దేశం గెలుస్తుంది… శత్రువులు ఓడిపోతారు
140 కోట్ల మంది భారతీయుల సంకల్పం జూన్ 4న నెరవేరబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశం గెలుస్తుందని, దేశ శత్రువులు ఓడిపోతారని స్పష్టం చేశారు. మే 10న మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నారాయణపేటలో, హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని భారతదేశం సమర్థిస్తుందా? రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడేవారికి మద్దతుగా నిలుస్తుందా? అని ప్రశ్నించారు. యువత ఆకాంక్షలను విస్మరించేవారు.. దేశ భవిష్యత్తుకు బాటలు వేయలేరన్నారు. మధ్యతరగతి ఆకాంక్షలను చిదిమేసే రాజకీయ పార్టీలు.. దేశాన్ని బలోపేతం చేయవన్నారు. ప్రతి ప్రాజెక్టులోనూ ముందుగానే అవినీతికి ఎంత ఆస్కారం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించేవారిని దేశ ప్రజలు ఎప్పటికీ సమర్థించరని చెప్పారు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ దోచుకుంటే.. ఇప్పుడు కాంగ్రెస్ ఆ పని చేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐంఎంలు వద్దని.. బిజెపిని గెలిపించుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఒక తేజస్సు కనబడుతోంది. దేశమంతటా ఉత్సాహం వెల్లువెత్తుతోంది. జూన్ 4న ఏం జరుగుతుందో ఇప్పటికే స్పష్టంగా తెలిసిపోయింది. దేశం గెలుస్తుంది. సీఏఏ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్, ఓట్ జిహాద్ల గురించి మాట్లాడేవాళ్లు, ఆర్టికల్ 370ని సమర్థించేవారు, ట్రిపుల్ తలాక్‌కు మద్దతు తెలిపేవారు, అవినీతిని సమర్థించేవారు, సంకుచిత ధోరణితో వ్యవహరించి వివక్షపూరిత రాజకీయాలకు పాల్పడేవారు, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ శత్రువులు ఓడిపోవడం ఖాయం. బిజెపిని గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
అవి పేలుళ్లు కోరుకుంటున్నాయి
హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో సీరియల్ బాంబు పేలుళ్లు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ఇలాంటి వార్తలే వినాల్సి వచ్చేది. ఒక కుటుంబం రెస్టారెంట్లో భోజనం చేస్తుంటే బాంబు పేలుళ్లు, సినిమా హాలులో బాంబు పేలుళ్లు, బస్సులో ప్రయాణిస్తుంటే పేలుళ్లు జరుగుతుండేవి. ఇప్పుడు దేశంలో అలాంటి వార్తలు వింటున్నామా? పేలుళ్లను ఎవరు ఆపారు? వాటిని ఆపేందుకు ఒక శక్తిమంతమైన, సమర్థ ప్రభుత్వాన్ని దిల్లీలో ఏర్పాటు చేసింది మీరే. ఈ మంచి పరిణామాల పట్ల కాంగ్రెస్, ఇండీ కూటమి సంతోషంగా లేవు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కావాలని అవి కోరుకుంటున్నాయి.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మధ్యతరగతి ప్రస్తావనే లేదు. మీ సంపదపై మీ సంతానానికి అధికారం ఉందా? లేదా? ఏ ప్రభుత్వానికైనా మీ సంపదను, మీ పిల్లల అధికారాన్ని కాదనే అధికారం ఉంటుందా? ఆ సంపదను కాంగ్రెస్ ఓటుబ్యాంకు రాజకీయాలతో పంచాలని భావిస్తోంది. ఎంఐఎంకు భయపడి కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తెలంగాణ విమోచన దినం నిర్వహించడం లేదు. విమోచన దినం జరపడానికి బిజెపి కంకణం కట్టుకుంది. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 17న విమోచనం దినం నిర్వహిస్తుంది.
హైదరాబాద్ లో రజాకార్ ట్యాక్స్
కాంగ్రెస్ అసలైన పరిశ్రమలు కాకుండా ఇక్కడ ఫేక్ వీడియో పరిశ్రమలు ఏర్పాటు చేసింది. అవినీతిలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్‌లా ఉంది. హైదరాబాద్‌లో ట్రిపుల్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. రజాకార్ ట్యాక్స్ వసూలవుతోంది. ఇది ఎలా వసూలవుతుందో హైదరాబాద్ పాతబస్తీలో కళ్లకు కడుతోంది. మజ్లిస్ ఎంతోకాలంగా అక్కడ ఉన్నా ప్రజలకు కనీస వసతులు లేవు. హైదరాబాద్ ఏటా వరద నీటిలో మునుగుతోంది. ప్రజల బాధలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పట్టించుకోవడం లేదు. విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి బిజెపి కంకణం కట్టుకుంది. రాష్ట్రానికి ఎయిమ్స్ ఎవరు ఇచ్చారు? నాలుగు వందేభారత్ రైళ్లు, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, పసుపు బోర్డు, రామగుండం ఎరువుల పరిశ్రమ ప్రారంభం, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు.. ఇవన్నీ చేసింది బిజెపి ప్రభుత్వం కాదా? తెలంగాణకు ఏమీ చేయలేదని ఎలా అంటారు? రాష్ట్రాన్ని ప్రపంచస్థాయిలో కేంద్రం అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్‌ను ఏవియేషన్ హబ్ చేసింది. రక్షణ, బయోటెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, తయారీ, సేవా రంగంలో రానున్న ఐదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం. సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్.. ఇదే బిజెపి మంత్రం.
పోలింగ్ రికార్డులు బద్దలైపోవాలి
బీఆర్ఎస్ కు వేసే ఓటు కాంగ్రెస్‌ను బలపరుస్తుంది. కాంగ్రెస్‌కు వేసే ఓటు బీఆర్ఎస్ ను బలపరుస్తుంది. వాళ్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయరు. తెలంగాణలో 17 స్థానాల్లోనూ బిజెపిని గెలిపించాలి. ఈ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ రికార్డులు బద్దలైపోవాలి. అత్యధిక పోలింగ్ నమోదు కావాలి. అత్యధిక పోలింగ్ బూత్‌లను గెలవాలి. ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి హైదరాబాద్‌కు మోదీ వచ్చారు.. మీకు నమస్కారం చెప్పారని తెలపండి. ప్రతి కుటుంబం ఇచ్చే ఆశీర్వాదం నన్ను ఎంతో బలోపేతం చేస్తుంది.
మహబూబ్‌నగర్ ప్రజలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారు. కేసీఆర్ అభివృద్ధి చేయలేదు. ఈ జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి కూడా అభివృద్ధి చేయడం లేదు. ఈ పరిస్థితి మారాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను దిల్లీకి పంపాలి. ఇక్కడ కృష్ణా, తుంగభద్ర నదుల ఆశీర్వాదం ఉన్నా.. నీటిపారుదల వసతులు లేవు. కాంగ్రెస్ రుణమాఫీ చేయకుండా విశ్వాసఘాతుకానికి పాల్పడింది. బిజెపి అభ్యర్థి డి.కె.అరుణ గురించి సీఎం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో ప్రజలు చూస్తున్నారు. దీనికి ప్రజలు అత్యధిక ఓట్లతో సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బిజెపి అభ్యర్థులందర్నీ గెలిపించాలి’’ అని ప్రధాని కోరారు.

