AP NDA

ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిదే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (175)

  • బిజెపి 8
  • టీడీపీ 135
  • జనసేన 21
  • వైసీపీ 11

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు సొంతం చేసుకుంది. ఈ రాష్ట్రంలోని 25 లోక్‌సభ స్థానాల్లో 21 సీట్లు దక్కించుకుంది. అధికార వైసీపీ 11 అసెంబ్లీ సీట్లు, 4 లోక్‌సభ స్థానాలతో సరిపెట్టుకుంది. 8 ఉమ్మడి జిల్లాల్లో జగన్ పార్టీ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదంటే ప్రజలు ఎంతలా తిరస్కరించారో అర్థమవుతుంది. అభివృద్ధిని గాలికొదిలేసి, ప్రజలందరికీ చెందాల్సిన వనరుల్ని చెరబట్టి, అవినీతే లక్ష్యంగా… అస్మదీయులకు దోచిపెడుతూ చెలరేగిపోయిన వైసీపీకి ప్రజలు తగిన శాస్తి చేశారు. అదే సమయంలో అనుభవానికి, దార్శనికతకు, చిత్తశుద్ధికి పట్టం కట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, పిల్లలకు బంగారు భవిష్యత్తు కావాలన్నా మోదీ, చంద్రబాబు వల్లే సాధ్యమని మరోసారి బలంగా నమ్మారు. అంచనాలకు మించిన గొప్ప విజయాన్ని కట్టబెట్టారు.

కూటమికి అనుకూలంగా వెల్లువెత్తిన ఓట్ల సునామీలో వైసీపీ కొట్టుకుపోయింది. ఝంఝూమారుతం ముందు ఫ్యాన్‌ గాలి చిన్నబోయింది. 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 135 చోట్ల గెలుపొందగా, జనసేన పోటీ చేసిన 21 స్థానాల్నీ కైవసం చేసుకుంది. బిజెపి 10 స్థానాలకుగాను 8 చోట్ల గెలిచింది. లోక్‌సభ స్థానాల్లో టీడీపీ 16, బిజెపి 3, జనసేన 2 గెలుచుకున్నాయి. పోటీ చేసిన 17 స్థానాల్లో టీడీపీ ఒక చోటే ఓడిపోగా, జనసేన రెండు చోట్లా గెలిచింది. బిజెపి ఆరు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి మూడు చోట్ల గెలిచింది. వైసీపీ కేవలం 11 శాసనసభ, 4 లోక్‌సభ సీట్లకు పరిమితమైంది. అధికారంలో ఉన్న పార్టీ అతి తక్కువ స్థానాలకు పరిమతమవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఐదేళ్ల వైసీపీ పాలనలో రెండు విడతల్లో మంత్రులుగా ఉండి… ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్ప అందరూ ఓడిపోయారు. ఆయన కూడా తక్కువ మెజార్టీతో బయటపడ్డారు. జగన్‌ కేబినెట్‌లో ఐదేళ్లూ మంత్రిగా ఉండి చివరి నిమిషంలో టీడీపీలోకి వచ్చిన గుమ్మనూరు జయరాం విజయం సాధించారు. కూటమి అభ్యర్థులకు చాలాచోట్ల అసాధారణ మెజార్టీలు వచ్చాయి.

ఒడిశాలో విరబూసిన కమలం

ఒడిశా అసెంబ్లీ (147)

