Erravelli farmhouse

ప్రకంపనలు సృష్టిస్తున్న భూ ఆక్రమణ రాజకీయాలు

తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకొంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.లక్ష కోట్ల విలువైన భూములను దోచుకున్నారని ఆరోపిస్తూ ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు భూ ఆక్రమణ రాజకీయాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఎవరెన్ని ఎకరాల భూములను ఆక్రమించుకున్నారో ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దానితో ఈ రెండు పార్టీలు గత పుష్కరకాలంగా తమ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని అడ్డుపెట్టుకొని అడ్డదిడ్డంగా వేలాది ఎకరాల భూములను ఆక్రమించుకోవడంతో మునిగిపోయారని ప్రజలకు ఇప్పుడు స్పష్టం అవుతుంది. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ చుట్టూ సుమారు 700 ఎకరాల భూముల హక్కులు, వాటిలో ప్రభుత్వ భూమి ఉందా? అనే అంశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే తిరిగి స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు, ముఖ్యంగా దళితులకు ఉపయోగించే అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. 

ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య సాగుతున్న రాజకీయ పోరులో భూముల వ్యవహారాలు తాజాగా ప్రధాన అస్త్రంగా మారుతున్నాయి. ప్రభుత్వ భూముల వినియోగం, ప్రైవేటు భూముల సేకరణ, 22-ఏ నిషేధిత జాబితా, పారిశ్రామిక భూముల మార్పిడి, భూ ఆక్రమణల ఆరోపణలు.. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా రాజకీయ వేడి కనిపిస్తుంది. మీకు వందల ఎకరాలు ఉన్నాయంటే.. మీకే వేల ఎకరాలు ఉన్నాయంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. టెస్సెరాక్ట్ కంపెనీకి భూమి కేటాయింపు అంశాన్ని బీఆర్‌ఎస్ కీలక నేతలు ప్రధాన రాజకీయాస్త్రంగా మలుచుకుని ఆ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూమి వద్ద నిరసన చేపట్టారు. ఆ కంపెనీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోదరుడికి చెందిన కంపెనీ అని, అందుకే తక్కువ ధరకు భూమి కేటాయించారని బీఆర్‌ఎస్ ఆరోపించడంతో వివాదం మొదలైంది. కాంగ్రెస్ ఎంపీలు, ఎంఎల్‌ఏలు, ఎంఎల్‌సీలు వరుసగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు చెందిన భూముల వద్దకు వెళ్లి, రికార్డులు పరిశీలిస్తుండటంతో ఆయా ప్రాంతాలలో ఉత్కంఠ వాతావరణం నెలకొంటుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ వ్యవహారాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వ భూ విధానాలను బీఆర్‌ఎస్, బిజెపి తదితర ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. దీంతో తెలంగాణలో ‘భూమి’ కేవలం రెవెన్యూ అంశంగా కాకుండా రాజకీయ పోరాటానికి ప్రధాన వేదికగా మారుతోంది. 

ఇటీవలి కాలంలో 22-ఏ నిషేధిత ఆస్తుల జాబితా కూడా తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. తమ భూములు నిషేధిత జాబితాలో చేరడంతో అమ్మకం, రుణాలు, ఇతర లావాదేవీలు చేయలేకపోతున్నామని భూయజమానుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. బీఆర్‌ఎస్ కూడా 2023 డిసెంబర్ తర్వాత 22-ఏ జాబితాలో చేర్చిన భూములపై ప్రభుత్వం వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేయగా, బిజెపి ఈ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని టెస్సెరాక్ట్ సంస్థకు కేటాయించిన అంశాన్ని బీఆర్ఎస్ ప్రధాన రాజకీయాస్త్రంగా మలుచుకుంది. భూమి విలువ, కేటాయింపు ధర, సంస్థతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి కుటుంబానికి ఉన్న సంబంధాలపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వరుస ప్రశ్నలు సంధించింది. సీఎం సోదరుడు అనుముల కొండల్‌ రెడ్డికి సుమారు రూ.250 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.7 కోట్లకే కేటాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 

గత ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని, ఆ మొత్తాన్ని ముక్కుపిండి వసూలు చేసి తెలంగాణ ప్రజలకు పంచుతానని ప్రతిజ్ఞలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఆ ప్రస్తావనలు తీసుకు రావడం మానేశారు. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడమే గాని ఎటువంటి విచారణలు ఉండటం లేదు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై భూకబ్జా ఆరోపణలు కొత్తగా వెలుగులోకి వచ్చినవి కావు. వాటిపై విచారణకు ముఖ్యమంత్రికి వేయి రోజుల వ్యవధి కావాల్సి వచ్చిందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని, 13 వేల లావాదేవీల ద్వారా దాదాపు 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని మంత్రులే సభలో అంగీకరించిన వీడియో రికార్డులను బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మీడియా ముందు ప్రదర్శించారు. ఇంత భారీ కుంభకోణం జరిగిందని తెలిసినా ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ పేరుతో హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కాజేసేందుకు కొత్త దందా మొదలుపెట్టారని ఏలేటి ఆరోపించారు. పేద అసైనీల నుంచి ముందే బాండ్ పేపర్లు, నోటరీలు రాయించుకొని, తర్వాత వారికే ఫ్రీహోల్డ్ కల్పిస్తున్నట్లు చట్టాలు తెచ్చి లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమ పేర్ల మీద మార్చుకునే పథకం రచిస్తున్నారని విమర్శించారు. కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్ కు చెందిన 333 ఎకరాల విలువైన భూమి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు రూ.33 వేల కోట్ల విలువైన ఈ భూములను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలకు ఇందులో 30 శాతం వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు తేలినా బాధ్యులైన అధికారులపై పీడీ యాక్ట్ పెట్టడం గానీ, సస్పెండ్ చేయడం గానీ ఎందుకు చేయలేదని నిలదీశారు.

కృష్ణ చైతన్య