ఆకాంక్షభరిత మండలాల్లో ప్రజల జీవితాల్లో పెనుమార్పులు
2018లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన పథకాలలో ఒకటైన ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమం దేశంలోని 112 జిల్లాల్లోని ప్రజల జీవితాల్లో పరివర్తనాత్మక మార్పులను తీసుకువస్తోంది. కీలక సామాజిక రంగాల్లో తక్కువ పురోగతి నమోదైన జిల్లాల్లో ఆర్థిక సూచీలను మెరుగుపరచడానికి, వాటిని ఒక స్థాయికి తీసుకురావడానికి ఈ విప్లవాత్మక పథకాన్ని ప్రారంభించారు. గత ఐదారు సంవత్సరాలలో ఈ కార్యక్రమం పాలనలోని లోపాలను సరిదిద్దింది. అభివృద్ధి అంతరాలను తొలగించింది. తద్వారా ఈ జిల్లాల్లో నివసిస్తున్న కోట్ల మంది జీవితాలను మెరుగుపరిచింది. అన్ని రాష్ట్రాలలో వాటి పరిమాణం, జనాభాలకు అనుగుణంగా ఆకాంక్షభరిత జిల్లాలు ఉన్నప్పటికీ, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్ లలో ఈ జిల్లాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత సమర్థంగా, క్షేత్రస్థాయిలో సత్ఫాలితాలు ఇచ్చేలా అమలు చేసే లక్ష్యంతో 2022లో ఆకాంక్షభరిత మండలాల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఈ ఆకాంక్షభరిత మండలాల్లో కొన్నింటిని పరిశీలిస్తే, వివిధ ఆర్థిక సూచీలలో అవి అద్భుతమైన, ఆదర్శవంతమైన పురోగతి సాధించినట్టు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి మండలంలో నగీనా అనే ప్రాంతం దాని విస్తృత శ్రేణి హస్తకళలు, కళాఖండాల కారణంగా జాతీయ, ప్రపంచ ఖ్యాతిని పొందింది. ఒక జిల్లా-ఒక ఉత్పత్తి (ఒపిఒడి) కార్యక్రమం పరిధిలోకి వచ్చే జిల్లాలు గత కొన్ని సంవత్సరాలలో కీలకమైన వృద్ధిని సాధించాయి. ఇక్కడ ఉన్న కామన్ ఫెసిలిటీ సెంటర్లు స్థానికులకు వారి సొంత వ్యాపారాలను ప్రారంభించడానికి ఆర్థిక సహాయం అందిస్తున్నాయి. అధికారిక రికార్డుల ప్రకారం 97 శాతం కంటే ఎక్కువ గ్రామాలు ‘‘బహిరంగ మలవిసర్జన రహిత’’ గ్రామాలు (ఓడిఎఫ్-ఫ్రీ)గా ప్రకటించారు. 98 శాతం గృహాలు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద (గ్రామీణ) నిర్మితమయ్యాయి. స్వయం సహాయక బృందాలు కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న వోకల్ ఫర్ లోకల్ (స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం) విధానం నుంచి లబ్ధి పొందాయి. స్థానికులు ‘‘వృద్ధిలో భాగస్వాములు’’ కావడానికి ఉత్సాహంగా సమీకృతమవుతున్నారు.
అస్సాంలో మాండియా మండలం గత కొన్ని సంవత్సరాలలో విశేషమైన మార్పులను వీక్షించింది. ప్రత్యేకించి గృహాలకు శుభ్రమైన నల్లా నీటిని పొందడంలో ఈ మండలం ఎంతో పురోగతి సాధించింది. ఈ ప్రాంతంలోని 80 శాతానికి పైగా ఇళ్లకు పరిశుభ్రమైన నల్లా నీరు అందుబాటులో ఉంది. స్థానిక పరిపాలనా యంత్రాంగం నియమించిన ‘‘జల్ మిత్ర’’ల కృషితో జల్ జీవన్ మిషన్ మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించింది. నీటి శుద్ధి ప్లాంట్లు ఇక్కడ భారీగా విజయవంతమయ్యాయి. ‘‘జల్ మిత్రలు’’ ఎప్పటికప్పుడు నీటి నాణ్యతను తనిఖీ చేస్తూ మండలంలోని కుటుంబాలకు నిరంతరాయంగా తాగునీరు సరఫరా అయ్యేటట్టు చూస్తారు.
జార్ఖండ్‌లోని డుమ్రీ మండలం ఆరోగ్యం, పోషకాహార రంగంలో అద్భుతమైన పురోగతి కనబరిచింది, ఇది అత్యుత్తమ పనితీరును చూపుతున్న ఆర్థిక సూచిక. ఆకాంక్షభరిత జిల్లా గుమ్లా పరిధిలోకి వచ్చే డుమ్రీ మండలం పిల్లల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, పౌష్టికాహారంతో వారి ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంపై దృష్టి సారించడం ఆదర్శప్రాయమైన ఫలితాలను ఇచ్చింది. ప్రభుత్వ కేంద్రాలు వాటి వైద్యాధికారుల ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైన శిశువులకు జన్మనివ్వడానికి అవసరమైన వైద్య సలహాలను కూడా అందిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్లోని ఓర్చా మండలంలో ‘‘పశు పాలన్’’ కార్యక్రమం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టితో చేపట్టిన కార్యకలాపాలు ఆదర్శప్రాయమైన ఫలితాలను ఇస్తున్నాయి. పెంపుడు జంతువులకు టీకాలు వేయడానికి విస్తృత స్థాయి కార్యక్రమం ఇక్కడ ప్రారంభించారు. పశువుల్లో గాలికుంటు వ్యాధిని ఎదుర్కోవడంలో ఇది కీలకంగా మారిందని పశువైద్య నిపుణుడు ఒకరు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని మద్దికెర మండలం నాణ్యమైన విద్యను అందించడంలో, మంచి విద్యా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో తనకంటూ మంచిపేరు సంపాదించింది. ఆంద్రప్రదేశ్ లోని ఆకాంక్షభరిత జిల్లాలు బాల్యవివాహాలను అరికట్టడం, ఆడపిల్లల ప్రోత్సహించడంలో మంచి పురోగతి సాధించాయి. ముఖ్యంగా, 2018 జనవరి 5న ఆకాంక్షభరిత జిల్లాల కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఆకాంక్షభరిత జిల్లాలలో విస్తృతమైన ప్రభావం, ఫలితాలు సాధించేందుకు జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ఆకాంక్షలను గుర్తించి వాటి సాధనకు ఏకాగ్రతతో కృషి చేయాలి,” అని అన్నారు. ఈ ఆకాంక్షభరిత జిల్లాలు, ఆకాంక్షభరిత మండలాల విజయగాథలు వాస్తవానికి సేవలను అట్టడుగు స్థాయి ప్రజలకు చేర్చడంలో ప్రభుత్వ నిబద్ధతను వెల్లడిస్తున్నాయి.