  • బిజెపి 78
  • బీజేడీ 51
  • కాంగ్రెస్ 14
  • సీపీఐ(ఎం) 1
  • స్వతంత్రులు 3

ఒడిశాలో కమలం విరబూసింది. నవీన్‌ పట్నాయక్ శకానికి తెరపడింది. ప్రజలు మోదీ గ్యారంటీని ఓటర్లు విశ్వసించారు. 25 ఏళ్ల బిజూ జనతాదళ్‌ (బీజేడీ) పాలనకు మంగళం పాడారు. అభివృద్ధే తమ అజెండాగా పేర్కొన్న మోదీ మునుపెన్నడూ లేనంతగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం చేశారు. ఖనిజ సంపదను వినియోగంలోకి తెస్తామని, పారిశ్రామిక రంగాన్ని పరుగులు తీయించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో యువత విశ్వసించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో బిజెపి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత సాధించింది. 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల బిజెపి విజయం సాధించింది. 51 చోట్ల బీజేడీ గెలిచింది. కాంగ్రెస్‌ 14 స్థానాలు సాధించింది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీకి 113, బిజెపికు 23, కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి.  ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శాసనసభలో 74 స్థానాలు అవసరం కాగా, బిజెపి ఆ సంఖ్యను దాటేసింది. 21 లోక్‌సభ స్థానాలకుగాను బిజెపి 20 స్థానాలు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించింది. బిజూ జనతాదళ్‌ (బీజేడీ) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. రెండు చోట్ల పోటీ చేసిన ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ స్వయంగా కంటాబంజి అసెంబ్లీలో ఓటమి పాలయ్యారు. మంత్రివర్గ సహచరులు ఆశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, ప్రదీప్‌ అమత్, బిక్రమ్‌కేసరి అరుక్, రీతా సాహు తదితరులు ఓటమి పాలయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబల్‌పూర్‌లో విజయం సాధించారు. బిజెపి తరఫున పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం, ప్రతాప్‌చంద్ర షడంగి, అపరాజిత షడంగి, సంబిత్‌ పాత్ర, భర్తృహరి మెహతాబ్‌ తదితరులు గెలిచారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో బిజెపి ప్రభంజనం

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ (60)

  • బిజెపి 46
  • ఎన్.పి.ఈ.పీ 5
  • ఎన్సీపీ 3
  • పీపీఏ 2
  • కాంగ్రెస్ 1
  • స్వతంత్రులు 3

 ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో బిజెపి ప్రభంజనం సృష్టించింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. కమలనాథులు 46 చోట్ల విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఏప్రిల్‌ 19న పోలింగ్‌ జరగ్గా.. ఫలితాలు జూన్ 3న వెలువడ్డాయి. 

‘సూర్యుడు ఉదయించే భూమి’గా పేరున్న అరుణాచల్‌లో 10 అసెంబ్లీ స్థానాలను బిజెపి ముందే ఏకగ్రీవంగా గెల్చుకుంది. ముఖ్యమంత్రి పెమా ఖండూ బరిలో నిలిచిన ముక్తో స్థానం కూడా అందులో ఒకటి. మిగిలిన 50 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. వాటిలో 36 సీట్లను బిజెపి తన ఖాతాలో వేసుకోగలిగింది. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 5, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 3, పీపుల్స్‌ పార్టీ ఆఫ్‌ అరుణాచల్‌ (పీపీఏ) 2 స్థానాల్లో విజయం సాధించాయి. 19 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్‌ ఒకే ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకుంది. మూడు నియోజకవర్గాల్లో స్వతంత్రులు జయభేరి మోగించారు. రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన 20 మంది ఈ దఫా విజయం సాధించారు. వారిలో బిజెపి నుంచి అత్యధికంగా 11 మంది ఉన్నారు. 2019లో బిజెపి 41 సీట్లు గెల్చుకోవడం ద్వారా అధికారాన్ని నిలబెట్టుకున్న సంగతి గమనార్హం. రాష్ట్రంలో బిజెపి తరఫున ఎన్నికల బరిలో దిగిన నలుగురు మహిళా అభ్యర్థులూ- దాసంగ్లూ పుల్‌ (హాయులియాంగ్‌), త్సెరింగ్‌ ల్హామూ (లుమ్లా), చకత్‌ అబోహ్‌ (ఖోంసా పశ్చిమ), న్యాబీ జిని దిర్చీ (బసర్‌)- విజయభేరి మోగించారు. వీరిలో దాసంగ్లూ పుల్‌ ఏకగ్రీవంగా ఎన్నికవడం గమనార్హం. 

 సిక్కింలో సిక్కిం క్రాంతికారీ మోర్చా (ఎస్‌కేఎం) అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 32 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. ఆ పార్టీ ఏకంగా 31 సీట్లను తన ఖాతాలో వేసుకుంది. 2019 వరకు రాష్ట్రాన్ని వరుసగా పాతికేళ్లపాటు పాలించిన సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎస్‌డీఎఫ్‌)ను ఒకే ఒక్క స్థానానికి పరిమితం చేసింది. ఒంటరిగా ఎన్నికల బరిలో దిగిన బిజెపి 31 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఒక్కచోటా విజయం సాధించలేకపోయింది. సిక్కిం అసెంబ్లీకి ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగ్గా, జూన్ 3న ఫలితాలు వెలువడ్డాయి.