Eleti Maheshwar Reddy

భూ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలి!: ఏలేటి

Alleti PPTభూ కుంభకోణాలపై న్యాయ విచారణతో పాటు సీబీఐ విచారణ జరిపించాలని బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ధరణి, భూభారతి పోర్టళ్లకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను బహిర్గతం చేయాలని, 22ఏ నిషేధిత జాబితాలోని భూముల గణాంకాల్లో వచ్చిన వ్యత్యాసాలకు కారణాలను వెల్లడించాలని, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమానాస్పద బదిలీలు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. భూ రికార్డుల్లో జరిగిన ప్రతి మార్పును పరిశీలించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, చట్టబద్ధమైన హక్కులు కలిగిన భూ యజమానులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కుంభకోణాలపై నిజాలు వెలుగులోకి వచ్చి, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు బిజెపి తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో ధరణి, భూభారతి పోర్టళ్ల ద్వారా చోటుచేసుకున్న భూ రికార్డుల అవకతవకలు, 22ఏ నిషేధిత భూముల వ్యవహారాలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అక్టోబర్ 15న ఆయన సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ధరణి, భూభారతి వ్యవహారాల్లో జరిగిన అవకతవకలను వెలుగులోకి తీసుకురావడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని మొదట డిమాండ్ చేసింది బిజెపియేనని గుర్తుచేశారు. ఫోరెన్సిక్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని స్వయంగా రెవెన్యూ మంత్రి వెల్లడించినప్పటికీ, ఆ నివేదికను ప్రజలకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ధరణి ద్వారా లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఎకరం భూమిని కూడా తిరిగి స్వాధీనం చేసుకోకపోవడం, బాధ్యులపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. ధరణి, భూభారతికి సంబంధించిన సుమారు 200 ఫైళ్లను అధ్యయనం చేశామని, ఈ వ్యవహారం సాధారణ అవినీతి కాదని, రాష్ట్ర చరిత్రలోనే అత్యంత తీవ్రమైన భూ కుంభకోణాల్లో ఒకటని పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ ప్రకారం అసైన్డ్, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, సీలింగ్ భూములు వంటి చట్టబద్ధంగా నిషేధిత భూములనే జాబితాలో ఉంచాల్సి ఉండగా, రేరా అనుమతులు, ఇతర చట్టబద్ధ అనుమతులు పొందిన భవనాలు, కాలనీలకు సంబంధించిన ప్రైవేట్ ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మరోవైపు నిషేధిత జాబితాలో ఉండాల్సిన కొన్ని భూముల వివరాలు, రికార్డులపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. నెలలు గడుస్తున్నా ప్రైవేట్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడంతో పట్టాదారులు ఎస్ఆర్ఓ, ఎంఆర్ఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ గందరగోళాన్ని బినామీలు, దళారులు కమిషన్ల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో భూ రికార్డుల నిర్వహణ, నిషేధిత జాబితాల రూపకల్పన, భూముల బదిలీలకు సంబంధించిన అవకతవకలపై సమగ్ర విచారణ జరగాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అటవీ, అసైన్డ్, ప్రభుత్వ భూములకు సంబంధించిన భారీ వ్యత్యాసాలు, రికార్డుల్లో కనిపిస్తున్న మార్పులపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికను బహిర్గతం చేయకుండా ఎస్ఈటీ (స్పెషల్ ఎక్స్ పర్ట్స్ టీం) ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశమేంటని ప్రశ్నించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.