పేదరికంపై పోరులో కీలక ఘట్టం ‘మోదీ దశాబ్దం’
సరిగ్గా ఏడాది క్రితం నాగాలాండ్‌లోని మారుమూల కొండ ప్రాంతమైన కిఫిరే జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడి స్వయం సహాయక సంఘాలకు చెందిన గిరిజన మహిళలతో నేను ముచ్చటించాను. వారిలో ఎస్తేర్ అనే మహిళ కూడా ఉంది. ఆమె ‘లఖ్పతి దీదీ’. చిరుధాన్యాలతో తయారు చేసిన తమ ఉత్పత్తులు నాగాలాండ్ సరిహద్దులు దాటి, ఆన్లైన్ ద్వారా సుదూర ప్రాంతాల్లోని వినియోగదారులకు చేరుతున్నాయని ఆమె ఎంతో గర్వంగా వివరించారు. అయితే, నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది మెరుగైన భవిష్యత్తుపై వారిలో కనిపించిన ఆత్మవిశ్వాసం. మరింత పెద్ద కలలు కనాలని, ‘లక్షాధికారి దీదీ’లుగా ఎదగాలని వారిని ప్రోత్సహించాను. వారి అనుభవాలు భారత్‌లోని అత్యంత మారుమూల ప్రాంతాలకూ విస్తరిస్తున్న మార్పునకు అద్దం పట్టాయి. భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు దశాబ్దాలుగా అవకాశాలను పరిమితం చేసినప్పటికీ, మెరుగైన రేపటి కోసం అక్కడి ప్రజల్లో ఆకాంక్షలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
గత నెలలో ప్రపంచ బ్యాంకు భారత్‌కు సంబంధించి పేదరికం, సమానత్వంపై నివేదికను విడుదల చేసినప్పుడు కిఫిరేలో నేను మహిళలతో జరిపిన సంభాషణలు మళ్లీ గుర్తుకొచ్చాయి. 2011 నుంచి 2023 మధ్యకాలంలో దాదాపు 50 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయటపడ్డారని, అత్యంత తీవ్ర పేదరికం దాదాపుగా నిర్మూలన దశకు చేరుకుందని ఆ నివేదిక వెల్లడించింది. ఆ గణాంకాలు నేను స్వయంగా క్షేత్రస్థాయిలో చూసిన మార్పును ప్రతిబింబించాయి. అయితే పరిస్థితి ఎప్పుడూ ఇలా లేదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు దశాబ్దాలకు పైగా సామూహిక పేదరిక నిర్మూలన నెరవేరని హామీగానే మిగిలిపోయింది. 2010వ దశకం ప్రారంభంలోనూ పారిశుద్ధ్యం, పౌష్టికాహారం, స్వచ్ఛమైన వంట ఇంధనం, బ్యాంకింగ్ సదుపాయాల వంటి రంగాల్లో వెనుకబడిన దేశంగా, నిరంతర పేదరికానికి నిలయంగా అంతర్జాతీయ సమాజం ముందు భారత్ ను చిత్రీకరించేవారు. పేదల చేతుల్లో డబ్బు పెడితే పేదరిక సమస్య దానంతట అదే పరిష్కారమవుతుందన్నదే అప్పట్లో విస్తృతంగా వినిపించిన పరిష్కార మార్గం.
గత దశాబ్దం ఆ నమ్మకాన్ని పూర్తిగా తలకిందులు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తాత్కాలిక ఉపశమన చర్యల నుంచి పేదరికానికి కారణమవుతున్న అడ్డంకులను తొలగించే దిశగా భారత్ మౌలికమైన మార్పును చవిచూసింది. అంత్యోదయ స్ఫూర్తితో, అంటే అభివృద్ధి ఫలాలు సమాజంలోని చిట్టచివరి వ్యక్తికీ అందాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం మరింత కష్టమైన మార్గాన్ని ఎంచుకుంది. ప్రతి కుటుంబాన్ని విడివిడిగా పరిగణనలోకి తీసుకుని, వాటి కనీస అవసరాల కొరతను తీర్చడంపై దృష్టి సారించింది. అభివృద్ధి అత్యంత అవసరమైన వారికి ముందుగా చేరేలా చర్యలు చేపట్టింది.
