2 tongue person

వ్యవస్థలపై కాంగ్రెస్ రెండు నాల్కలు

కాంగ్రెస్ పార్టీకి అకస్మాత్తుగా రాజ్యాంగ వ్యవస్థల విలువ గుర్తుకొచ్చింది. న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు, ఎన్నికల సంఘం, చివరికి పత్రికా రంగాన్ని కూడా ఏడు దశాబ్దాల పాటుతన గాంధీ కుటుంబ ప్రయోజనాల కోసం వాడుకున్న ఆ పార్టీ, ఇప్పుడు వాటి స్వయంప్రతిపత్తిని పరిరక్షిస్తామంటూ ర్యాలీలు తీస్తోంది. ఇదెలా ఉందంటే… ఊరంతటికీ నిప్పు పెట్టిన అగ్గిరాక్షసుడే, ఫైర్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నట్లుంది. కాంగ్రెస్ అక్రమాల చరిత్ర చాలా పెద్దది. అందులో కొన్ని అధ్యాయాలు చూస్తేనే ఆ పార్టీ నైజం తేటతెల్లమవుతుంది.

1973 ఏప్రిల్ 25న చరిత్రాత్మక ‘కేశవానంద భారతి’ తీర్పు వచ్చిన మరుసటి రోజే, ఇందిరా గాంధీ ప్రభుత్వం జస్టిస్ ఏ.ఎన్. రే ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా ప్రకటించింది. ఆయన కంటే సీనియర్లు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులిచ్చిన ముగ్గురు న్యాయమూర్తులను పక్కనబెట్టి మరీ ఈ నియామకం చేపట్టింది. దాంతో ఆ ముగ్గురు న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేశారు. అప్పటి న్యాయశాఖ మంత్రి మోహన్ కుమారమంగళం ఒక అడుగు ముందుకేసి, “ప్రభుత్వ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే న్యాయ వ్యవస్థ” కావాలని, న్యాయమూర్తుల నిబద్ధతతో పాటు వారి దృక్పథాన్ని కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని వ్యాఖ్యానించారు. 1977లో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) తీవ్రరూపంలో ఉన్నప్పుడు మళ్లీ అదే పునరావృతమైంది. ‘ఏడీఎమ్ జబల్‌పూర్’ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకైక అసమ్మతి తీర్పు (డిసెంట్) ఇచ్చిన జస్టిస్ హెచ్.ఆర్. ఖన్నాను కాదని మరొకరిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. దీంతో ఆయన కూడా రాజీనామా చేశారు. ఆ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు మాత్రం తగిన బహుమానంగా పదోన్నతులు లభించాయి.

1975 నుంచి 1977 వరకు, కాంగ్రెస్ పౌర హక్కులను కాలరాసింది, పాత్రికేయుల గళాన్ని నొక్కివేసింది, విచారణ లేకుండానే ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టింది. అత్యున్నత న్యాయస్థానం కూడా దీనికి సమ్మతించింది. ఆ 21 నెలల చీకటి రోజులను పక్కనబెట్టి, రాజ్యాంగ విలువల పరిరక్షకురాలినని కాంగ్రెస్ చెప్పుకునే ప్రతి మాటా అసత్యమే. రాజ్యాంగంలోని 356వ అధికరణ దుర్వినియోగం చాలా కాలం కిందటే ప్రారంభమైంది. 1959లో కేరళలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1980లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి రాగానే తొమ్మిది ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను డిస్మిస్ చేశారు. ప్రజలు ఎన్నుకున్నప్పటికీ తమకు నచ్చని ప్రభుత్వాలను కూల్చివేసేందుకు గవర్నర్ వ్యవస్థను ఒక ఆయుధంగా మార్చుకున్నారు.

1984 నాటి సిక్కులపై జరిగిన మారణకాండ తర్వాత రాజీవ్ గాంధీ ప్రభుత్వం విచారణ కమిషన్‌ను వేయడానికి నెలల సమయం తీసుకుంది. చివరికి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ రంగనాథ్ మిశ్రాని ఎంపిక చేసింది. ఈ కమిషన్ కాంగ్రెస్ కార్యకర్తలు హింసలో పాల్గొన్నారని అంగీకరించినప్పటికీ, అంతకుమించి పెద్దగా ఏం చేయలేదు. తదనంతర కాలంలో జస్టిస్ మిశ్రా కాంగ్రెస్‌లో చేరి రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం విషయంలోనూ ఇదే తీరు కొనసాగింది. 1989 అక్టోబర్‌లో ఎన్నికలకు ఒక నెల ముందు నాటి ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఆర్.వి.ఎస్. పేరి శాస్త్రితో విభేదాలు రావడంతో ఆయన అధికారాలకు అడ్డుకట్ట వేసేందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇద్దరు కొత్త ఎన్నికల కమిషనర్ల పోస్టులను సృష్టించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోగానే కేవలం కొన్ని వారాల్లోనే ఆ రెండు పోస్టులను రద్దు చేశారు. 1993లో టీ.ఎన్. శేషన్ కాంగ్రెస్‌కు మింగుడుపడకపోయేసరికి, నరసింహారావు ప్రభుత్వం మళ్లీ అదే ఎత్తుగడను పునరావృతం చేసింది. ఆ తర్వాత నవీన్ చావ్లా ఉదంతం చూశాం. 2006లో ఆయన పక్షపాత వైఖరిపై ఎల్.కే. అద్వానీతో పాటు 200 మందికి పైగా ఎంపీలు ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. జనవరి 2009లో అప్పటి సీఈసీ ఎన్ గోపాలస్వామి కూడా నవీన్ చావ్లాను తొలగించాలని అధికారికంగా సిఫార్సు చేశారు. కానీ నాటి యూపీఏ ప్రభుత్వం ఆ సిఫార్సును తిరస్కరించడమే కాకుండా, సాధారణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు, ఏప్రిల్‌లో చావ్లాకే సీఈసీగా పదోన్నతి కల్పించింది.

సెప్టెంబర్ 2013లో, తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను కాపాడేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ బహిరంగంగా “ఒట్టి చెత్త” అని అభివర్ణించారు. నాటి ప్రధానమంత్రి అధికారానికే గండి కొట్టిన ఆ అసాధారణ జోక్యం, రాజ్యాంగ పదవుల పట్ల కాంగ్రెస్‌కు ఉన్న గౌరవాన్ని ప్రశ్నించేలా చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చినందుకు న్యాయమూర్తుల పదోన్నతులను తొక్కిపెట్టడం, పత్రికా స్వేచ్ఛను హరించడం, ఎన్నికైన ప్రభుత్వాలను డిస్మిస్ చేయడం, విచారణ కమిషన్ చైర్మన్‌కు పదవులతో బహుమతి ఇవ్వడం, దర్యాప్తు సంస్థలను పంజరంలో బంధించడం, సీఈసీ అభ్యంతరాలను పక్కనబెట్టి అనుకూలమైన కమిషనర్‌ను కాపాడుతూ పదోన్నతి ఇవ్వడం… ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన చిన్నపాటి పొరపాట్లు కావు. వ్యవస్థలను తమ సొంత ఆస్తిగా భావించిన ఒక పార్టీ దశాబ్దాల పాటు సాగించిన పాలనా శైలి ఇది. ఈనాడు ఎన్నికల సంఘం ప్రభుత్వం గుప్పెట్లో ఉందంటూ, సంస్థలు పంజరంలో ఉన్నాయంటూ, రాజ్యాంగానికి ముప్పు వచ్చిందంటూ ఆరోపణలు చేస్తున్నవారు మొదట ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి: అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారు?

మోహన్ చరణ్ మాఝీ,
ఒడిశా ముఖ్యమంత్రి