Hyderabad

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అంటూ కేటీఆర్ సరికొత్త సెంటిమెంట్!

‘తెలంగాణ సెంటిమెంట్’ ప్రయోగించి పదేళ్ళపాటు అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ పేరును టీఆర్ఎస్ నుండి  బీఆర్ఎస్ గా మార్చగానే చతికిలపడాల్సి వచ్చింది. జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలకు ఆదిలోనే గండి పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు కొత్త దారులు వెతుక్కొనే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని, తాను పదవి నుంచి వైదొలిగిన నాలుగు నెలలకే రాష్ట్రంలో రైతుల బతుకులు ఛిద్రమై పోతున్నాయంటూ కేసీఆర్ ‘రైతు బాట’ పట్టి రైతుల మద్దతు సమీకరించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో సైతం ప్రతి రోజూ పొలాలకు వెళ్లి, రైతులను పలకరించే ప్రయత్నం చేశారు. ఆయన కొడుకు కేటీఆర్ మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ లేకపోతే హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేస్తారంటూ సరికొత్త పల్లవి అందుకున్నారు. తెలంగాణకు ఆయువుపట్టు హైదరాబాద్ కావడం, ఇక్కడి నుండి వచ్చే ఆదాయంతోనే మొత్తం తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉండడంతో ఈ నినాదం రాష్ట్ర ప్రజలలో సరికొత్త సెంటిమెంట్ రగిలిస్తుందని ఆశ పడుతున్నారు. 

పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బిజెపి, కాంగ్రెస్‌ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని హెచ్చరించారు. వచ్చే జూన్‌ 2 నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతాయని, అప్పటి వరకు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు తీరుతుందని గుర్తుచేశారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయటానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు. అలా జరగొద్దు అనుకుంటే.. బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్‌లో గట్టి బలం ఉండాలని చెప్పడం ద్వారా తమకు ఓటు వేయకపోతే హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు దూరం అవుతుందనే భయాందోళనలు సృష్టించే ఎత్తుగడ వేశారు. అంతేకాకుండా ఓట్ల కోసం మన అవసరాలు తీరకుండానే గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకలకు తరలించేలా కావేరి నదితో అనుసంధానం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదంటూ మరో ఆరోపణ చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జమ్మూ కాశ్మీర్ కు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్ర హోదాను రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయడంతో హైదరాబాద్ లో కూడా అదేవిధంగా చేస్తుందనే భయాలు ప్రజలలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని పార్లమెంట్ ముఖంగా కేంద్ర మంత్రులు తేల్చి చెప్పారు. అయినా ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు. అయినా, కేసీఆర్, కేటీఆర్ ‘సెంటిమెంట్’ మాటలను ఇంకా నమ్మి మోసపోయే పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు లేరని కేటీఆర్ మాటలకు ఎటువంటి స్పందన కనిపించకపోవడం వెల్లడిస్తోంది. తెలంగాణ ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఇప్పటి వరకు ‘ఆత్మపరిశీలన’ చేసుకోలేని  బీఆర్ఎస్ నేతలు ఇంకా భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారానే పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి కీలకమైన కొలువులు, వనరులు, నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ఆగ్రహావేశాలకు గురయ్యామని గ్రహించే సాహసం చేయడం లేదు. తెలంగాణ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసి, ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించడాన్ని తెలంగాణ ప్రజలు సహించలేక పోయారని తేల్చుకోలేక పోతున్నారు. పైగా, తమ ప్రభుత్వంలో జరిగిన తీవ్రమైన అవినీతి, అక్రమాల గురించి మరచిపోతున్నారు. ఎక్కడికక్కడ భూకబ్జాలు, అవినీతిపరులకు ప్రభుత్వంలో కీలక పదవులు కట్టబెట్టడం, వారిని వెనుకేసుకురావడం, స్వయంగా కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ మద్యం కేసులో కీలక నిందితురాలిగా తేలడం… వంటి విషయాలను తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యమ పార్టీని ఓ కుటుంబ పార్టీగా మార్చడాన్ని సైతం తట్టుకోలేక పోతున్నారు. ఈ లోపాలను సరిచేసుకొనే ప్రయత్నాలు చేయకుండా సంకుచిత ఎత్తుగడలతో ప్రజలను మరింకా నమ్మించలేరని గ్రహించాలి.

ప్రవీణ్