పేదరికం అంటే కేవలం ఆదాయం లేదా వేతనాల కొరత మాత్రమే కాదు. ఒక కుటుంబానికి భద్రమైన ఇల్లు, సురక్షితమైన తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు, వైద్య సేవలు అందుబాటులో లేకపోతే, దాని ఆదాయం పెరిగినా ఆ కుటుంబం పేదరికం బారిన పడే ప్రమాదం తొలగిపోదు. ఒక్క అనారోగ్యం ఆ కుటుంబం కూడబెట్టుకున్న పొదుపు మొత్తాన్ని హరించివేసి వారిని మళ్లీ పేదరికంలోకి నెట్టేయవచ్చు. అందుకే మా ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అవసరమైన వారిని గుర్తించి వారికి చేరేలా రూపొందించింది. కొలవదగిన ఫలితాల సాధనపై కేంద్రీకరించింది. ఏ రకమైన కొరతను తొలగించాలనే ఉద్దేశంతో ఆ పథకాన్ని రూపొందించామో, అందుకు అనుగుణంగా దాని అమలును తీర్చిదిద్దింది. ఇందులో ఎలాంటి మంత్రదండం లేదు. ప్రతి పథకం కింద లబ్ధిదారులను జాగ్రత్తగా గుర్తించడం, సమర్థంగా ప్రయోజనాలను అందించడం, చివరి కుటుంబానికీ ఫలితం చేరేవరకు నిరంతరం పర్యవేక్షించడం అవసరమైంది.
ప్రధానమంత్రి మోదీ స్వయంగా ఎంతో శ్రద్ధతో, పట్టుదలతో పథకాల అమలును పర్యవేక్షించారు. కీలక దశల్లో జోక్యం చేసుకుని అడ్డంకులను తొలగించారు. క్షేత్రస్థాయిలో అమలుపై నిరంతర సమీక్షలు నిర్వహించారు. ప్రయోజనాల పంపిణీని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడాన్ని ప్రోత్సహించారు. ఈ నిరంతర పర్యవేక్షణే ప్రభుత్వ విధానాలను ప్రజల జీవితాల్లో కనిపించే వాస్తవిక మార్పులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.
స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల సదుపాయం మెరుగుపడటంతో పారిశుద్ధ్య పరిస్థితుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఫలితంగా ఏటా సుమారు 60 వేల నుంచి 70 వేల మంది శిశువుల మరణాలను నివారించగలిగామని అంచనా. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కుళాయి నీటి కనెక్షన్ల సంఖ్య 2019లో సుమారు మూడు కోట్ల కుటుంబాల నుంచి ప్రస్తుతం దాదాపు 16 కోట్ల కుటుంబాలకు పెరిగింది. దీంతో మహిళలు, బాలికలు నీటి కోసం సుదీర్ఘ దూరాలు నడిచి వెళ్లాల్సిన అవసరం తగ్గింది. నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారినపడే ప్రమాదమూ తగ్గింది. ఉజ్వల యోజన ద్వారా పొగలేని, స్వచ్ఛమైన వంటగదులు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పక్కా ఇళ్లను అందించి పేద కుటుంబాలకు భద్రతతో పాటు గౌరవప్రదమైన జీవనాన్ని కల్పించింది. నగదు రహిత ఆసుపత్రి వైద్య సేవలను అందించే ఆయుష్మాన్ భారత్ పథకం వైద్య ఖర్చుల వల్ల కుటుంబాలు ఆర్థికంగా కుదేలుకాకుండా రక్షణ కల్పిస్తోంది. ఒకప్పుడు కుటుంబాలను మళ్లీ పేదరికంలోకి నెట్టేసిన అనూహ్య ఆర్థిక, ఆరోగ్యపరమైన సంక్షోభాల నుంచి ఈ పథకాలన్నీ కలిసికట్టుగా రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. అదే సమయంలో కుటుంబాలపై ఖర్చుల భారాన్ని తగ్గిస్తూ, ఉపాధి, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు వెచ్చించేందుకు సమయాన్ని ఆదా చేస్తున్నాయి.
