Vishwakarma jayanti

చేతివృత్తుల వర్గాలకు సముచిత గౌరవం, ఆర్థిక భరోసా

Vishwakarma Jayantiగత ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించిన చేతివృత్తుల వర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ యోజన’ ద్వారా ఆర్థిక భరోసాతో పాటు సముచిత గుర్తింపు కల్పించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన భగవాన్ శ్రీ విశ్వకర్మ జయంతి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు ఎంతో చారిత్రక, విశిష్టమైన దినమని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినంతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం, అలాగే దేవ శిల్పి భగవాన్ విశ్వకర్మ జయంతి ఒకే రోజు రావడం ఎంతో శుభపరిణామమన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గత అనేక సంవత్సరాలుగా బిజెపి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా విశ్వకర్మ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామని గుర్తుచేశారు.

దేశ నిర్మాణంలో కమ్మరి, వడ్రంగి, కంసాలి, స్వర్ణకారులు, శిల్పులు వంటి అనేక చేతివృత్తుల వర్గాల శ్రమ ఎనలేనిదని అన్నారు. అయితే గత పాలకులెవరూ ఈ చేతివృత్తుల కులాల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే వారి శ్రమను గుర్తించి, వారికి ఉపాధితో పాటు నేరుగా ఆర్థిక సహాయం అందించాలనే సంకల్పంతో “పీఎం విశ్వకర్మ యోజన”ను ప్రవేశపెట్టారని వివరించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు సులభతర రుణాలు, పనిముట్లు, శిక్షణ అంది వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, వ్యాపారాలను విస్తరించుకోగలుగుతున్నారని తెలిపారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామిగా దూసుకుపోతున్న వేళ, “వోకల్ ఫర్ లోకల్ – లోకల్ టు గ్లోబల్” నినాదంతో స్వదేశీ చేతివృత్తుల ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ తెచ్చేందుకు కేంద్రం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మన కళాకారులు తయారు చేసిన వస్తువులు విదేశాల్లో అమ్ముడుపోతూ భారతీయ ప్రతిభను విశ్వవ్యాప్తం చేస్తున్నాయని కొనియాడారు. వికసిత భారత్ నిర్మాణంలో చేతివృత్తుల వారు కేవలం ఉపాధి పొందడమే కాకుండా, ఇతరులకు కూడా ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నదే మోదీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి, సీనియర్ నాయకుడు వకుళాభరణం కృష్ణమోహన్ రావు, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.