nrr

దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసింది శూన్యమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ మరింతగా దోచుకుంటోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనం అంటే రైతుల బతుకులు బాగుచేయాలని, కేంద్రం సమయానికి యూరియాను పంపిస్తుంటే, దానిని కూడా కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని సరిదిద్దేందుకు దిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని చురకలంటించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, రైతులకు రుణమాఫీ చేయాలన్నా సీఎం దిల్లీకి వెళ్లాల్సిన పనిలేదని, ఇక్కడ నుంచే చేయొచ్చని ఎద్దేవా చేశారు. జనవరి 17న సికింద్రాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎన్.రాంచందర్ రావు అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల విజయ సంకల్ప సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ సమ్మేళనానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బిజెపి శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెంకటరమణా రెడ్డి, రామారావు పాటిల్, సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతమ్ రావు, వేముల అశోక్, తూళ్ల వీరేందర్ గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, మాధవి, సీనియర్ నాయకులు గరికపాటి మోహన్ రావు, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రానున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశం చేశారు. రాంచందర్ రావు ప్రసంగిస్తూ ‘‘ఇటీవల గ్రామ పంచాయతీల్లో మొట్టమొదటిసారిగా సుమారు వెయ్యి మంది సర్పంచులు, దాదాపు 10 వేల మంది వార్డు మెంబర్లు, 1200 నుంచి 1500 మధ్య ఉపసర్పంచులను గెలుచుకున్నాం. గతంలో 150 సర్పంచ్ స్థానాల నుంచి నేడు దాదాపు వెయ్యి సర్పంచ్ స్థానాల్లో గెలవడం అంటే గ్రామీణ ప్రజల్లో కూడా బిజెపికి ఆదరణ వేగంగా పెరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సుమారు 10 వేల స్థానాల్లో పోటీ చేసి కూడా కేవలం రెండు వేల స్థానాల్లో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ మాత్రం గెలిచిన వారంతా తమవారేనని చెప్పుకుంటోంది. ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో పోటీ కేవలం కాంగ్రెస్ – బిజెపి మధ్యే ఉంది. ప్రజలు కూడా ఈ రెండు పార్టీలనే ప్రత్యామ్నాయాలుగా చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రజల్లో పూర్తిగా కనుమరుగైంది. త్వరలో ఆ పార్టీ ముక్కలవ్వడం ఖాయం. దోచుకున్న సొమ్మును పంచుకోవడంలోనే వారు నిమగ్నమై ఉన్నారు. ప్రజల ఆకాంక్షలను వమ్ము చేసి ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారు. 

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లడం – రావడం లేదా బహిరంగ సభలు పెట్టడం తప్ప పాలనపై దృష్టి పెట్టడం లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఏది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? రైతులకు రైతుబంధు బంద్ పెట్టారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నేడు 40 శాతం కమీషన్ల ప్రభుత్వంగా మారింది. మంత్రుల మధ్య బహిరంగంగా ఘర్షణలు జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలను తుపాకీ పెట్టి బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. తెలంగాణలో అసలు అభివృద్ధి లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే అభివృద్ధి జరుగుతోంది. గత 11 ఏళ్లలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు, బీబీనగర్‌లో ఎయిమ్స్, ములుగులో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం, గ్రామీణ రోడ్లు, జాతీయ రహదారులు.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణను అభివృద్ధి చేస్తున్నది నరేంద్ర మోదీ ప్రభుత్వమే. అయినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా పేదలకు మోదీ ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం అందిస్తోంది. కానీ తెలంగాణలో ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా, ప్రధాని ఫోటో కూడా పెట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోంది. రేషన్ షాపుల్లో సీఎం ఫోటో మాత్రమే పెట్టి రేషన్ బియ్యం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తోందన్న తప్పుడు ప్రచారం చేస్తోంది. ఈ రోజు నగరాలు ముందుకు వెళ్తున్నాయంటే, స్వచ్ఛ భారత్ అమలవుతుందంటే, అమృత్ సిటీలు, స్మార్ట్ సిటీల కింద అభివృద్ధి జరుగుతుందంటే.. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధుల వల్లనే సాధ్యమయ్యాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. గ్రామీణ ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘వీబీ జీ రామ్ జీ’ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదు? ఫసల్ బీమా యోజనను ఎందుకు అమలు చేయడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా, కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంది. దానిపై తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సుమారు 52 లక్షల మందికి పైగా ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ఒక వంతు హైదరాబాద్‌లో, మరొక వంతు గ్రామీణ ప్రాంతాల్లో, మూడో వంతు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నివసిస్తున్నారు. తెలంగాణ ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని అత్యధిక స్థానాల్లో గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. మన భవిష్యత్తు బాగుండాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు రావాలి. పట్టణాలు అభివృద్ధి చెందాలంటే, పేదలకు ఇండ్లు రావాలంటే, ఆరోగ్య భద్రత కావాలంటే- అది కేవలం నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే పథకాల ద్వారానే సాధ్యం. వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. ఇటీవల కమ్యూనిస్టు అడ్డా అయిన కేరళ రాజధానియ త్రివేండ్రంలో కాషాయ జెండా ఎగురవేశాం. అదేవిధంగా మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 25 కార్పొరేషన్లను బిజెపి కైవసం చేసుకుంది. తెలంగాణలోనూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ఆదరించాలని ప్రజలను కోరుతున్నాను. మేం సేవ కోసమే వచ్చాం, ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతాం.’’ అని అన్నారు.

ఈ సమ్మేళనంలో బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ బిజెపికి ఒక్క ఛాన్స్ ఇస్తే, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుండి అధిక నిధులు తెస్తామని వివరించారు. అవసరమైతే సీఎస్సార్ నిధులు తెచ్చి బిజెపి పాలిత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే… గెలిచిన వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్ గూటికే వెళతారని అన్నారు. కరీంనగర్, నిజామాబాద్, బైంసా, నిర్మల్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో మజ్లిస్ దోస్తీ చేసిందన్నారు. బిజెపి గెలిచే చోట ఓట్లను తారుమారు చేసి మజ్లిస్ కు అధిక సీట్లు వచ్చేలా డీలిమిటేషన్ పేరుతో కాంగ్రెస్ కుట్ర చేసిందని విమర్శించారు. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్ కుట్రలను చిత్తు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పైసలను నమ్ముకుని గెలవాలనుకుంటున్నాయని, బిజెపి ప్రజలను నమ్ముకుని ఎన్నికల్లోకి వెళ్తోందన్నారు. అభివృద్ధి, ప్రజా సమస్యలు, హిందుత్వం….ఈ 3 అంశాలే బిజెపి ఎన్నికల ఎజెండా అని స్పష్టం చేశారు. ఒక్కో ఇంటికి 6 సార్లు వెళ్లాలని, వార్డుల వారీగా సమస్యలున్న చోటకే వెళ్లి స్థానికులకు భరోసా ఇవ్వాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ సూచించారు.