ఎస్టీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి!
తెలంగాణలో గత ప్రభుత్వం గానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గానీ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తీవ్రంగా మోసం చేశాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. పోడు భూముల సమస్యపై ఆనాడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోడు భూములను తక్షణమే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, వాటి అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనులకు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని అన్నారు. నవంబర్ 15న భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా బిజెపి ఎస్టీ మోర్చా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహం నుండి కొమురం భీమ్ విగ్రహం వరకు ‘జనజాతీయ గౌరవ దివస్’ (గిరిజన గౌరవ దినోత్సవం) ర్యాలీ ఘనంగా జరిగింది. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొని, కొమురం భీమ్ విగ్రహం వద్ద భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా “జల్, జంగల్, జమీన్” (నీరు, అడవి, భూమి) హక్కుల కోసం బిర్సా ముండా వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. జార్ఖండ్ ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల రక్షణ కోసం అలుపెరగని పోరాటం సాగించి, ఆ ప్రజలందరి హృదయాల్లో భగవాన్ గా నిలిచిపోయారని గుర్తుచేశారు. ఒక ఆదివాసీ బిడ్డ ప్రదర్శించిన అసమాన వీరత్వాన్ని గౌరవిస్తూ, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ దివస్’గా ప్రకటించిందని పేర్కొన్నారు. కొమురం భీమ్ విగ్రహం సాక్షిగా నేడు బిర్సా ముండా జయంతిని జరుపుకోవడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు.
జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో బ్రిటిష్ పాలకులు భగవాన్ బిర్సా ముండాను బంధించిన రాంచీలోని పాత సెంట్రల్ జైలును, ఆయన త్యాగాలకు గుర్తుగా అద్భుతమైన స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఒకప్పుడు బిర్సా ముండాను బంధించిన జైలునే నేడు ఆయన పోరాట స్ఫూర్తిని, గిరిజనుల చరిత్రను, త్యాగాలను భావితరాలకు తెలియజేసే మ్యూజియంగా మార్చడం ఎంతో విశేషమని, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం తనకు దక్కిన అదృష్టమని అన్నారు. మోదీ ప్రభుత్వం నక్సలైట్లను నిర్మూలించి గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి మార్గం సుగమం చేసిందని స్పష్టం చేశారు. నక్సలైట్ల చేతుల్లో బాధితులుగా మిగిలిన వారికి పునరావాసం కల్పించడంతో పాటు, గిరిజన ప్రాంతాలను ప్రగతి పథంలో నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని వివరించారు. ఉచిత రేషన్ బియ్యం సరఫరాతో పాటు మౌలిక వసతులు, విద్య, నివాస సౌకర్యాలు కల్పించడం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు.
ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నేనావత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ డా. కె.లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు డా. గౌతం రావు, వేముల అశోక్, కళ్యాణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

