పోలింగ్ ముగిసింది… ఇక ఫలితాలే
రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం ముగిసింది. మే 13న జరిగిన నాలుగో దశ పోలింగ్ లో తెలంగాణలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. జూన్ 4న ఓట్లను లెక్కిస్తారు. అనంతరం ఫలితారు ప్రకటిస్తారు. బిజెపి నాయకులు, కార్యకర్తలు పోలింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి బర్కత్ పురలోని దీక్ష మోడల్ హై స్కూల్ లోని పోలింగ్ బూత్ లో, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నియోజకవర్గంలోని జ్యోతి నగర్ సాధన స్కూల్ లో 174 పోలింగ్ బూత్ లో, మహబూబ్ నగర్ లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, ముషీరాబాద్ లో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, జాతీయ, రాష్ట్ర నాయకులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.
తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్‌సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం(74.37%)తో పోలిస్తే 8.7% తక్కువ. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలో అత్యధికంగా 76.78%, హైదరాబాద్‌లో అతి తక్కువగా 48.48% పోలింగ్ నమోదైంది. 2019 లోక్‌సభ, 2023 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే హైదరాబాద్‌లో మూడు శాతానికిపైగా అదనంగా పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో అత్యధికంగా ఖమ్మం లోక్‌సభ స్థానం పరిధిలో 75.30% నమోదైతే ఈసారి ఆ రికార్డును భువనగిరి అధిగమించింది. కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న తెలంగాణకు చెందిన ఓటర్లను కలపకుండా రాష్ట్రంలోని 3,32,16,348 మంది ఓటర్లకు 2,20,24,806 మంది 35,809 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ ప్రకటించారు. 2,10,771 మంది పోస్టల్ బ్యాలెట్‌తో ఓటు వేశారు. వారిలో 1,89,091 మంది ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, 21,680 మంది వృద్ధులు, దివ్యాంగులు. పోలింగ్ కేంద్రాల్లో 65.67% మంది ఓట్లేశారు, పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్న వారి గణాంకాలను కలిపితే అది 66.3 శాతానికి చేరుకుంది.
మెదక్ లోక్‌సభ పరిధిలోని నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాష్ట్రంలో అత్యధికంగా 84.25% పోలింగ్ నమోదైంది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని మలక్‌పేట సెగ్మెంట్లో అతి తక్కువగా 42.76% మంది ఓట్లు వేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో మేడ్చల్ సెగ్మెంట్లో అత్యధికంగా 3,85,149 మంది ఓట్లు వేశారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలోని భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్లో అతితక్కువగా 1,05,383 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

