తెలంగాణ రైల్వేలకు భారీగా నిధులు
తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైల్వే రంగానికి మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ రూ. 80,000 కోట్ల రైల్వే ప్రాజెక్టులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. కాజీపేటలో ఏర్పాటు చేస్తున్న రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు 90% పూర్తయ్యాయని, త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణను అప్పుల పాలు చేశారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కమీషన్ల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. కిషన్ రెడ్డి ఆగస్ట్ 30, 31న రెండు రోజుల పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో తొలిరోజు ఆగస్ట్ 30న చేవెళ్ల మల్కాపూర్ హైదరాబాద్-బీజాపూర్ హైవే పనులను పరిశీలించారు. అనంతరం ఆధునీకరిస్తున్న వికారాబాద్ రైల్వే స్టేషన్‌ను సందర్శించి, అక్కడ కొనసాగుతున్న పనులను పరిశీలించారు. వికారాబాద్ జిల్లా జింగూర్తి గ్రామంలో తెలంగాణ ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని, అక్కడే స్థానిక కార్యకర్తలతో కలిసి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. తాండూరులో జరిగిన వికారాబాద్ జిల్లా నూతన జిల్లా అధ్యక్షుడిగా రమేశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు నుంచి జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ వెళ్లారు. అలంపూర్ జోగులాంబ ఆలయంలో ‘లైట్ అండ్ సౌండ్ షో’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి రాత్రి అక్కడే బస చేశారు. మరునాడు ఆగస్ట్ 31న కిషన్ రెడ్డి అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో సిరి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ పట్టణంలో జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షుల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రెండోరోజు ఆధునీకరిస్తున్న మహబూబ్‌నగర్, జోగులాంబ, గద్వాల, జడ్చర్ల రైల్వే స్టేషన్లలో కొనసాగుతున్న పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయా ప్రాంతాల్లో చేవళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మహబూబ్‌నగర్ ఎంపీ డి.కె. అరుణ, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కారదర్శి డా. గౌతం రావు, రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రత్నంతో సీనియర్ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వివిధ సందర్భాల్లో కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల నిలయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 10 ఏళ్ల నరేంద్ర మోదీ పాలనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు ఉచిత బియ్యం, రైతులకు సబ్సిడీలు ఇస్తూ సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలతో విసిగిపోయిన ప్రజలు రాబోయే రోజుల్లో సుపరిపాలన కోసం బిజెపికి అవకాశం ఇవ్వాలని, కార్యకర్తలంతా సమష్టిగా పని చేసి తెలంగాణలో బిజెపి జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ”2014కు ముందు ఉమ్మడి ఏపీ మొత్తానికి ఏడాదికి సరాసరి రూ.886 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏడాదికి రూ.5,454 కోట్లు ఖర్చు చేస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకు 888 కి.మీ నూతన రైల్వే లైన్లు వేశారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల విద్యుద్ధీకరణ దాదాపు 100% పూర్తయింది. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 42 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు. రైలు ప్రమాదాల నివారణకు స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన ‘కవచ్’, ‘కవచ్ 2.0’ వ్యవస్థలను తొలిసారిగా తెలంగాణలోనే అమలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ప్రస్తుతం 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. దేశంలో ప్రకటించిన 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో 3 తెలంగాణకు లభించాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు, పుణే, చెన్నై మార్గాల్లో రాబోయే బుల్లెట్ రైళ్లు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి. జోగులాంబ భక్తుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు జోగులాంబ రైల్వే గేట్ వద్ద రూ.45 కోట్లతో ఆర్వోబీ (ROB) నిర్మించనున్నారు. హైదరాబాద్–సిద్దిపేట–జగిత్యాల లైన్లో సిద్దిపేట వరకు సేవలు ప్రారంభమయ్యాయి.” అని అన్నారు.
జోగులాంబ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
ఈ పర్యటనలో అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరైన శ్రీ జోగులాంబ అమ్మవారు, స్వయంభూ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్రమంత్రికి ఆలయ అర్చక స్వాములు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ పవిత్ర సందర్శనలో భాగంగా ఉభయ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. తొలుత బాల బ్రహ్మేశ్వర స్వామి వారి మూలవర్లకు అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ జోగులాంబ అమ్మవారి సన్నిధిలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రిశతి అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు కేంద్రమంత్రికి వేదాశీర్వచనం అందజేశారు. అమ్మవారి దివ్య కృపతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ఆకాంక్షించారు.

