దేశ వ్యతిరేక శక్తుల చేతిలో పావు రాహుల్
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కాంగ్రెస్, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ఇండీ కూటమి అనుసరిస్తున్న రాజకీయాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, విదేశీ ‘టూల్‌కిట్ (ప్రణాళిక అమలు) ముఠా’ చేతిలో రాహుల్ గాంధీ పావుగా మారారని విమర్శించారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న విదేశీ శక్తుల ప్రయోజనాలకు అనుగుణంగా రాహుల్ గాంధీ, ఆయన బృందం పనిచేస్తున్నాయని ఆరోపించారు. బీహార్‌లోని కుమ్హరార్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సమస్యలను సమర్థంగా పరిష్కరించే లక్ష్యంతో రూపొందించిన ‘కుమ్హరార్ సేవా సహాయత పోర్టల్– మీ ఎమ్మెల్యే, మీతోనే’ అనే ప్రజా ఫిర్యాదుల పరిష్కార పోర్టల్‌ను నితిన్ నబీన్ బీహార్ రాజధాని పాట్నాలో అక్టోబర్ 17న ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. బిజెపి బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సరావగీ, కుమ్హరార్ నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ గుప్తాతోపాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నితిన్ నబీన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావంతో దేశానికి సేవలందిస్తున్నారని, దేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో 140 కోట్ల మంది భారతీయులు ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అయితే, భారతదేశ అభివృద్ధిని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు దేశంలోనే ఉన్నాయని, దేశం సాధిస్తున్న ప్రగతి వాటికి మింగుడుపడటం లేదని విమర్శించారు. ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలోనూ అభివృద్ధి పథంలో నిరంతరాయంగా ముందుకు సాగుతున్న ఏకైక దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ భారత్ పురోగమిస్తోందని చెప్పారు. అయితే, అంతర్జాతీయ స్థాయిలో కొన్ని శక్తులు భారతదేశ ఎదుగుదలను సహించలేకపోతున్నాయని ఆరోపించారు. అటువంటి విదేశీ శక్తుల చేతిలో ‘టూల్‌కిట్’గా పని చేస్తున్నది మరెవరో కాదని, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన బృందమేనని మండిపడ్డారు.
రాహుల్ గాంధీతోపాటు ఆయనకు మద్దతుగా నిలుస్తున్న ప్రతిపక్ష నాయకులను నితిన్ నబీన్ తీవ్రంగా హెచ్చరించారు. దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని 140 కోట్ల మంది భారతీయులు నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఎలాంటి కుట్రలనైనా ప్రజలు తిప్పికొడతారని, ఇటువంటి శక్తుల దురుద్దేశాలు, పన్నాగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనివ్వబోరని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థల పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ నితిన్ నబీన్ తీవ్రస్థాయిలో స్పందించారు. దేశ రాజకీయ చరిత్రలో 2014 ఎన్నికలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. నరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా బిజెపి ముందుగానే ప్రకటించిందని, అనంతరం ప్రజలు స్పష్టమైన తీర్పుతో ఆయనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని చెప్పారు. ఈ విధంగా ప్రజల నుంచి ప్రత్యక్షంగా స్పష్టమైన ఆమోదం పొందిన నాయకుడిగా మోదీ ప్రధానమంత్రి పదవిని చేపట్టారని పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రుల విషయంలో తొలుత పార్టీలు నాయకుడిని ప్రధానమంత్రిగా ఎంపిక చేసేవని, ఆ తర్వాత ప్రజల నుంచి ఆమోదం పొందేవారని ఆయన వ్యాఖ్యానించారు.
ఓట్ల చోరీ జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు నితిన్ నబీన్ సవాల్ విసిరారు. బిహార్‌లో ఎన్నికల సంఘం పూర్తి పారదర్శకతతో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) అనంతరం 2025 సెప్టెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించిందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో ప్రతిపక్ష పార్టీలు పోలింగ్ బూత్ స్థాయిలో తమ బూత్ లెవల్ ఏజెంట్లను (బీఎల్ఏలు) నియమించుకున్నాయని చెప్పారు. అయినప్పటికీ తుది ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత ఆ పార్టీలు ఎన్ని అధికారిక ఫిర్యాదులు చేశాయని ప్రశ్నించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు, అందుకు సంబంధించి ఆధారాలతో కూడిన ఒక్క ఫిర్యాదును కూడా దాఖలు చేయలేదని ఆయన పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి స్థాయిలోగానీ, జిల్లా స్థాయిలోగానీ, రాష్ట్ర ఎన్నికల సంఘం స్థాయిలోగానీ ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఒక్క ప్రామాణికమైన ఫిర్యాదును సమర్పించలేదని తెలిపారు. అయితే, బిహార్ ఎన్నికల్లో ప్రజలు తమను ఘోరంగా తిరస్కరించిన తర్వాత అదే నాయకులు దిల్లీకి వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ఆత్మపరిశీలన చేసుకోకుండా తమ అసహనాన్ని ఎన్నికల సంఘంపై ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ 2014లో నరేంద్ర మోదీకి ప్రజలు భారీ మెజారిటీతో పట్టం కట్టిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని గుర్తుచేశారు. ఆ ఎన్నికలను నిర్వహించిన వ్యవస్థపైనే ఇప్పుడు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల్లో విజయం సాధించినప్పుడు ఎన్నికల సంఘం పనితీరుపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయవని ఆయన అన్నారు. అదే బిహార్, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ఓటమి ఎదురైన వెంటనే తమ పరాజయానికి ఎన్నికల సంఘమే కారణమంటూ ఆరోపణలు ప్రారంభిస్తాయని విమర్శించారు. గెలిచినప్పుడు ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం ప్రకటించడం, ఓడిపోయినప్పుడు అదే వ్యవస్థను తప్పుబట్టడం ప్రతిపక్షాల అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇది దొంగే దొంగ అని అరిచిన చందంగా ఉందని నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. గతంలో తుపాకులతో దౌర్జన్యాలు చేసి పోలింగ్ కేంద్రాలను ఆక్రమించడం, బ్యాలెట్ పెట్టెలను స్వాధీనం చేసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడిన వారే ఇప్పుడు మళ్లీ బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బ్యాలెట్ పద్ధతిని తిరిగి తీసుకురావాలన్న వారి డిమాండ్ వెనుక అసలు ఉద్దేశం బిహార్‌ను మళ్లీ గతంలోని అరాచక పరిస్థితుల్లోకి నెట్టడమేనని విమర్శించారు. ఒకప్పుడు పోలింగ్ కేంద్రాలను బలవంతంగా ఆక్రమించి ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిన పరిస్థితులు బిహార్‌లో ఉండేవని ఆయన గుర్తుచేశారు. అటువంటి పరిస్థితులు తిరిగి ఏర్పడేలా చేసి రాష్ట్రాన్ని మరోసారి ‘జంగిల్ రాజ్’ కాలంలోకి తీసుకెళ్లాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై నమ్మకం ఉన్నట్లు మాట్లాడుతూనే, తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాటి విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు.
భారతదేశ సుస్థిరతను, అభివృద్ధిని సవాల్ చేసే విదేశీ శక్తులను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యం దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు ఉందని నితిన్ నబీన్ స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాలను దెబ్బతీయడానికి ప్రయత్నించే శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని, వారి కుట్రలను విజయవంతం కానివ్వరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తున్న బలంతో బిజెపి కార్యకర్తలందరూ దేశ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తారని చెప్పారు. గల్లీ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి బిజెపి కార్యకర్త దేశ వ్యతిరేక శక్తులకు గట్టిగా సమాధానం ఇస్తారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నిరాధార ఆరోపణలను, తప్పుడు కథనాలను సమర్థంగా తిప్పికొడతామని తెలిపారు. దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న శక్తుల అసలు స్వరూపాన్ని ప్రజల ముందు పూర్తిగా బహిర్గతం చేస్తామని నితిన్ నబీన్ స్పష్టం చేశారు.

