జూబ్లీహిల్స్‌లో కమలం! రాష్ట్రంలో అధికారానికి మార్గం!

100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, గత 23 నెలల పాలనలో ఏ ఒక్క హామీని అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. మహిళలకి ఇచ్చిన నెలకు రూ.2500 ఆర్థిక సాయం హామీ అటకెక్కించారు. చేయూత కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు నెలకు రూ.4000 పెన్షన్ ఇస్తామన్న హామీకి చెయ్యిచ్చారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీ నీటి మీది రాతగానే మారింది. యువతకు నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి హామీ బూటకమైంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తామన్న హామీ మరచిపోయారు. పీఆర్సీ వేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక పట్టించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులను వంచించారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటీ ఇస్తామన్న వాగ్దానం గాల్లో కలిసిపోయింది. అంబేద్కర్ అభయహస్తం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు, ఇంతవరకు ఒక్కరికి చేసిన దాఖలాలు లేవు. బీసీ సబ్ ప్లాన్ కింద బీసీల కోసం ఏడాదికి రూ.20,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.1 లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీ నెరవేరలేదు. పొదుపు సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్న హామీ కూడా గాల్లో కొట్టుకుపోయింది. కాంగ్రెస్ వైఫల్యాలు, వంచించిన హామీల జాబితా చాలా పెద్దదే. మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు, విద్యార్థులు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సహా కాంగ్రెస్ వంచనకు గురి కాని వర్గం లేదంటే అతిశయోక్తి కాదు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్ సమర్పించుకోకుంటే చిన్న బిల్లు కూడా పాస్ అయిన పాపాన పోలేదు. హైడ్రా, మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఇండ్లను కూల్చుతూ, వసూళ్లకు తెగబడుతున్నారు. సంతుష్టీకరణకు పెద్దపీట వేస్తూ మెజారిటీ అయిన హిందువుల భావోద్వేగాలకు తూట్లు పొడుస్తున్నారు. ఓవైసీ సోదరుల అడుగులకు మడుగులొత్తుతూ, ఓట్ల కోసం ఒక వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. ఓసీ కేటగిరీ కిందికి వచ్చే ఆ వర్గాన్ని బీసీల్లో కలుపుతూ ఓబీసీ రిజర్వేషన్లలో వెనకబడిన వర్గాలకు తీరని అన్యాయం చేసేందుకు కుట్ర పన్నారు. 

పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దుష్పరిపాలన ఇంకా మరచిపోలేదు. వారి అవినీతి కుంభకోణాలు.. ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాలకు తూట్లు పొడిచిన విధానం.. ఓ వర్గాన్ని ప్రసన్నం చేసుకునేందుకు సంతుష్టీకరణ రాజకీయాలు నడిపించిన తీరు.. ఇంకా మన స్మృతిపథం నుంచి చెదిరిపోలేదు. 

2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే దేశాభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తోంది. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ నాలుగో స్థానానికి ఎదిగి, 5 ట్రిలియన్ దిశగా వేగంగా దూసుకెళ్తోంది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదానికి దీటైన జవాబు చెప్పడమే కాదు, డిఫెన్స్ పరంగా అద్భుత శక్తిని చాటి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాం. ఆరోగ్యం నుంచి అంతరిక్షం వరకు… విద్య నుంచి మౌలిక వసతులు వరకు.. వ్యవసాయం నుంచి ఆధునిక సాంకేతికత వరకు అన్ని రంగాల్లో దేశం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశాన్ని ప్రగతి బాట పట్టించే, ప్రజలకు మేలు చేసే చారిత్రాత్మక నిర్ణయాలు, సాహసోపేత చర్యలు మోదీ పాలనలో ఎన్నో.. ఎన్నెన్నో..

ఇటువంటి తరుణంలో వచ్చిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు మంచి అవకాశం. 23 నెలల అరాచకానికి తగిన బుద్ధి చెప్తే కొంతైనా మారే అవకాశం ఉంది. లేకుంటే ఓటుబ్యాంకు రాజకీయాలు, మైనార్టీ సంతుష్టీకరణతో ఎన్నికలు గెలవగలమన్న ధీమా ఏర్పడితే కాంగ్రెస్ రజాకార్లను తీసుకొచ్చి ప్రజలు ముఖ్యంగా హిందువుల మీదికి ఉసిగొల్పుతుంది. 2023 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున పోటీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ బీఫాం ఇవ్వడం దీనికి సంకేతం. పదేళ్ల పాలనలో చేసిందేమీ చెప్పుకోలేక ‘సానుభూతి’ని నమ్ముకున్న బీఆర్ఎస్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను నిలబెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. బిజెపి అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోటీ పడుతున్న మాజీ సైనికాధికారి తనయుడైన లంకల దీపక్‌ రెడ్డిని గెలిపించాలి. అప్పుడే ప్రజలను అష్టకష్టాలకు గురిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సురుకు తగులుతుంది. ఇందుకు ప్రతి బిజెపి కార్యకర్తా తన వంతు ప్రయత్నం చేయాలి. జూబ్లీహిల్స్ లో ఎగిరే కమలం జెండా, తెలంగాణలో అధికారానికి మార్గం చూపిస్తుంది.