‘న్యాయ సౌలభ్యం’తోనే ‘వ్యాపార సౌలభ్యం’
వికసిత్ భారత్ దిశగా భారత్ ప్రయాణం ‘భారత ప్రజలమైన మన’ సామర్థ్యాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సాగుతున్న ఒక సంస్కరణల గాథ. ఇది కేవలం ఆర్థిక వృద్ధి, మౌలిక సదుపాయాలు, సాంకేతికతల అభివృద్ధికి మాత్రమే పరిమితమైన కథ కాదు; సమాన ప్రాధాన్యం కలిగిన వ్యవస్థాగత సంస్కరణల సుదీర్ఘ ప్రయాణం. భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ వ్యాపారాలు పెరుగుతున్నాయి, పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి, అంతర్జాతీయ సరఫరా గొలుసులతో దేశ స్థానం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో ఆర్థిక కార్యకలాపాలకు మద్దతుగా నిలిచే వ్యవస్థలు కూడా వేగంగా, పారదర్శకంగా, నమ్మదగినవిగా రూపాంతరం చెందాల్సి ఉంది. ఇటీవల ఆమోదం పొందిన ‘ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు, 2026’ ఈ దిశగా పడిన ఒక కీలకమైన ముందడుగు.
ట్రిబ్యునళ్ల ప్రాథమిక అధికార పరిధిని మార్చకుండా వాటి పాలనాపరమైన నిర్మాణాన్ని బలోపేతం చేయడమే ఈ ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు ముఖ్య ఉద్దేశం. నియామకాలు, పాలన, పారదర్శకత, సేవా నిబంధనలు, స్వయంప్రతిపత్తి, పనితీరులో సమర్థతను మెరుగుపరచడం వంటి వ్యవస్థాగత అంశాలపైనే ఇది ప్రధానంగా దృష్టి సారించింది. ఆ రకంగా చూస్తే, భారతదేశపు చట్టాలను, నియంత్రణ వ్యవస్థను మరింత ఆధునికంగా, సమర్థంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన సుదీర్ఘ సంస్కరణల ప్రయాణంలో ఈ బిల్లు తదుపరి ఘట్టాన్ని ఆవిష్కరిస్తోంది. గడిచిన దశాబ్దకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అనేక రంగాల్లో విస్తృతమైన వ్యవస్థాగత సంస్కరణలను చూసింది. జీఎస్టీ పరోక్ష పన్నుల వ్యవస్థను సమూలంగా మార్చివేయగా, దివాళా కోడ్ దివాళా పరిష్కార వ్యవస్థను బలోపేతం చేసింది; ‘జన్ విశ్వాస్’ కార్యక్రమం నిబంధనల అమలు భారాన్ని తగ్గించగా, డిజిటల్ ఇండియా పాలనను సాంకేతికతతో అనుసంధానించింది. ప్రస్తుతం తీసుకొచ్చిన ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు కూడా ‘సంస్కరణ, పనితీరు, పరివర్తన’ అనే విస్తృత సూత్రానికి అనుగుణంగా ఉంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థ అవసరాల కోణంలో చూసినప్పుడు ట్రిబ్యునల్ సంస్కరణల ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. ట్రిబ్యునళ్లు పన్నులు, కంపెనీ చట్టం, సెక్యూరిటీలు, పర్యావరణం వంటి ప్రత్యేక రంగాలకు సంబంధించిన వ్యవహారాలను పరిష్కరిస్తాయి. రాజ్యాంగబద్ధమైన న్యాయస్థానాల స్థానాన్ని భర్తీ చేయడం వీటి ఉద్దేశం కాదు; ప్రత్యేక ప్రాధికారిక తీర్పులను అందిస్తూ, వేగవంతమైన, సమర్థమైన న్యాయాన్ని అందించడం ద్వారా రాజ్యాంగబద్ధ న్యాయ వ్యవస్థకు ఇవి తోడ్పడతాయి.
