బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 10న ప్రధానమంత్రి కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీఎంఓ అధికారులు, సిబ్బందినుద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యాలయాన్ని ప్రజా ప్రాధాన్యం గల సేవా వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఆది నుంచీ శ్రమిస్తున్నట్లు నొక్కిచెప్పారు. ప్రభుత్వం అంటే సరికొత్త శక్తికి, అంకితభావానికి, దృఢ సంకల్పానికి ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు. అంకితభావంతో ప్రజలకు సేవ చేయడమే పీఎంఓ ప్రధాన కర్తవ్యమన్నది తన విశ్వాసమని ఆయన ప్రకటించారు. ప్రభుత్వాన్ని నడిపేది మోదీ ఒక్కరే కాదని, వేలాది మేధావులు ఏకతాటిపైకి వచ్చి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని, దాని శక్తిసామర్థ్యాల ఔన్నత్యానికి పౌరులే సాక్షులవుతారని ఆయన స్పష్టం చేశారు. తన జట్టులోని వ్యక్తులెవరికీ సమయం, ఆలోచన లేదా కృషి విషయంలో ఎలాంటి పరిమితులు గానీ, నిర్ణీత ప్రమాణాలు గానీ ఉండవని నొక్కిచెప్పారు. అలాగే రాబోయే ఐదేళ్లపాటు వికసిత భారత్ పయనంలో కలిసి రావాలని, దేశ నిర్మాణంలో భాగం కావాలని ఆకాంక్షించే వారు తమనుతాము ఆ లక్ష్యాలకు అంకితం చేసుకోవాలని ఉద్బోధించారు. తన జీవితంలో అనుక్షణం దేశానికే అంకితమని ఆయన పునరుద్ఘాటించారు.
పీఎం కిసాన్ పై తొలి సంతకం
ప్రధాన మంత్రిగా మోదీ మూడో పర్యాయం పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం పిఎమ్ కిసాన్ నిధి తాలూకు పదిహేడో విడత విడుదలకు అనుమతిని ఇచ్చే ఫైలుపై సంతకం పెట్టారు. దీనితో 9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. సుమారు రూ.20,000 కోట్లు రైతులకు వితరణ చేస్తారు. ఫైలు పైన సంతకం చేసిన తరువాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ‘‘మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉంది. ఈ కారణంగా పదవీబాధ్యతలను స్వీకరించిన తరువాత కర్షకుల సంక్షేమానికి సంబంధించిన మొట్టమొదటి ఫైలు పైన సంతకం చేయడం సరైనది. రాబోయే కాలంలో రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం మరింత ఎక్కువగా పాటుపడుతాం.’’ అన్నారు.
3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా భారీఎత్తున ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మూడో విడత ప్రభుత్వం ఏర్పాటైన మరునాడే జూన్ 12న ప్రధాని మోదీ నివాసంలో మొదటిసారిగా సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద గ్రామీణ, పట్టణ పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను ఆమోదించింది. గత పదేళ్లలో పీఎంఏవై కింద 4.21 కోట్ల ఇళ్ల నిర్మాణం జరిగింది. ‘‘కోట్లాది భారతీయుల ‘జీవన సౌలభ్యం’, ఆత్మగౌరవానికి ఇదో ఉత్తేజం!… ప్రధానమంత్రి ఆవాస్ యోజనను మరింత విస్తరించడం ద్వారా అదనంగా 3 కోట్ల గ్రామీణ-పట్టణ గృహాల నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయించింది. దేశంలో గృహావసరాలను తీర్చడంతోపాటు ప్రతి పౌరుడి మెరుగైన జీవన ప్రమాణానికి భరోసా ఇవ్వడంపై ప్రభుత్వ నిబద్ధతను ఈ నిర్ణయం చాటి చెబుతోంది. అలాగే సార్వజనీన వృద్ధి, సామాజిక సంక్షేమంపై మా ప్రభుత్వ చిత్తశుద్ధిని కూడా ‘పిఎంఎవై’ విస్తరణ నిర్ణయం ప్రస్ఫుటం చేస్తుంది’’ అని ఎక్స్ లో ప్రధాని పేర్కొన్నారు.

