నరేన్ దేశ్‌పాండే తో పాటు బీజేవైఎం రాష్ట్ర పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.