ప్రచారం తప్ప ప్రజాబలం లేని ప్రతిపక్షం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఎన్నికల సంఘం కోట్లమంది అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించిందన్న నిరాధార ఆరోపణతో, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు నవంబర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిరసన ర్యాలీ నిర్వహించాయి. భారత్‌లో ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు పదేపదే తమ ఆరోపణలను ఎలా మార్చుకుంటున్నాయో గమనించడం ఆసక్తికరం. కొన్నేళ్ల క్రితం ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేశాయి. 99 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న ఈవీఎంలు భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి విజయాన్ని అందిస్తుండగా, 60 లేదా 70 శాతం బ్యాటరీ ఛార్జింగ్ ఉన్న యంత్రాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆరోపించాయి. ఈ విచిత్రమైన ఆరోపణకు సమాధానం చెప్పేందుకు ఎన్నికల సంఘం కూడా ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఈవీఎంలోని కంట్రోల్ యూనిట్ బ్యాటరీ ఛార్జింగ్‌కు, ఎన్నికల ఫలితాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కొత్తగా తయారు చేసిన, తిరిగి వినియోగించడానికి వీలులేని ఆల్కలైన్ బ్యాటరీలను ఈవీఎంలలో అమర్చుతారని, అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్ల సమక్షంలోనే వాటికి సీల్ వేస్తారని ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరించారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ, ఆయన పార్టీ ఎలాంటి ఆధారాలు చూపకుండానే ‘ఓట్ చోరీ’ (ఓట్ల దొంగతనం) అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. ఇటీవల జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఓ పాత్రికేయుడు… ఓట్ల దొంగతనం జరుగుతోందని ఎప్పుడు, ఎలా గుర్తించారని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. దీనికి ఆయన ఇచ్చిన సమాధానం హాస్యాస్పదంగా ఉంది. “1977లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు నాకు ఏడేళ్లు. ఆమెతో సహా అందరికీ తాము ఓడిపోతున్నామనే విషయం తెలుసు. అది ఒక భావన. ఫీలింగ్,” అని ఆయన పేర్కొన్నారు. ఆ భావన ఒకసారి తప్పు కావచ్చని అంగీకరిస్తూనే, “ఒకసారి అలా జరగవచ్చు. కానీ రెండోసారి కాదు. మూడోసారి, నాలుగోసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు. ఫీలింగ్ అనేది ఒకటుంటుంది,” అని వాదించారు. గత రెండు మూడు ఎన్నికల్లో తమ సాంకేతిక నిపుణులు ఇది (వరుస ఓటములు) సాధ్యం కాదని, ఇలా ఎలా జరుగుతోందని చెబుతూ వచ్చారని, క్రమంగా తమలో అనుమానాలు పెరిగాయని కూడా ఆయన అన్నారు. అంటే, తమ సాంకేతిక నిపుణులు చెప్పారన్న కారణంతో ఏర్పడిన ఒక భావన, అనుమానం తప్ప ఆయన వద్ద ఎలాంటి ఆధారాలూ లేవన్నమాట. తమకు రావాల్సిన అధికారంపై హక్కు ఉందనే భావన నుంచే ఈ అనుమానాలు పుట్టుకొచ్చాయి.
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ప్రతిపక్షాలు రాష్ట్రపతిని ఆశ్రయించాయి. హుందాతనం కలిగిన రాష్ట్రపతి, ఎలాంటి ఆధారాలూ లేకుండానే ఫిర్యాదులు తీసుకొచ్చారని రాహుల్ గాంధీకి, ఆయన వెంట వచ్చిన నేతలకు మర్యాదపూర్వకంగా వివరించారు. అయితే రాష్ట్రపతితో సమావేశం అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు. తమ ఆందోళనలను రాష్ట్రపతి తోసిపుచ్చక పోవడంపై తాను ఆశ్చర్యపోయానన్నారు. అంతేకాకుండా, తాము ఎన్నికల్లో మోసం చేయలేదని నిరూపించాల్సింది తాము కాదని, అధికారంలో ఉన్నవారేనని, “మీరు ఎన్నికల్లో మోసం చేయలేదని మాకు నిరూపించాలి” అని వింత వాదనను తెరపైకి తెచ్చారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై చేసిన ఆరోపణల మాదిరిగానే ఇప్పుడు చేస్తున్న ‘ఓట్ చోరీ’ ఆరోపణలకు కూడా ఎలాంటి స్పష్టమైన ఆధారాలూ లేవు. దేశంలో ఎక్కడా సాధారణ ఓటర్లు తమ ఓట్లు దొంగిలించారని ఫిర్యాదు చేయలేదు. ఏ పోలింగ్ కేంద్రంలోనూ, ఏ గ్రామంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెలువడలేదు.
