ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి గుండు సున్నా
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. మంత్రులు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం, అవకాశం వస్తే సీఎం సీటులో కూర్చోవాలనే తాపత్రయం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 9న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో నిర్వహించిన బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రసంగించారు. ఉన్నడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని బండి సంజయ్ అన్నారు. బిజెపి కార్యకర్తలు మంత్రులు ఇచ్చిన హామీల అమలు కోసం గట్టిగా పోరాడాలని, అవసరమైతే వారు రాజీనామా చేసే వరకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికి మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని బండి సంజయ్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేశామని, పాల్వంచ ఇండస్ట్రియల్ పార్క్ అప్‌గ్రేడేషన్‌కు రూ.8 కోట్ల గ్రాంట్ ఇచ్చామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ హైవే ఐదు ప్యాకేజీల కింద దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కోదాడ–ఖమ్మం–కావూరి రహదారి (NH-365A) నిర్మాణానికి రూ.446 కోట్లు ఆమోదించామని తెలిపారు. కొత్తగూడెం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని, ప్రసాద్ పథకంలో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.41 కోట్లు కేటాయించామని చెప్పారు. భద్రాచలం పాండురంగాపురం నుంచి మల్కాన్‌గిరి వరకు 174 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్‌కు రూ.3,592 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత జాబితా పేరుతో కోటి ఎకరాల భూమిని చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని, ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల్లో కరెంట్ బిల్లులు, జీతాలకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 32 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ప్రజా సమస్యలపై చర్చించకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనతో తెలంగాణ సర్వనాశనమైందని ఆరోపిస్తూ.. ఆ రెండు పార్టీలపై యుద్ధం ప్రారంభించాలని బండి సంజయ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బిజెపికి బలం లేదన్న వాదనను బండి సంజయ్ ఖండించారు. గతంలో నిరుద్యోగ మార్చ్‌కు భారీగా ప్రజలు తరలివచ్చారని, అమిత్ షా సమావేశానికి లక్ష మందికిపైగా హాజరయ్యారని గుర్తుచేశారు. ఖమ్మంలో బిజెపి క్యాడర్ బలంగా ఉందని, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే అద్భుత విజయం సాధిస్తామని అన్నారు. ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను గెలవడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాం నాయక్, డా. మనోహర్ రెడ్డి, కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