సంక్షేమ రక్షణ చర్యలు కుటుంబాలు మళ్లీ పేదరికంలోకి జారిపోకుండా అడ్డుకుంటాయి. అయితే, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలంటే వారికి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు అవసరం. కోట్లమంది ప్రజలకు ఆ ప్రయాణం ఒక బ్యాంకు ఖాతాతోనే ప్రారంభమైంది. ఒకప్పుడు ప్రభుత్వ ఖజానా నుంచి పంపే ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే అసలైన లబ్ధిదారులకు చేరుతున్నాయన్న అభిప్రాయం ఉండేది. ప్రత్యక్ష నగదు బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్-డీబీటీ) విధానం ఆ పరిస్థితిని మార్చేసింది. 59 కోట్లకు పైగా జన్‌ధన్ ఖాతాల ద్వారా ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఈ మార్పును సాధ్యం చేసింది సాంకేతిక పరిజ్ఞానమే.
బ్యాంకు ఖాతా ఉండటం వల్ల పొదుపు మొత్తాలను భద్రంగా దాచుకోవడమే కాకుండా, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డు ఏర్పడుతుంది. తద్వారా అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రుణాలు పొందేందుకు మార్గం సుగమమవుతుంది. ముఖ్యంగా ఆస్తిపాస్తులు లేని వారికి తొలి రుణం అందుబాటులోకి రావడం వారి జీవితాలను పూర్తిగా మార్చివేయగలదు. రెండు నెలల క్రితం ముద్రా పథకం లబ్ధిదారులతో సమావేశమైనప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుష్మితా ఘరాయ్ను కలిశాను. కరోనా మహమ్మారి సమయంలో ఆమె తండ్రి మరణించడంతో, ఆ తర్వాత వారి కుటుంబానికి చెందిన ప్రింటింగ్ వ్యాపారం పూర్తిగా కుప్పకూలిపోయింది. తనఖా పెట్టేందుకు భూమి గానీ, బంగారం గానీ లేని పరిస్థితుల్లో, ఎలాంటి పూచీకత్తు అవసరం లేని ముద్రా రుణం ఆమెకు ప్రింటింగ్ ప్రెస్‌ను తిరిగి ప్రారంభించేందుకు తోడ్పడింది. నేడు ఆమె తన సంస్థలో ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తొలుత పనిచేసిన సిబ్బందితో పోలిస్తే ఇది రెండింతలు. భవిష్యత్తులో డిజిటల్ ప్రింటింగ్ రంగంలోకి విస్తరించాలని కూడా ఆమె ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తన వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టుకోవడమే కాకుండా, మరింత అభివృద్ధి చేసుకోవాలన్న ఆమెలోని పట్టుదల నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆర్థిక వనరుల పరిమితులు ఉన్నప్పటికీ ఉన్నత లక్ష్యాలను సాధించాలన్న తపన కలిగిన లక్షలాది మంది యువ భారతీయుల ఆకాంక్షలకు ఆమె కథనం ప్రతిబింబం. ముద్రా పథకం కింద ఇప్పటివరకు 60 కోట్ల రుణ ఖాతాలకు ఆమోదం లభించగా, వాటిలో దాదాపు మూడింట రెండొంతులు మహిళలకే మంజూరయ్యాయి. వీధి వ్యాపారులకు, సంప్రదాయ చేతివృత్తుల వారికి ప్రధానమంత్రి స్వనిధి, ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాలు అండగా నిలుస్తున్నాయి. ఈ పరివర్తనలో మహిళలే ముందుండి నడిపించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పది కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములయ్యారు. దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) తదితర కార్యక్రమాల ద్వారా ఈ సంఘాలు పొదుపు, నైపుణ్యాభివృద్ధి, రుణ సదుపాయాలు, స్వయం ఉపాధి, వ్యాపారాభివృద్ధికి వేదికలుగా మారాయి.