ఆ తర్వాత బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. అయితే అక్టోబర్ మొదట్లో సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలతో నిర్వహించినప్పుడు, మొత్తం 42 వార్డుల్లో కాంగ్రెస్ కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. బిజెపి 32 వార్డులను, దాని మిత్రపక్షాలు మరో రెండు వార్డులను గెలుచుకున్నాయి. ఇదే వారం నాలుగు రాష్ట్రాలు- ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రల్లో శాసన మండళ్లకు జరిగిన 28 స్థానాల ఎన్నికల్లోనూ బ్యాలెట్ పత్రాలనే వినియోగించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం ఒక స్థానాన్ని మాత్రమే గెలుచుకోగా, బిజెపి, దాని మిత్రపక్షాలు కలిపి 16 స్థానాలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ ఎన్డీయే నాలుగు ఎమ్మెల్సీ స్థానాలనూ గెలుచుకోగా, అధికార పార్టీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు పట్టభద్రులు, ఉపాధ్యాయులు కావడం గమనార్హం. అంటే, దేశంలోని విద్యావంతులు, చైతన్యవంతమైన వర్గాలు ఎస్ఐఆర్, ఈవీఎంలు, ‘ఓట్ చోరీ’ పేరుతో రాహుల్ గాంధీ చేస్తున్న ప్రచారాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నాయని స్పష్టమవుతోంది.
ఎస్ఐఆర్పై ఆయన చేస్తున్న ప్రచారం కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారమే. 1952 నుంచి దేశంలో ఇప్పటివరకు ఓటర్ల జాబితాలపై ఎనిమిది సార్లు ప్రత్యేక సమగ్ర సవరణలు జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్నది తొమ్మిదో సవరణ. గతంలో జరిగిన ఎనిమిది సవరణల్లో ఏడింటిని కాంగ్రెస్ ప్రభుత్వాలే నిర్వహించాయి. చివరిసారిగా ఇలాంటి సవరణ 2002-04 మధ్య జరిగింది. రెండు దశాబ్దాల విరామం తర్వాత ఎన్నికల సంఘం ఇప్పుడు మళ్లీ అదే ప్రక్రియను చేపట్టింది. కాంగ్రెస్ ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేయడానికి రెండు కారణాలున్నాయి. మొదటిది, ఎన్నికల బరిలో బిజెపిని నేరుగా ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవడంతో అశాంతి, గందరగోళం సృష్టించి ప్రభుత్వ మార్పునకు ప్రయత్నిస్తోంది. రెండోది, నరేంద్ర మోదీ, బిజెపి కష్టపడి సాధించిన విజయాలను ‘ఎన్నికల దొంగతనం’గా చిత్రీకరించాలన్నది దాని ఉద్దేశం.
ప్రతిపక్షాల దగ్గర ప్రచారం మాత్రమే ఉంది. కానీ ప్రజలు మాత్రం మోదీ వెంటే ఉన్నారు. కాంగ్రెస్ దిల్లీకి కొన్ని వేల మందిని సమీకరించి ఉండొచ్చు కానీ ప్రతిపక్షాల అబద్ధాలను, తప్పిదాలను దేశంలోని వంద కోట్ల మంది ప్రజలకు వివరించేందుకు బిజెపి వేలాది పట్టణాలు, గ్రామాలకు వెళ్లగలదు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ నియంతృత్వ పాలన నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర బిజెపికి ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ సృష్టించాలనుకుంటున్న అరాచకం నుంచి కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది.
రామ్ మాధవ్,
బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు

