బీఆర్ఎస్ భూ దోపిడీ, కాంగ్రెస్ జల దగా, కోర్టుల షాక్

గత అసెంబ్లీ సమావేశాల కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు డ్రామాలు తారాస్థాయిలో నడిచినప్పటికీ, బిజెపి 22ఏ నిషేధిత జాబితాలో ప్రజల భూములను పెట్టిన అంశంపై చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో, తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కుటుంబ భూదోపిడీని సభా ముఖంగా బయట పెట్టాల్సి వచ్చింది. ఇది కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూముల వివరాలు మాత్రమే. కేసీఆర్ కుటుంబానికి వేల ఎకరాల భూమి బినామీ ఆస్తులుగా ఉన్న విషయం కొంత మందికే తెలుసు. నయీంను అడ్డు పెట్టుకొని యాదగిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో బినామీల పేరు మీద కనీసం వందల ఎకరాల్లో బలవంతపు కొనుగోళ్లు చేసిన విషయం అప్పట్లోనే వెలుగులోకి వచ్చింది. నయీంను అడ్డు తొలగించుకోవడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణంగా వార్తలు వచ్చాయి. తదనంతరం నయీం ఆస్తులు, నగదు ఏమయ్యాయో బయటకు తెలియరాలేదు. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ కాలంలో తెలంగాణను నిలువు దోపిడీ చేసిన దాంట్లో ఈ వివరాలు సముద్రంలో నీటి బొట్టు లాంటివి. కేసీఆర్ ఫాంహౌస్ ఆధీనంలో 700 ఎకరాల భూములు ఉన్నాయని, అందులో సత్యం స్కాంకు సంబంధించిన భూములు, అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని  స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించినప్పటికీ, కేసీఆర్ నోరు తెరవకపోవడం, ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దేనికి నిదర్శనం? అసెంబ్లీలో ముఖ్యమంత్రి చెప్పింది వంద శాతం కరెక్టని కేసీఆర్ ఒప్పుకుంటున్నారా.. లేదా ఈ విషయంపై స్పందిస్తే మొత్తం బండారం బయటకు వస్తుందని భయపడుతున్నారా?

అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన స్వాగతించదగినది అయిన్పటికీ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫాంహౌస్ ల రాజకీయ యాత్ర ఎప్పటిలాగే బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు డ్రామాలో భాగమేనని రాజకీయ పండితులకు అర్థమైంది. ఈ రాజకీయ యాత్రలతో రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తునకు కానీ, ప్రజలకు కానీ ఒక్క శాతం కూడా ఉపయోగం లేదనేది సర్వవిదితమే. కానీ, ప్రభుత్వ ఘోర వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ వరుసగా నడుపుతున్న డ్రామాల్లో ఇదొకటని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఎన్నో కేసులు కల్వకుంట్ల కుటుంబంపై వచ్చినా విచారణకు పూర్తిగా నోచుకోక, ఏ ఒక్క రాజకీయ నాయకుడిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కుకు ప్రత్యక్ష నిదర్శనం.

బీఆర్ఎస్ భూ దోపిడీ అలా ఉంటే, కాంగ్రెస్ మంత్రుల దోపిడీ కొట్లాట గత రెండు సంవత్సరాలకు పైగా మనం చూస్తూనే ఉన్నాం. వంద రోజుల్లో అమలు చేస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు, డజను డిక్లరేషన్లు 1000 రోజులు గడిచినా 30 శాతం కూడా అమలుకు నోచుకోకపోవడం కాంగ్రెస్ దగాకోరు పాలనకు నిలువెత్తు నిదర్శనం. నిరుద్యోగులను ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పరంగా ముంచితే.. విద్యార్థులను ఫీజు రీఎంబర్స్ మెంట్, 97ఏ జీవో, అమ్మాయిలకు స్కూటీ పంపిణీలో దగా చేయడం చూస్తూనే ఉన్నాం. మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఇస్తామన్న రూ.2500 కానీ, వృద్ధాప్య పింఛన్ రూ.4000 కానీ, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఇస్తానన్న రూ.15000, రూ.12000 కానీ అడ్రస్ లేకపోవడం కాంగ్రెస్ మోసపూరిత పాలనకు మరో నిదర్శనం. 

గత 7 సంవత్సరాల కాలంలో (2019-25) వరుణ దేవుడి కృపతో వర్షాలు సమృద్ధిగా కురవడంతో తెలంగాణలో పంటలు సమృద్ధిగా పండడం, ఆ విషయాన్ని బీఆర్ఎస్ కాళేశ్వరం విజయంగాను, కాంగ్రెస్ రేవంత్ ఫ్రభుత్వ విజయంగాను ప్రచారం చేసుకోవడాన్ని మనం చూశాం. ఇప్పుడు ఎల్ నినో రావడంతో, అటు కాళేశ్వరం కుంగిపోయి ఉండడంతో, వచ్చిన వరద నీటిని కూడా రేవంత్ ప్రభుత్వం లిఫ్ట్ చేయకుండా, ఎస్సారెస్పీ, మానేరు ఆయకట్టు రైతులను ఘోరంగా దగా చేసింది. దేవుడు వరమిచ్చిన పూజారి కనికరించన్నట్టు వర్షాలు పడ్డా రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలో రైతులు బలయ్యారు. జూన్-జూలై మాసాల్లో తెలంగాణలో వర్షపాతం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, ఆగస్టులో శ్రీశైలం డ్యాం లోకి 250 టీఎంసీల నీరు చేరింది. అందులో 80 టీఎంసీలు నాగార్జున సాగర్ కు వచ్చినప్పటికీ, రేవంత్ ప్రభుత్వ సకాలంలో సక్రమంగా సాగర్ ఎడమ కాల్వకు నీళ్లు వదలక రైతులను ఘోరంగా దగా చేయడం చూస్తూనే ఉన్నాం. ఇందిరా గాంధీ పేరు పెట్టిన జూరాల ప్రాజెక్టు నుంచి 250 టీఎంసీ నీళ్లు కిందికి వచ్చినా, పైన కర్ణాటక, మహారాష్ట్రలో 350 టీఎంసీలు నీళ్లు నిల్వ ఉన్నప్పటికీ, 9 టీఎంసీలు నీళ్లు జూరాలలోనే ఉన్నప్పటికీ, రైతులకు మధ్యంతరంగా నీళ్లు ఆపడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి ప్రత్యక్ష నిదర్శనం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు జూరాల ప్రాజెక్టు సందర్శన పిలుపుతో హడలెత్తిన రేవంత్ ప్రభుత్వం జడ్చర్ల దగ్గర్లోనే బిజెపి నేతలను నిర్బంధించడం రైతులకు విపరీతమైన ఆగ్రహం తెప్పించింది. బిజెపి ఘాటైన విమర్శలకు కాంగ్రెస్ దిగొచ్చి మళ్లీ జూరాల కాల్వలకు నీళ్లు విడుదల చేయడంతో రైతులు సంతోషించారు. 

ఇదిలా ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నిర్లజ్జ ఫిరాయింపు రాజకీయాలు కూడా తెలంగాణను వేడెక్కించాయి. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించడం, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పి స్వాగతించడం, మళ్లీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి వస్తుందేమో అన్న భయంతో అది కాంగ్రెస్ కండువా కాదు, దేవుడి కండువా అని, జాతీయ జెండా అని, కాంగ్రెస్ లో ఉంటూనే బీఆర్ఎస్ లో ఉన్నామని ఆ ఎమ్మెల్యేలు సిగ్గులేని మాటలు చెప్తున్నారు. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా దానం నాగేందర్ పోటీ చేయడం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నామినేషన్ ఫారంపై ప్రతిపాదకుడిగా కడియం శ్రీహరి సంతకం చేయడం, పార్టీ ఫిరాయించిన అరికెపూడి గాంధీ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ పదవి అనుభవించడం, మరో ఏడుగురు ఫిరాయించడం స్పష్టంగా తెలుస్తున్నా అవి ఫిరాయింపులు కావు, బీఆర్ఎస్ లోనే ఉన్నారంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు రాజ్యాంగ పదవికే ఘోర అవమానం. కళ్లు లేని వ్యక్తికి, చెవులు వినపడని వ్యక్తికి కూడా ఈ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని స్పష్టంగా అర్థం అయ్యింది. కానీ, కళ్లు, చెవులు ఉన్న  స్పీకర్ కు ఎందుకు కనపడలేదో భగవంతుడికే తెలియాలి. గత వారం తెలంగాణ హైకోర్టు దానం నాగేందర్ విషయంలో ఫిరాయింపు జరిగిందని ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హుడని ప్రకటించడంతో స్పీకర్ తీర్పు సరైంది కాదని స్పష్టమైంది. సుప్రీంకోర్టుకు వెళ్లను, ఎన్నికలకు వెళ్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన దానం నాగేందర్, ఓటమి భయంతో మళ్లీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడం, తెలంగాణ హైకోర్టు తీర్పు సరైందేనంటూ దానం నాగేందర్ ఎమ్మెల్యేగా అనర్హుడని సుప్రీం కోర్టు కూడా చెప్పడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫిరాయింపు రాజకీయాలకు ఒక చెంపపెట్టు. దానం నాగేందర్ ఫిరాయింపుపై బీఆర్ఎస్ కానీ, పార్టీ అధ్యక్షుడు కానీ, వర్కింగ్ ప్రెసిడింట్ కానీ, ప్రతిపక్ష నాయకుడు, ఉప నాయకుడు కోర్టుకు వెళ్లకుండా ఒక ఎమ్మెల్యే వ్యక్తిగతంగా వెళ్లారు. బిజెపి నుంచి శాసనసభ పక్ష నాయకుడు కోర్టులో పోరాడడం బిజెపి నైతికత, బీర్ఎస్ దగారోరుతానికి ప్రత్యక్ష నిదర్శనం. 

గత రెండు నెలల్లో కాంగ్రెస్  పార్టీ సాగునీటి విషయంలో రైతులను దగా చేయడం, బీఆర్ఎస్ పార్టీ భూదోపిడీ కొంతవరకు బయటకు రావడం, పది మంది ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒకరైన దానం నాగేందర్ పై అనర్హత వేటు పడడం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రభావం చూపించే అంశాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు డ్రామాలకు, ఫిరాయింపు రాజకీయాలకు కాలం చెల్లినట్లుగా, అసెంబ్లీ లోపల, బయటా బిజెపి చేసిన నిబద్ధత పోరాటాలకు నిదర్శనంగా ప్రజలు భావిస్తున్నారు.