vinayaka chaviti

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

Vinayaka Chavit 01బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. సెప్టెంబర్ 14న వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొని, తెలంగాణ ప్రజల శాంతి, సౌభాగ్యం, శ్రేయస్సు కోసం విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు. ఈ వేడుకల్లో రాంచందర్ రావుతో పాటు రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, సీనియర్ నాయకురాలు డా. పద్మ, చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్యే కొండేటి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతాంగం పాడిపంటలతో వర్థిల్లాలని, ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించేలా గణనాథుడు ఆశీర్వదించాలని ప్రార్థించానని పేర్కొన్నారు. ఏటేటా వినాయకుడి పట్ల భక్తి ప్రపత్తులు ఇనుమడిస్తున్నాయని, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారని అన్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ లో ఎంతో భక్తిశ్రద్ధలు, ఉత్సాహాల నడుమ వినాయక నవరాత్రోత్సవాలు, శోభాయాత్రలు ఘనంగా నిర్వహించే అద్భుతమైన సాంప్రదాయం ఉందని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణవ్యాప్తంగా వేలాది గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నందున, పండుగ వేడుకలు, నిమజ్జన శోభాయాత్రలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగిసేలా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ, జీహెచ్‌ఎంసీ సహా సంబంధిత శాఖలన్నీ మండపాల నిర్వాహకులకు, భక్తులకు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.

వినాయక చవితికి, ప్రకృతికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని రాంచందర్ రావు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. వినాయక పూజలో ఉపయోగించే పూజా సామాగ్రి, ఆచారాలు పర్యావరణంతో ముడిపడి ఉన్నాయని తెలిపారు. వినాయక పూజలో సమర్పించే పత్రి, పూలు, పండ్లు, పసుపు వంటివన్నీ ప్రకృతితో మనకున్న గాఢమైన బంధాన్ని గుర్తుచేస్తాయని, గణపతి భక్తితో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా మనందరి ఉమ్మడి సంకల్పం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భక్తులంతా భక్తిశ్రద్ధలతో పండుగ జరుపుకుంటూనే, పర్యావరణ పరిరక్షణ పట్ల స్పృహ కలిగి ఉండాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ, ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో వ్యవహరించేలా తెలంగాణ ప్రభుత్వానికి వినాయకుడు ‘సద్బుద్ధి’ ప్రసాదించాలని ప్రార్థించానని రాంచందర్ రావు తెలిపారు. సెప్టెంబర్ 18న సంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.