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో తలెత్తే వివాదం కేవలం ఒక లెక్కల పొరపాటో లేదా చట్టపరమైన చిక్కు మాత్రమే కాదు. దాని వెనుక ఒక పారిశ్రామికవేత్త విశ్వాసం, ఒక పరిశ్రమ పెట్టిన పెట్టుబడి, ఒక వ్యాపారం భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక కార్యకలాపాల నిరంతరాయ మనుగడ ఇమిడి ఉంటాయి. వివాదాలు సకాలంలో, నిష్పాక్షికంగా పరిష్కారమైనప్పుడు, మూలధనం మళ్ళీ ఉత్పాదక రంగంలోకి వస్తుంది; వ్యవస్థపై నమ్మకం బలపడుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం కావడం, న్యాయం సులభంగా దక్కడం అనేవి ఒకదానితో ఒకటి గట్టిగా ముడిపడి ఉన్న అంశాలు. రాజ్యాంగంలోని 323ఏ, 323బీ అధికరణలు సర్వీసు వ్యవహారాల కోసం పరిపాలనా ట్రిబ్యునళ్లను, ఇతర నిర్దిష్ట అంశాల కోసం ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడానికి వీలు కల్పించాయి. ప్రత్యేక వ్యవస్థల అవసరాన్ని అవి ఆనాడే గుర్తించాయి. అయితే కాలక్రమేణా ట్రిబ్యునళ్ల వ్యవస్థ వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల కింద విడివిడిగా విస్తరించడంతో, వాటి నిర్వహణ పద్ధతులు, వివాద పరిష్కార విధానాలలో తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. ఈ వైవిధ్యాన్ని తగ్గించి, వ్యవస్థను హేతుబద్ధీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన మోదీ ప్రభుత్వం 2015లోనే ట్రిబ్యునళ్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఫైనాన్స్ చట్టం, 2017 ద్వారా ఒకే తరహా స్వభావం కలిగిన ట్రిబ్యునళ్లను విలీనం చేసి, వాటి సంఖ్యను 26 నుండి 19కి తగ్గించారు. ఆ తర్వాత 2017, 2020లలో ట్రిబ్యునల్ నిబంధనలను ప్రకటించారు. ఆ తదుపరి పరిణామాల్లో ‘ట్రిబ్యునళ్ళ సంస్కరణల ఆర్డినెన్స్, 2021’, ‘ట్రిబ్యునళ్ళ సంస్కరణల చట్టం, 2021’ల ద్వారా ట్రిబ్యునళ్ల సంఖ్యను 19 నుండి 16కి తగ్గించారు; అయితే అందులోని కొన్ని నిబంధనలు న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తికి, అధికారాల విభజన సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నాయంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది.
రోజర్ మాథ్యూ, మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులతో పాటు 2025 నవంబర్ 19న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులతో సహా వివిధ న్యాయపరమైన విచారణల్లో—ట్రిబ్యునల్ సభ్యుల నియామకాలు, పదవీకాలం, సేవా నిబంధనలు తప్పనిసరిగా న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేలా ఉండాలని నొక్కి చెప్పారు. ఈ నేపథ్యాన్ని, న్యాయ సమీక్షలను పరిగణనలోకి తీసుకునే ‘ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు, 2026’ ను మోదీ ప్రభుత్వం రూపొందించింది. ఈ బిల్లులో ప్రధాన అంశం ‘నేషనల్ ట్రిబ్యునల్స్ కమిషన్’ (ఎన్టీసీ). ఈ కమిషన్ 16 ట్రిబ్యునళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, వాటి పాలన, నిర్వహణల కోసం ఒక ఉమ్మడి చట్రాన్ని నిర్మిస్తుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీనికి సారథ్యం వహిస్తారు. వారికి మద్దతుగా ఇద్దరు న్యాయవ్యవస్థ సభ్యులు, ఇద్దరు సాంకేతిక సభ్యులు ఉంటారు. నియామక ప్రక్రియను మరింత పారదర్శకంగా, క్రమబద్ధంగా, ప్రతిభ ఆధారంగా, స్వతంత్రంగా మార్చడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యం. ఏకరూప పాలనా లక్ష్యానికి మద్దతుగా ఒక ప్రత్యేక ఎన్టీసీ సచివాలయాన్ని కూడా ప్రతిపాదించారు. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ బిల్లు ఆయా ట్రిబ్యునళ్ల పరిధిలోని ప్రాథమిక అధికార పరిధిని ఎంతమాత్రం మార్చదు. వాటి అధికార పరిధిని ఆయా మూల చట్టాలే నిర్దేశిస్తాయి. ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ఈ సంస్కరణల ప్రాముఖ్యతను గ్రహించడానికి అత్యంత కీలకం.
భారతదేశం ‘వికసిత్ భారత్ @2047’ దిశగా పయనిస్తూ ‘సంస్కరణల ఎక్స్ప్రెస్’ వేగాన్ని పెంచుతున్న తరుణంలో సంస్కరణల స్ఫూర్తి జాతీయ అభివృద్ధికి దోహదపడే ప్రతి వ్యవస్థకూ విస్తరించాలి. బలమైన వ్యవస్థలు విశ్వాసాన్ని నింపుతాయి; ఆ విశ్వాసం పెట్టుబడులను ఆకర్షిస్తుంది; పెట్టుబడులు ఆర్థిక వృద్ధికి ఇంధనంగా మారుతాయి; సమర్థమైన న్యాయ వ్యవస్థ ఈ సమగ్ర వలయాన్ని ‘చట్టబద్ధమైన పాలన’ పునాదులపై నిలబెడుతుంది. ‘ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు, 2026’ ఈ వలయాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వేసిన ఒక అత్యంత కీలకమైన అడుగు.
అర్జున్ రామ్ మేఘ్వాల్,
కేంద్ర న్యాయ, రవాణా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి

