nitin nabin ap

క్రమశిక్షణ, ప్రజలతో బంధమే బిజెపి విజయ రహస్యం

Nitin Nabin ap meetingప్రజలతో నిరంతర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్ స్థాయి వరకు మరింత పటిష్టం చేయాలని అన్నారు. విశాఖపట్నంలో ఆగస్టు 18న నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశానికి ముందు నబీన్ విశాఖపట్నంలోని సింహాచలంలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్‌లతో సమావేశమయ్యారు. 

సమావేశాన్ని ఉద్దేశించి నబీన్ మాట్లాడుతూ, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ స్వప్నాన్ని సాకారం చేసే బిజెపి భావి కార్యకర్తల ముందు తాను ప్రసంగిస్తున్నానని పేర్కొన్నారు. బిజెపి కేవలం అధికారం కోసం ఏర్పడిన పార్టీ కాదని, ఒక నిర్దిష్ట సిద్ధాంతం కోసం పుట్టిందని, ఆ సిద్ధాంతమే పార్టీకి అసలైన బలమని స్పష్టం చేశారు. ‘దేశానికే ప్రథమ ప్రాధాన్యం’ (నేషన్ ఫస్ట్) అనే సూత్రంతో ఈ త్యాగాల ప్రయాణం సాగిందన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జాతీయవాదం, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ సుపరిపాలన అనే మూలసూత్రాలను నేడు ప్రధాని నరేంద్ర మోదీ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. బిజెపి విస్తరణ, విశేష వృద్ధి వెనుక ఉన్న పోరాటాలను, సంకల్పాన్ని గుర్తుంచుకోవడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు బిజెపికి పార్లమెంటులో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఆ సమయంలో పార్టీ ప్రయాణం ముగిసిపోయిందని ప్రపంచం భావించిందని గుర్తుచేశారు. కానీ నాటి నాయకులు పోరాటాన్ని, కష్టపడే తత్వాన్ని ఆయుధాలుగా మలుచుకున్నారన్నారు. ఆ క్రమశిక్షణ, ప్రజల్లోకి వెళ్లే తత్వమే నేడు బిజెపిని 22 రాష్ట్రాల్లో అధికారంలోకి తెచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా చేసిందని అన్నారు. ఈ ఘనతకు కారణమైన వేలమంది కార్యకర్తల త్యాగాలను ఆయన అభినందించారు.

సమాజంలో వ్యతిరేకతను, అసమానతలను రెచ్చగొట్టేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని నబీన్ ఆరోపించారు. పార్లమెంటులో ప్రతిపక్షాల ప్రవర్తన, స్వాతంత్య్ర దినోత్సవం వేళ కాంగ్రెస్ నాయకుల వైఖరి ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా ఉన్నాయని విమర్శించారు. బిజెపి కార్యకర్తలు క్రమశిక్షణ, విలువలకు కట్టుబడి ఉంటారని, అయితే ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని గౌరవప్రదమైన రీతిలోనే ప్రజల్లో సమర్థంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకులు ‘స్వార్థానికే పెద్ద పీట- దేశానికి చివరి స్థానం’ అనే ధోరణితో వ్యవహరిస్తున్నారని, కానీ బిజెపి ‘దేశమే ప్రథమం’ అనే సిద్ధాంతంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు.