2024 లోక్ సభ ఎన్నికల ఫలితాలు – జాతీయ, తెలంగాణ స్థాయిలో

త ఏప్రిల్ 19 నుంచి  జూన్ 1 వరకు జరిగిన 18వ లోక్ సభ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నో విధాలుగా చరిత్రను తిరగరాసింది. దేశానికి స్వాతంత్ర్యం మేమే తెచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ నెహ్రూ నాయకత్వంలో 1951, 1957, 1962లో వరుస విజయాలు సాధించినప్పటికీ తదనంతరం జరిగిన చైనా యుద్ధంలో ఘోర ఓటమితో వేలాది సైనికుల ప్రాణాలు బలవడమే కాకుండా, ప్రపంచంలో భారతదేశం ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతిన్నది. ఇది నెహ్రూ సైనిక, విదేశాంగ విధాన వైఫల్యాలకు నిదర్శనం. వరుసగా రెండు సార్లు ప్రధానిగా గెలిచిన ఇందిరా గాంధీ 1971 మార్చ్ ఎన్నికల్లో రాయ్ బరేలీలో జరిగిన అక్రమాల కారణంగా అలహాబాద్ హైకోర్ట్ తీర్పుతో తన పదవికే గండం రావడంతో సుప్రీం కోర్టులో తాత్కాలిక స్టే పొంది, ఎమర్జెన్సీ విధించి 18 నెలలకు పైగా నియంతృత్వ పాలన కొనసాగించి, మూడోసారి ఘోర ఓటమిని ఎదుర్కొంది. సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ వరుసగా రెండు సార్లు గెలిచినప్పటికీ, పెద్దఎత్తునయ అక్రమాలు, అవినీతి, కుంభకోణాలకు పాల్పడడంతో మూడో పర్యాయం ఘోర పరాభవం అనంతరం కాంగ్రెస్ కేవలం 42 సీట్లకే పరిమితమైంది. కానీ నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అర్థికపరంగా, శాంతిభద్రతల పరంగా, సైనిక పరంగా, దౌత్య పరంగా ఎన్నో ఘన విజయాలను సాధించి జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో మంది శత్రువులను ఎదుర్కొని హ్యాట్రిక్ విజయం సాధించింది.

2014 నుంచి బాగా బలహీనపడిన కాంగ్రెస్, ఇతర కుటుంబ పార్టీలు ఈ ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని బలమైన బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు అన్ని విభేదాలను పక్కకు పెట్టాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓట్లు చీల్చి బిజెపిని ఓడించేందుకే విడివిడిగా పోటీ చేశాయి. మైనార్టీ మతోన్మాద, అర్బన్ నక్సలైట్ ఆర్థిక కుట్రలతో ప్రజలకు అలవికాని అసంఖ్యాక హామీలు గుప్పించాయి. రిజర్వేషన్లతో సహా అనేక విషయాల్లో విష ప్రచారం చేసి, అమాయక ప్రజలను గందరగోళంలోకి నెట్టి, ప్రలోభ పెట్టి, మైనార్టీలను రెచ్చగొట్టి, ఎన్డీఏ కూటమిని కొన్ని స్థానాల్లో దెబ్బతీసినప్పటికీ వాళ్ల అంతిమ లక్ష్యం ఎన్డీఏ ఓటమిని సాధించలేకపోయారు. కొన్ని రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తగిలినప్పటికీ బిజెపి ఓట్ల శాతం తగ్గకపోవడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మరింత విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ లో బిజెపి, జనసేన, టీడీపీ కూటమి ముందెన్నడూ లేని రీతిలో అఖండ విజయం సాధించి, నిరంకుశ, అవినీతిమయమైన, మతోన్మాద జగన్ పార్టీని తుడిచిపెట్టింది. బిజెపి సొంత మెజారిటీ తగ్గినప్పటికీ కాంగ్రెస్ కనీసం మూడంకెల సంఖ్యను కూడా చేరుకోలేకపోయింది. వచ్చే ఐదేళ్లలో మోదీ 3.0 ప్రభుత్వం దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా, శాంతిభద్రతల పరంగా, సమైక్యతా పరంగా దేశాన్ని మరింత ముందుకు తీసుకుపోయి, బిజెపి సంకల్ప పత్రంలో పేర్కొన్నట్టు వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు.

2023లో తెలంగాణ సహా కర్నాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు నెలల్లోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన అలవికాని హామీలను అమలు చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిన కాంగ్రెస్ తెలంగాణలో 14 స్థానాలు ఆశించినప్పటికీ, 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ లో అయితే డిపాజిట్ నూ కోల్పోయింది.  కర్నాటకలో మూడోవంతు స్థానాలు కూడా గెలుచుకోలేక పోయింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారడీ మాటలు ప్రజలకు అర్థం కావడం మొదలై, బీఆర్ఎస్ ను ఏమాత్రం దరిచేరనీయని ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజలు మోదీ నాయకత్వంలోని బిజెపికి 8 లోక్ సభ స్థానాలతో 35 శాతం ఓట్లతో మంచి ఫలితాలు ఇచ్చారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బిజెపికి 70కు పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని సర్వేలు కూడా చెప్తున్నాయి. కొత్తగా ఏర్పడిన మోదీ 3.0 ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం, సమర్థులకు, కొత్త వారికి పెద్దపీట వేయడం, దేశ భవిష్యత్తుకు శుభసూచకంగా సామాజిక సమరసతకు సానుకూలంగానే కాకుండా మొత్తం ప్రపంచాన్ని కూడా మోదీ నాయకత్వంలోని భారతదేశం ఎన్నో శుభసంకేతాలను పంపించింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కుమార్ ను కేంద్రమంత్రివర్గంలోకి తీసుకోవడం రాష్ట్ర ప్రజలకు సంతోషాన్నిస్తుంది. 2024 లోక్ సభ ఎన్నికలు కొన్ని పాఠాలతో, ఎన్నో శుభ సూచకాలతో దేశ భవిష్యత్తును ముందుకు తీసుకుపోయే సంకేతాలను ఇచ్చింది.