Crop Holiday

రాష్ట్రంలో అనధికార ‘క్రాప్ హాలిడే’

ఒక వంక తెలంగాణలో రైతులు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో సతమవుతూ ఉంటే, ఉన్న కొద్దిపాటి సాగునీటిని ప్రణాళికాయుతంగా రైతులకు అందించి ఆదుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేయకపోవడంతో అనధికారికంగా ప్రభుత్వం ‘క్రాప్ హాలిడే’ అమలు చేస్తున్న వాతావరణం నెలకొంది. ఆగస్టులోనే 38% లోటు వర్షపాతం నమోదై ప్రమాద ఘంటికలు మోగినప్పటికీ, మండలాలు, ప్రాజెక్టుల వారీగా పంట-నీటి బడ్జెట్‌ తయారు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇరిగేషన్‌ శాఖ ప్రణాళికల ప్రకారం కృష్ణా బేసిన్‌లో మూసీ, డిండి, పాకాల, వైరా వంటి పరిమిత ప్రాజెక్టుల కింద కేవలం 95,108 ఎకరాలకు, గోదావరి బేసిన్‌లోని కడెం, నిజాం సాగర్‌, దేవాదుల తదితర ప్రాజెక్టుల కింద 6,05,955 ఎకరాలకు కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7,01,063 ఎకరాలకు మాత్రమే నీరందించే ప్రతిపాదనలకు పరిమితం కావడం రైతాంగానికి శరాఘాతమైంది. 

పంటలు చేతికొచ్చే కీలక దశలో గేట్లు మూసివేయడంతో రైతులు ఎక్కడికక్కడ ఆగ్రవేశాలతో తిరగబడుతున్న వాతావరణం కనిపిస్తున్నది. రైతుల దృష్టి మళ్లించేందుకే ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పట్టించుకోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ భూముల కబ్జా వంటి అంశాలను ఇప్పుడు అకస్మాత్తుగా తెరపైకి తెస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ముంచుకొచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం గత పాలకుల ఫామ్‌హౌస్‌లను, హైడ్రా కూల్చివేతలను ముందుకు తెస్తుండటం, ఒక వివాదాన్ని తెరపైకి తేవడం రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తున్నది. ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు ఎన్ని రోజులు నీళ్లు ఇవ్వాలన్న స్పష్టమైన ప్రణాళికను సిద్ధం చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వం దయ్యాలు, మంత్రాలంటూ ప్రజలను తప్పుతోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నది. 

రాష్ట్రంలో ఈ వానకాలంలో వర్షపాతం అత్యంత దయనీయంగా పడిపోయింది. ప్రభుత్వ ఆర్థిక, గణాంకాల శాఖ తాజా లెకల ప్రకారం జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా 704.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 560.3 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. ఏకంగా 143.8 మిల్లీమీటర్ల కొరతతో రాష్ట్రంలో 20.4% మేర వర్షపాత లోటు ఏర్పడింది. ఆగస్టులో 38% లోటు వర్షపాతం నమోదవ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది. సెప్టెంబర్‌ ప్రారంభానికే రాష్ట్రంలో 17 జిల్లాలు లోటు వర్షపాత వర్గంలోకి జారిపోయాయి. మరోవైపు, రాష్ట్రంలోని మొత్తం 44,034 చెరువులు ఉండగా, దాదాపు 40% చెరువుల్లో పావు వంతు కంటే తకువ నీటి నిల్వలు ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తమకు సహకరించే ప్రభుత్వం లేదన్న ఆలోచనతో ఈసారి రైతాంగం కొంత జాగ్రత్త పడింది. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించుకున్నది. రాష్ట్రంలో వానకాలం సాగు గత ఏడాది నమోదైన 139 లక్షల ఎకరాల స్థాయి నుంచి ఈసారి 123లక్షల ఎకరాలకే పరిమితమైంది. ఈ లెక్కన సాగు విస్తీర్ణం సుమారు 16 లక్షల ఎకరాలకుపైగా తగ్గింది. ఇందులో అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు విస్తీర్ణం 18% తగ్గి 49.26 లక్షల ఎకరాలకు పరిమితం కాగా, 48.24 లక్షల ఎకరాల్లో పత్తి, 5.93 లక్షల ఎకరాల్లో మక్కజొన్న, మిగిలినది ఇతర పంటలు సాగయ్యాయి. ప్రస్తుతం వరి పొట్ట దశకు, పత్తి పూత, కాత దశకు చేరుకున్నాయి. ఈ సమయంలో పైరుకు నీరందకపోతే పంట పూర్తిగా ఎండిపోయి పెట్టుబడులు సైతం దక్కే పరిస్థితి లేదు. నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పంటలను కాపాడుకొనేందుకు చుక్క నీరు లేక రైతులు నరకయాతన అనుభవిస్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వేలాది రూపాయలు పోసి సాగు చేసిన వరి పొలాలను రైతులు గొర్రెలు, మేకల మేతకు వదిలేస్తున్న దృశ్యాలు పల్లెల్లో కంటతడి పెట్టిస్తున్నాయి.

మరోవంక, వర్షాలు లేకపోవడంతో ఆయకట్టుకు నీరు రాక రైతులు పూర్తిగా భూగర్భ జలాలు, వ్యవసాయ బోర్లపైనే ఆధారపడాల్సి వచ్చింది. రాష్ట్రంలోని దాదాపు 30 లక్షల వ్యవసాయ బోరుబావుల మోటర్లు నిరంతరాయంగా నడుస్తుండటంతో విద్యుత్తు వినియోగం చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఎగబాకినట్టు విద్యుత్తు శాఖ అధికారులు చెప్తున్నారు. సెప్టెంబరు 9న రాష్ట్రంలో ఏకంగా 19,543 మెగావాట్ల ఆల్‌టైమ్‌ రికార్డు విద్యుత్తు డిమాండ్‌ నమోదైనట్టు విద్యుత్తు శాఖ నివేదకలు చెప్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే డిమాండ్‌ ఏకంగా 23% పెరిగిందని అంచనా. విద్యుత్తు సంస్థలు డిమాండ్‌ను తట్టుకుని సరఫరా అందించామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో లో-ఓల్టేజీ సమస్యలు, అప్రకటిత సాంకేతిక అంతరాయాలతో మోటర్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం, పొలాలు తడవక ముందే విద్యుత్తు సరఫరాలో లోపాలు తలెత్తడంతో పైర్లు ఎండిపోతూ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

కృష్ణా, గోదావరి బేసిన్లలో ప్రాజెక్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్రంలోని మొత్తం జలాశయాల సామర్థ్యం 808 టీఎంసీలు కాగా, అందుబాటులో ఉన్న నీరు 465 టీఎంసీలకు పడిపోయిందని ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా వెల్లడించింది. శ్రీశైలంలో గత ఏడాది ఇదే సమయానికి 153.56 టీఎంసీల నీరుండగా, ప్రస్తుతం 61.65 టీఎంసీలకు, నాగార్జునసాగర్‌లో గత ఏడాది 174.25 టీఎంసీలు ఉంటే, ఇప్పుడు 44.89 టీఎంసీలకు పడిపోయింది. జూరాలకు జూన్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 21 మధ్య 243 టీఎంసీల వరద వచ్చినప్పటికీ, అందులో 223 టీఎంసీలు దిగువకు తరలిపోయాయి. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి నీటిని సమర్థవంతంగా ఒడిసిపట్టి తమ రైతులకు అందిస్తుండగా, దిగువన ఆంధ్రప్రదేశ్‌ సైతం కృష్ణా జలాలను తమ రాష్ట్రంలోని చివరి నియోజకవర్గం కుప్పం వరకు తరలించుకుపోతున్నది. తెలంగాణలో మాత్రం ప్రాజెక్టుల నుంచి సాగునీటి కాలువల గేట్లను మూసివేయడం రైతాంగాన్ని తీవ్ర విస్మయానికి గురిచేసింది. జూరాల వద్దకు 80 వేల క్యూసెకుల ఇన్‌ఫ్లో ఉన్నప్పుడే అధికారులు గేట్లు మూసివేసి సాగునీటిని నిలిపివేశారని రైతులు ఆరోపిస్తున్నారు. సెప్టెంబర్‌ 20న జూరాల ఎడమ కాలువ రైతులు గత్యంతరం లేక స్వయంగా కాలువ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోగా, అధికారులు వెంటనే వచ్చి మళ్లీ మూసివేయడం సంక్షోభ తీవ్రతను స్పష్టం చేస్తుంది.

ప్రవీణ్