3.7 కోట్ల మందికి పైగా మహిళలు ‘లఖ్పతి దీదీ’లుగా ఎదిగారు. వారిలో కొందరు అంతకుమించి ఎదిగి ‘క్రోర్‌పతి దీదీ’లుగా మారుతున్నారు. మరికొందరు ‘నమో డ్రోన్ దీదీ’లుగా శిక్షణ పొంది, ప్రస్తుతం రైతులకు పంటలపై డ్రోన్ల ద్వారా మందులు పిచికారీ చేసే సేవలను అందిస్తున్నారు. ఒకప్పుడు ఆర్థిక అవకాశాలకు దూరంగా ఉన్న మహిళలు నేడు సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ, తమకంటూ స్వతంత్ర జీవనోపాధి మార్గాలను నిర్మించుకుంటున్నారు.
తరతరాలుగా పేదరికం భారత్ భరించాల్సిన సమస్యే తప్ప, పూర్తిగా అంతం చేయగలిగేది కాదన్న భావన కొనసాగుతూ వచ్చింది. అయితే, ఒక దశాబ్దం క్రితం ఊహించడానికి కూడా సాధ్యం కాని లక్ష్యాన్ని, క్షేత్రస్థాయిలో ఏళ్ల తరబడి సాగించిన నిరంతర కృషితో ఇప్పుడు సాధించగలిగాం. అయితే, ఇక్కడితో విశ్రమించే సమయం కాదు. 2047 నాటికి వికసిత్ భారత్‌ను నిర్మించాలన్న లక్ష్యం మన ముందుకు కొత్త సవాళ్లను తీసుకొస్తోంది. ఈ ప్రయాణంలో తదుపరి దశలో ఇప్పటికీ పేదరికపు అట్టడుగున ఉన్న కొద్దిమందిని ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావడంతో పాటు, ఇప్పటికే పేదరికాన్ని అధిగమించిన వారు మరింత ముందుకు సాగేందుకు అవకాశాలు కల్పించాలి. వారు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా చూడాలి. వివిధ సంక్షేమ చర్యల ద్వారా ఇప్పటివరకు కల్పించిన రక్షణకు తోడు, ఇకపై ఆర్థిక వనరులు, మార్కెట్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరింత విస్తృతమైన అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాలి.
ఉపాధితో అనుసంధానమైన ప్రోత్సాహకాలు, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్షిప్ల ద్వారా విద్యా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య మరింత బలమైన సంబంధాలను ప్రభుత్వం ఏర్పరుస్తోంది. అదే సమయంలో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు దేశాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అనుసంధానిస్తున్నాయి. అవకాశాలు కొద్దిమందికే పరిమితం కాకూడదు. సమాజంలోని ప్రతి ఒక్కరికీ అభివృద్ధిలో భాగస్వాములయ్యే అవకాశం లభించాలి. స్వాతంత్య్రం ప్రతి భారతీయుడు అనుభవించాల్సిన హక్కు, బాధ్యత అయినట్లే, వికసిత్ భారత్ కూడా ప్రతి భారతీయుడు తన జీవితంలో భాగం చేసుకోవాల్సిన సంకల్పమని ప్రధానమంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆరు దశాబ్దాలుగా నెరవేరని లక్ష్యాన్ని కేవలం పదేళ్లలో సాధించిన భారత్, రాబోయే రెండు దశాబ్దాలను మరింత ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోగలదు. 140 కోట్ల మంది భారతీయుల దృఢ సంకల్పం తోడైతే, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం మనకు అసాధ్యమేమీ కాదు. మనమంతా కలిసికట్టుగా ఆ గమ్యాన్ని చేరుకుంటాం.
నిర్మలా సీతారామన్,
కేంద్ర ఆర్థిక మంత్రి

