కరీంనగర్ కాషాయ ప్రభంజనాన్ని కాంగ్రెస్ చూడాలి!
కరీంనగర్ గడ్డపై కాషాయ దళం సృష్టిస్తున్న ప్రభంజనం తన మనసును పులకింపజేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్లో బిజెపి కార్యకర్తల ఉత్సాహం, ప్రజల స్పందన చూస్తుంటే తనను కన్న ఈ గడ్డ ఉరకలేస్తోందని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, భుజంపై ఉన్న కాషాయ జెండా గౌరవం కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపి ఎక్కడుందని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలు కరీంనగర్లో కనిపిస్తున్న కాషాయ ప్రభంజనాన్ని చూడాలని సవాల్ విసిరారు.
కరీంనగర్లో నిర్వహించిన బిజెపి మహా పాదయాత్రలో పాల్గొన్న బండి సంజయ్ కుమార్ భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నాయకత్వాన్ని కొనియాడుతూ, ఆయనను కొదమ సింహంతో పోల్చారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు కాషాయ దళం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ, అక్రమ వలసదారులు, డ్రగ్స్ సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వ హామీల అమలుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్పై బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. నితిన్ అంటే నిజాయితీ, నైతికత అని, నబీన్ అంటే నూతనత్వమని వ్యాఖ్యానించారు. నిజాయితీతో కష్టపడుతూ, నూతన ఆలోచనలతో పార్టీని పరుగులు పెట్టిస్తున్న నాయకుడు నితిన్ నబీన్ అని కొనియాడారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికై, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడని గుర్తుచేశారు. 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బిజెపి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆయన సొంతమని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్త ఈ స్థాయికి ఎదిగి నేడు బిజెపిని నడిపిస్తుండటం సాధారణ విషయం కాదన్నారు. ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ, దేశం, ధర్మం పట్ల అంకితభావమే ఆయనను ఈ స్థాయికి చేర్చాయని అన్నారు.
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం అసాధారణమని బండి సంజయ్ అన్నారు. కాషాయ జెండాను భుజాలపై మోసి మోసి కార్యకర్తల భుజాలు కాయలు కాశాయని, ఉద్యమాలు, ఆందోళనల్లో లాఠీ దెబ్బలు తిని ఒళ్లంతా గాయాలపాలైనా ఎన్నడూ భయపడలేదని భావోద్వేగంగా చెప్పారు. అధికారం కోసం కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం, పార్టీ ఆశయాల కోసం కార్యకర్తలు నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. కాషాయ జెండా గౌరవాన్ని కాపాడేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలు తెలంగాణలో బిజెపి ఎక్కడుందని ప్రశ్నిస్తున్నారని, కరీంనగర్లో కనిపిస్తున్న జనప్రభంజనాన్ని చూసి సమాధానం తెలుసుకోవాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను రాజకీయంగా బొంద పెట్టేందుకు కాషాయ దళం ఏ స్థాయిలో ఉరకలేస్తోందో ఈ మహా పాదయాత్ర స్పష్టం చేస్తోందని వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకించడంపై బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శిస్తూ, ఓటరు జాబితాలో అనర్హుల పేర్లను తొలగిస్తే కాంగ్రెస్కు వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు. చనిపోయిన మూడు కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తే తప్పేముందని నిలదీశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెస్సార్ మరణించి ఏళ్లు గడుస్తున్నా వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించలేదని ఉదాహరణగా ప్రస్తావించారు. 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన నాలుగు కోట్ల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తే కాంగ్రెస్కు వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన ఆరు కోట్ల మంది పేర్లను తొలగిస్తే ఎందుకు బాధపడుతున్నారని నిలదీశారు. కోటి మంది డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగించడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పిస్తుంటే కాంగ్రెస్కు వచ్చిన బాధేమిటని విమర్శించారు.
బంగ్లాదేశ్, పాకిస్థాన్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారి ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ భావిస్తోందా అని ప్రశ్నించారు. విదేశీ అక్రమ వలసదారులకు ఓట్లు, రేషన్ కార్డులు లభిస్తుండటంతో స్థానిక ప్రజల హక్కులకు, సంక్షేమానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితులను చూస్తూ ఊరుకోవాలా అని నిలదీశారు. విదేశీ చొరబాటుదారులకు భారత ప్రధానిని, ముఖ్యమంత్రులను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి ఘాటుగా స్పందిస్తూ.. ‘పప్పూ.. ఇక మీ పప్పులుడకవ్. అక్కడున్నది నిప్పు మోదీ. టచ్ చేస్తే మాడి మసైపోతావ్.. జాగ్రత్త’ అంటూ వ్యాఖ్యానించారు. ఎన్ని రాజకీయ డ్రామాలు ఆడినా, విదేశీ శక్తులతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా బిజెపి వెనక్కి తగ్గబోదని స్పష్టం చేశారు.
దేశంలో డ్రగ్స్ సమస్య యువత భవిష్యత్తును దెబ్బతీస్తోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల బారినపడి యువత అల్లాడుతుండటాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోదీ కంటతడి పెట్టారని పేర్కొన్నారు. యువతను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడేందుకు ‘నషా ముక్త్ భారత్’ పేరుతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. దేశ యువత భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని, ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీకి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్ అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రజలు అంతటి ఆదరణ చూపాలని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. తెలంగాణలో ఇప్పటికే అనేక పార్టీలకు అధికారం ఇచ్చారని, ఈసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ‘అందరికీ ఇచ్చారు అధికారం.. బిజెపికి ఇవ్వండి అవకాశం’ అంటూ నినదించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల రాజకీయాలకు చరమగీతం పాడే దిశగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

