Wgl Meeting nitin

కమలం వికాసంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యం

Warangal Sabha Nitin Nabin‘‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల ముందు ఎండగట్టాలి” అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. యువత, రైతులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు బిజెపి కట్టుబడి ఉందని, ఈ వర్గాల అభివృద్ధి ద్వారానే తెలంగాణ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. జూన్ 29న వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో నిర్వహించిన బిజెపి బూత్ అధ్యక్షుల సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోరాటాలకు, ఆత్మగౌరవానికి, త్యాగాలకు ప్రతీకగా వరంగల్ గడ్డ అని అభివర్ణించారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూ.. ”2028లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. జాతీయవాద భావజాలంతో, భారతీయ సంస్కృతి విలువలను ఆధారంగా చేసుకుని తెలంగాణ అభివృద్ధికి కొత్త దిశను ఇవ్వాలన్నది బిజెపి సంకల్పం. ప్రతి బూత్‌లో కమలం వికసించాలి, ప్రతి బూత్‌లో బిజెపి విజయం సాధించాలి. అప్పుడే మన సంకల్పం సాకారం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి చేరవేయాలి. సమాజంలోని ప్రతి వర్గాన్ని బిజెపితో అనుసంధానం చేయాలి. ప్రతి వర్గం ఆశలు, ఆకాంక్షలకు బిజెపి వేదిక కావాలి.

కొంతమంది నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపిస్తారు. అలాంటి వారిని “పార్ట్‌టైమ్ పొలిటీషియన్స్” అంటాను. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు. కానీ బిజెపి కార్యకర్త మాత్రం ఎల్లప్పుడూ ఫుల్‌టైమ్ ప్రజాసేవకుడే. 2023లో తెలంగాణలో ప్రభుత్వం మారింది. ఎన్నో హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై కాకుండా, తమ పార్టీ ప్రయోజనాలు, నాయకుల రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతోంది. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని కుటుంబ ప్రయోజనాల కోసం వినియోగించింది. ఆ ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలకు వ్యతిరేకంగా బిజెపి కార్యకర్తలు నిరంతరం పోరాటం చేశారు. ఇప్పుడు తెలంగాణలో నిజమైన ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చగల శక్తి, సంకల్పం, నాయకత్వం బిజెపికే ఉంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు దేశంలో సామాన్య ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకొచ్చాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోట్లాది పేద కుటుంబాలకు ఉచిత ధాన్యం అందిస్తూ ఆహార భద్రత కల్పిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందిస్తూ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నాం. పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవనోపాధిని బలోపేతం చేస్తున్నాం. ప్రధానమంత్రి జనధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, ప్రభుత్వ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యే విధంగా పారదర్శక వ్యవస్థను తీసుకువచ్చాం. మహిళల గౌరవం, భద్రత కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లు నిర్మించి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచాం. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

పేదలు, రైతులు, మహిళలు, యువత సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం కట్టుబడి పనిచేస్తోంది. “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” అనే సిద్ధాంతంతో సమగ్ర అభివృద్ధి దిశగా దేశం ముందుకు సాగుతోంది. ఒకప్పుడు ఈ దేశం కరోనా మహమ్మారి అనే సంక్షోభాన్ని ఎదుర్కొంది. ప్రపంచమంతా స్తంభించిపోయిన ఆ సమయంలో, “భారత్ ఈ విపత్తు నుంచి ఎలా బయటపడుతుంది?” అనే ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి నాయకత్వంలో ఆ సంక్షోభాన్ని భారతదేశం విజయవంతంగా ఎదుర్కొని ముందుకు సాగింది. కరోనా ఆపత్కాలంలో దేశ ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించిన నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆ వ్యాక్సిన్ విదేశాల్లో కాదు.. మన భారతదేశంలోనే తయారైంది. అదే ఆత్మనిర్భర్ భారత్‌కు గొప్ప నిదర్శనం. దాదాపు 220 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందిస్తూ, భారతదేశ ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడటమే కాకుండా ప్రపంచ ఆరోగ్య రక్షణలో కూడా భారత్ కీలక పాత్ర పోషించింది.

2014కు ముందు దేశ భద్రతపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉండేది. దేశంలోని ఏ ప్రాంతంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరుగుతుందో, ఎప్పుడు ఉగ్రవాదులు సరిహద్దులు దాటి దేశంలోకి చొరబడి దాడి చేసి వెళ్లిపోతారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశంపై దాడి చేయాలని చూసిన ప్రతి దుష్టశక్తికి గట్టి సమాధానం ఇచ్చింది. ఈ రోజు భారత్ సర్జికల్ స్ట్రైక్‌లు చేసే దేశంగా, ఎయిర్ స్ట్రైక్‌లు చేసే దేశంగా ప్రపంచ దేశాల ముందు సత్తా చాటింది. ఆపరేషన్ సింధూర్ తో దేశ గౌరవాన్ని, జాతీయ భద్రతను కాపాడుతూ పాకిస్తాన్‌కు కూడా తగిన గుణపాఠం చెప్పాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో నక్సలిజాన్ని నిర్మూలించే దిశగా దేశవ్యాప్తంగా కీలక విజయాలు సాధించాం. కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో ఈ రోజు త్రివర్ణ పతాకం గర్వంగా ఎగురుతోంది. ఒకప్పుడు లాల్ చౌక్‌లో ఒకప్పుడు లాల్ చౌక్‌లో దేశ వ్యతిరేక శక్తులు సవాళ్లు విసిరిన పరిస్థితులు కూడా మనం చూశాం. భారత సైనికులపై దాడులు జరిగినా, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మౌనంగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 

ఇటీవల జరిగిన గ్లోబల్ AI సమ్మిట్‌కు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. AI రంగంలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుందని వారు స్పష్టంగా విశ్వసించారు. అయితే కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ విజయాన్ని దెబ్బతీయడానికి, దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించారు. కానీ భారత యువత ఇక అలాంటి దుష్ప్రచారాలకు మోసపోదు. AI, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీ, డీప్ టెక్ రంగాల్లో భారత్‌ను ప్రపంచ నాయకుడిగా నిలబెట్టేందుకు యువత నరేంద్ర మోదీ నాయకత్వంలో ముందుకు సాగుతోంది.

తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడితే, గత ప్రభుత్వాల పాలనలో అవినీతి పెరిగింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ అవినీతి పాలనను గద్దె దించాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై ఉంది. మతం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలన్న ప్రయత్నాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి సంపూర్ణంగా అందాలి. వారి హక్కులకు భంగం కలిగే విధంగా మతం లేదా ఇతర ప్రాతిపదికలపై రిజర్వేషన్లు ఇవ్వడాన్ని బిజెపి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి మార్గంలో వేగంగా ముందుకు సాగుతోంది. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది. జాతీయ రహదారి-163 కింద యాదాద్రి–వరంగల్ మధ్య 99 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి రూ.1,900 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.770 కోట్లతో పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. కాజీపేటలో రూ.521 కోట్లతో రైల్వే తయారీ యూనిట్ ఏర్పాటు పనులను కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వమే ముందుకు తీసుకెళ్తోంది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్ ప్రజల చిరకాల ఆకాంక్ష. మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు కలగన్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ కలను సాకారం చేస్తోంది. ఈ ప్రాజెక్టు వరంగల్ యువతకు భారీ ఉపాధి అవకాశాలతో పాటు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అవుతుంది. వరంగల్‌ను హెరిటేజ్ సిటీ అభివృద్ధి పథకం కింద రూ.196 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక సౌకర్యాలతో ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దుతాం.” అని అన్నారు.

వరంగల్ గడ్డపై బిజెపి జెండా రెపరెపలు ఖాయం‌

రాబోయే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ భారతీయ జనతా పార్టీకి బలమైన కేంద్రంగా ఉండేదని, గతంలో వరంగల్‌లో మేయర్ పదవిని కూడా దక్కించుకుందని అన్నారు. అయితే చాలాకాలంగా ఎమ్మెల్యే స్థాయిలో గానీ, కార్పొరేషన్ స్థాయిలో గానీ మనకు అవకాశం రాలేదని, ఆ పరిస్థితిని మార్చాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందన్నారు. వరంగల్ బిజెపి బూత్ అధ్యక్షుల సమావేశంలో ప్రసంగిస్తూ.. ”కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా జి. కిషన్ రెడ్డి బాధ్యతలు నిర్వహించిన సమయంలో వరంగల్ గర్వకారణమైన రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు లభించింది. ఇది వరంగల్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను చేపట్టింది. ఆసుపత్రుల అభివృద్ధి నుంచి మౌలిక వసతుల బలోపేతం వరకు అనేక రంగాల్లో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోంది. త్వరలోనే కాజీపేటలో రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో ఉత్పత్తి ప్రారంభం కానుంది. అదేవిధంగా పీఎం మిత్రా మెగా టెక్స్‌టైల్ పార్క్ నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ వరంగల్ అభివృద్ధికి కొత్త దిశను చూపించే ప్రాజెక్టులు.

 రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, మౌలిక వసతుల బలోపేతం..ఈ అంశాలపై భారతీయ జనతా పార్టీ నిరంతరం కట్టుబడి పనిచేస్తోంది. వరంగల్ నగరం నిజమైన అభివృద్ధి సాధించాలంటే ప్రస్తుత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఒక వర్షం పడితేనే నగరం మొత్తం నీటమునిగే పరిస్థితి ఉండకూడదు. హైదరాబాద్‌లో ఉన్న అనేక సమస్యలు వరంగల్‌లో కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చాల్సిన బాధ్యత మన అందరిదీ. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తే, కేంద్రంలో అమలవుతున్న అనేక అభివృద్ధి పథకాలను వరంగల్ నగరానికి తీసుకువచ్చి, ఈ నగరాన్ని ఒక అందమైన, అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దేందుకు మేము కృషి చేస్తాం.

వరంగల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌

గతంలో పదేళ్లు కాంగ్రెస్, ఆ తర్వాత పదేళ్లు బీఆర్‌ఎస్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ వరంగల్ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వరంగల్‌లో బిజెపికి ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం వరంగల్ రూపురేఖలను మార్చడానికి సుమారు రూ.17,000 కోట్ల విలువైన నిధులను మంజూరు చేసిందని వివరించారు. ఈ అభివృద్ధిపై వరంగల్ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్దకైనా లేదా అంబేద్కర్ చౌరస్తాకైనా తాము బహిరంగ చర్చకు సిద్ధమని, తమ పార్టీ శ్రేణులు పూర్తి వివరాలతో వస్తారని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అధినాయకత్వానికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

ఎప్పటికీ రాదనుకున్న కాజీపేట రైలు కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం వరంగల్‌కు తీసుకొచ్చిందని, ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన ఈ ఫ్యాక్టరీలో వచ్చే ఏడాది (2027) జనవరి నాటికి కోచ్‌ల తయారీ ప్రారంభం కానుందని తెలిపారు. వరంగల్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించుకున్నామని, ఖాజీపేట-బల్లార్షా మూడో లైన్ కోసం రూ.2,909 కోట్లు మంజూరు చేయడంతో పాటు కాజీపేట-విజయవాడ మూడో లైన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వరంగల్ విమానాశ్రయం త్వరలోనే ప్రారంభం కానుందని, అందులో ప్రయాణించే తొలి ప్యాసింజర్‌గా తాను ఉంటానని కిషన్ రెడ్డి ప్రకటించారు.

మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్రం మంజూరు చేసిన 7 మెగా టెక్స్‌టైల్ పార్కులలో ఒకదాన్ని వరంగల్‌కు కేటాయించామని, అలాగే వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ ఏడాదిలోనే ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా భూమిపూజ చేయనున్నారని తెలిపారు. వీటితో పాటు జిల్లాకు 110 ఎకరాల విస్తీర్ణంలో 77 పీఎం పాఠశాలలు, ఒక MSME టెక్నాలజీ సెంటర్ మంజూరయ్యాయని వెల్లడించారు. వైద్య రంగంలో నగరంలో అత్యుత్తమ వైద్యం కోసం రూ.108 కోట్లతో ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం పూర్తి కాగా, మరో రూ.130 కోట్లతో ఇంకొక క్రిటికల్ కేర్ బ్లాక్ మంజూరై పనులు జరుగుతున్నాయన్నారు.

కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలి!‌

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం హైదరాబాద్ తరువాత అత్యధికంగా నిధులిచ్చింది వరంగల్ కార్పొరేషన్ కేనని చెప్పారు. అయినా ఆ నిధులన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దోచుకుతిన్నారని మండిపడ్డారు. స్మార్ట్ సిటీ నిధులన్నీ నాటి బీఆర్ఎస్ నేతలు స్వాహ చేశారన్నారు. అందుకే చినుకు పడితే వరంగల్ మునిగిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈసారి వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పీఠాన్ని బిజెపికి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. వరంగల్ లోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో జరిగిన పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పైస్థాయి నాయకులు సమావేశానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ”గత మున్సిపల్ ఎన్నికలకు ముందు సర్వే చేస్తే వరంగల్ లో ఒక్క సీటు మాత్రమే గెలిచే అవకాశముందని రిపోర్ట్ వచ్చింది. ఆ తరువాత 10కి పైగా గెలిచాం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 26 సీట్లు పక్కా గెలుస్తాయి. మరో 12 సీట్లు గెలిచే అవకాశముంది. ఇంకా కొంచెం కష్టపడితే మరో 20 సీట్లు గెలుస్తామని రిపోర్ట్ వచ్చింది. మొత్తంగా వరంగల్ పై కాషాయ జెండా ఎగరేసి తీరుతాం.” అని బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.