Modi Oath

ఇప్పటికీ చెక్కుచెదరని ‘బ్రాండ్ మోదీ’

Modi Collage2024 ఎన్నికల తీర్పు ‘బ్రాండ్ మోడీ’ గురించి మళ్ళీ చర్చకు తెరలేపింది. బిజెపి సొంతంగా మెజారిటీ సాధించలేకపోవడం వల్ల బ్రాండ్ మోదీ గణనీయంగా బలహీనపడిందని కొందరు విశ్లేషకులు పేర్కొన్నారు. కానీ వాస్తవానికి సీట్లు తగ్గినా బిజెపి ఇప్పటికీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి గెలిచి జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేయడాన్ని మోదీ బ్రాండ్ బలం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందనడానికి నిదర్శనమని చాలామంది భావిస్తున్నారు. 

ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బిజెపి 240 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 99 గెలుచుకుంది. కూటమి వారీగా చూస్తే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) 292 సీట్లు, దాదాపు 44 శాతం ఓట్లను గెలుచుకోగా ఇండీ కూటమికి 234 సీట్లు, 41 ఓట్లు లభించాయి. ‘‘మోదీ ప్రీమియం’’ లేదా ‘‘మోడీ అంశం (ఫాక్టర్)’’ అనేది పార్టీ ప్రధాన ఓటు బ్యాంకుల్లో లేని ఓటర్లను ఆకర్షించడంలో ప్రధానమంత్రి మోదీ సామర్థ్యంగా నిర్వచించవచ్చు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్డిఎస్) విడుదల చేసిన ఎన్నికల అనంతర సమాచారం, కొన్ని సంబంధిత పరిశోధనలు మోదీ ‘‘బ్రాండ్’’కు గల ప్రజాదరణ గురించిన ప్రశ్నలకు సమాధానాలను సూచిస్తున్నాయి.

స్థానిక అంశాల ప్రభావం

జాతీయ స్థాయిలో 2019 ఎన్నికల కంటే ఈ సంవత్సరం ఎన్నికల్లో స్థానిక అంశాలు ప్రాధాన్యం వహించాయి. ఈ ఎన్నికల్లో కేవలం 10 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేసేటప్పుడు ప్రధాన మంత్రి ఎవరన్నది అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. 2019లో 17 శాతం మంది ప్రధానమంత్రి అభ్యర్థి కోసమే తాము ఓటు వేస్తున్నట్టు తెలిపారు. తదనుగుణంగా, తమ స్థానిక అభ్యర్థులపై దృష్టి సారించిన ఓటర్ల వాటా 2019లో 31 శాతం నుంచి 36 శాతానికి పెరిగింది. ప్రధానమంత్రి ప్రాధాన్యత విషయానికొస్తే, నరేంద్ర మోదీకి 41 శాతం మద్దతు లభించగా, రాహుల్ గాంధీ రేటింగ్‌లు కేవలం 27 శాతం మాత్రమే. అంతరం ఇప్పటికీ గణనీయంగా ఉన్నప్పటికీ, 2019లో మోదీ రేటింగు 47 శాతం కాగా రాహుల్ రేటింగ్ 23 శాతంగా ఉంది. మనం గనుక ప్రధానమంత్రి అభ్యర్థి ఆధారంగా ఓటు వేసిన వారి సంఖ్యతో అంచనాలు వేస్తే మోదీ కారణంగా 2019లో బిజెపికి, దాని మిత్రపక్షాలకు దాదాపు 4.1 శాతం ఓట్లు వచ్చాయని చెప్పవచ్చు. 2024లో ఇది కేవలం 1.4 శాతం క్షీణించింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపికి మద్దతు తెలిపిన ఓటర్లలో 32 శాతం మంది మోదీ ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి కాకపోతే తాము దానికి ఓటు వేసే వాళ్ళం కాదని చెప్పారు. అటువంటి ఓటర్ల వాటా ఇప్పుడు 25 శాతానికి తగ్గి 2014 నాటి 27 శాతానికి దగ్గరగా ఉంది.

మోదీ ప్రజాదరణే కీలకం

ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణ కేవలం బిజెపికే కాకుండా దాని మిత్రపక్షాలకు కూడా సహాయపడుతోంది. ఆయన 2014లో బిజెపి మిత్రపక్షాలకు 20 శాతం, 2019లో 25 శాతం, 2024లో 27 శాతం ఓట్లను తెచ్చిపెట్టారు. అలాగే 2019లో బిజెపి 37.8 శాతం ఓట్లు సంపాదించింది. ఒక పరిశోధన ప్రకారం, ఇందులో 25.7 శాతం ఆ పార్టీ సిద్ధాంతాలు, విధానాలు నమ్మేవారు వేసిన ఓట్లు కాగా 12.1 శాతం ‘మోదీ అంశం’ కారణంగా లభించినవి.

ఈ సంవత్సరం బిజెపికి లభించిన 36.6 శాతం ఓట్లలో దాదాపు 27.4 శాతం బిజెపి అభిమానులు వేసినవి కాగా ‘‘మోదీ అంశం’’ కారణంగా దాదాపు 9.2 శాతం ఓట్లు వచ్చాయి. ‘‘మోదీ ప్రీమియం’’ 2019లో దాదాపు 12 శాతం నుంచి ఇప్పుడు దాదాపు 9 శాతం తగ్గినట్టు ఇది సూచిస్తుంది. అయినప్పటికీ, మోదీ కారణంగా ఇప్పటికీ బిజెపికి 9 శాతం ఓట్లు లభిస్తున్నాయి. ఇది ఎన్డీయే, ఇండీ కూటమికి ఉన్న ఓట్ల తేడాకు మూడు రెట్లు. మోదీ లేకపోతే ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చాలా కష్టపడేదని భావించవచ్చు. రెండు కూటముల మధ్య తేడాగా ఉన్న ఓట్లు ఆయనకు గల ప్రజాదరణ కారణంగా వచ్చినవేనని అనుకోవచ్చు.

2014లో మోదీ కారణంగా ఎన్డీయే దాదాపు 5.5 కోట్ల ఓట్లను సాధించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏపై ఎన్డీయే దాదాపు 8.7 కోట్ల ఓట్ల ఆధిక్యం సాధించింది. అంటే ఎన్డీయే ఆధిక్యంలో 63 శాతం మోదీ ప్రజాదరణ ఫలితమే. తర్వాతి ఎన్నికల్లో ఎన్డీయే ఆధిక్యం 11 కోట్లు. ఎన్డీయే ఆధిక్యంలో 77 శాతం మోదీ ప్రజాదరణ ఫలితమే. తాజా ఎన్నికల్లో మోదీ కారణంగా ఎన్డీయేకు దాదాపు 7.1 కోట్ల ఓట్లు లభించగా, ఇండీ కూటమిపై ఎన్డీయే ఆధిక్యం రెండు కోట్లకు చేరుకుంది. ఆ విధంగా మోదీ కారణంగా వచ్చిన ఓట్లు ఎన్డీయే ఆధిక్యత కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మోదీ లేకపోతే బిజెపి 240 స్థానాల్లో, ఎన్డీయే 292 స్థానాల్లో విజయం సాధించడం కష్టమై ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత బ్రాండ్ మోదీకి వయసు పెరిగి ఉండవచ్చు. లేదా ఆయనకు ఆదరణ పరాకాష్టకు చేరి ఉండవచ్చు. కానీ ఇప్పటికీ అది కాంగ్రెస్‌పై బిజెపి ఆధిక్యానికి ప్రధాన కారణంగా ఉంది.

అమితాబ్ తివారీ,
రాజకీయ విశ్లేషకుడు