GKR Holkar

అహల్యాబాయి జీవిత చరిత్ర అందరికీ తెలియాలి

భారతీయ సమాజంలో అహల్యాబాయి హోల్కర్ కు ప్రత్యేక చరిత్ర ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో వివరించాలని ఆయన కోరారు. మే 16న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో రాణి అహల్యాబాయ్ హాల్కర్ 300వ జయంతి వేడుకల నేపథ్యంలో రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డితో పాటు బిజెపి జాతీయ సహ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అహల్య భాయ్ హోల్కర్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి, కోకన్వీనర్లు డా. భోగ శ్రావణి, బండారు శైలజ, అజ్మీర బాబీ, సుధ తదితరులు పాల్గొన్నారు.

శివ ప్రకాష్ మాట్లాడుతూ ఈ నెల 21 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. జిల్లాలలో మహాహారతి కార్యక్రమంతో పెద్దఎత్తున ప్రారంభం కానుందని తెలిపారు. ఈ పది రోజులలో శోభయాత్రలు, కార్యశాలలు జరుగుతాయని పేర్కొన్నారు. చంద్రశేఖర్ తివారీ మాట్లాడుతూ హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అహల్యాబాయి హోల్కర్ చేసిన కృషి గర్వకారణమని కొనియాడారు. చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ అహల్యాబాయి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల కోసం జీవించారని అన్నారు. మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. సమత మాట్లాడుతూ మహిళలకు అహల్యాబాయి హోల్కర్‌ ఆదర్శమని అన్నారు.