కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది. రైతులు బలవంతంగా రైస్ మిల్లర్లకు అడ్డికి పావుసేరుకు అమ్ముకునే పరిస్థితులు ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించి అన్నదాత నోట్లో మట్టికొట్టింది. ధాన్యం కొనుగోళ్లు ఆపడంతో కొంత మంది రైతులు కల్లాల్లోనే గుండె ఆగిన ఘటనలు ఎన్నో చూశాం. రైతుల దీనావస్థ చూసిన బిజెపి ‘రైతు గోస – బిజెపి భరోసా’ పేరుతో కల్లాల యాత్ర లాంటివెన్నో చేపడితే, కక్షగట్టిన కేసీఆర్ బిజెపి నేతలపై తప్పుడు కేసులు బనాయించి, దాడులు, దౌర్జన్యాలు చేయించారు. దోపిడీ కోసం కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకొని, అది కుంగిపోయే పరిస్థితికి తేవడంతో తీవ్రంగా ఆగ్రహించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించేందుకు కంకణం కట్టుకున్న తరుణంలో కాంగ్రెస్ బూటకపు హామీలు, గారడీ మాటలను నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారు.
ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలని, 420 హామీలని, రకరకాల డిక్లరేషన్లని, డిసెంబర్ 9 నాడే అన్ని హామీల అమలని, 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలని ప్రజలకు ఆశ పెట్టి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలినాళ్ల నుంచే మోసగించడం ఆరంభించింది. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వెంత నువ్వెంత అని.. తెలంగాణ ప్రజలను నువ్వు ముంచావంటే.. నువ్వు ముంచావని ఎన్నో రకాల డ్రామాలను తెలంగాణ ప్రజలు చూశారు. కేసీఆర్ దోపిడిలో కమీషన్ల కోసం కమిషన్లు, సిట్ లు, రకరకాల ఎత్తుగడలతో కాళేశ్వరంతో పాటు ఎన్నో అవినీతి కేసులను నానపెడుతూ, కోట్ల రూపాయలు వసూలు చేస్తూ, దోషులను శిక్షించకుండా బీఆర్ఎస్‌తో కుమ్ముక్కైన విధానం యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉంది.
రైతుబంధు స్థానంలో ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని, ప్రతి పంటకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రజలను నమ్మించి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొంత కాలం దానిని పట్టించుకోకుండా, తర్వాత కేవలం సన్నొడ్లకే క్వింటాలుకు రూ.500 బోనస్ అని చెప్తూ, అవి కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. అసలు ధాన్యమే సమయానికి కొనుగోలు చేయకుండా, రైతులు బలవంతంగా అడ్డికి పావుకు రైసు మిల్లర్లకు అమ్ముకునేలా కేసీఆర్ తరహాలో రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపిందని తెలంగాణ మేధావులు హెచ్చరిస్తున్నారు. ఇది ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కాదు, ఇంకేదో కుట్ర ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాహాటంగానే చెప్పారు. కేసీఆర్ పాలన సమయంలో జరిగినట్టే, ఇప్పుడు కూడా మార్కెట్లలోనే ధాన్యం నానుతూ, మొలకెత్తుతూ, కొట్టుకుపోతూ దీనమైన పరిస్థితి వస్తుంటే రైతు గుండె ఆగి ఆగిపోతుంది. వందలాది రైతులు రోడ్లెక్కి రాస్తారాకోలు, ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగా వ్యవహరిస్తోంది.
కాంగ్రెస్ బూటకపు హామీలు నమ్మి ఓటేస్తే పెనం మీంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి వస్తుందని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి హెచ్చరికల ఉద్దేశ్యమేంటో ప్రజలకు ఇప్పుడు అర్థం అవుతుంది. దీనావస్థలో ఉన్న రైతులకు అండగా నిలిచేందుకు ‘రైతు గోస – బిజెపి భరోసా ‘ పేరుతో బిజెపి బస్సు యాత్రను ప్రారంభించి, ధాన్యం కొనుగోళ్లలో ఇంకా ఆలస్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఈరోజున (మే 25 నాటికి) 12 లక్షల మెట్రిక్ టన్నులే కొన్నామని చెప్పడం సిగ్గుచేటంటూ యావత్ తెలంగాణ సమాజం నిందిస్తోంది. ధాన్యం కొనుగోళ్లను నిర్వీర్యం చేసి, రైతుల పంటల డబ్బులను దోచుకోవడం కోసం రైస్ మిల్లర్లతో కుమ్మకై, ఇంత రాక్షస కృత్యానికి ఒడిగడుతున్న ఈ దోపిడీదారుల ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వంగా చెప్పుకోవడం మరో దగాకోరుతనం. ఇన్ని పాపాలు చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురై, ఐదేళ్లు పూర్తి అధికారంలో ఉంటుందన్న నమ్మకం కూడా పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలకు బలి కాకుండా రైతులకు అండగా ఉండేందుకు బిజెపి చేపట్టిన రైతు భరోసా యాత్ర రైతులు ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని రాష్ట్ర పార్టీ హామీ ఇస్తుంది. కేంద్రం ఇచ్చే మద్దతు ధరకు కాకుండా, తరుగు, నాణ్యత పేరు మీద రైతులను మోసం చేస్తే ప్రజా ఉద్యమం పెల్లుబికుతుందని బిజెపి హెచ్చరిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు మీడియా స్టేట్మెంట్లు, సోషల్ మీడియా మేనేజ్మెంట్‌తోనే సరిపెట్టుకొని ఫాంహౌజ్‌కే పరిమితం కావడంతో రైతులు బిజెపి వైపు ఆశగా చూస్తున్నారు. రైతాంగానికి అండగా ఉండాలన్న పట్టుదలతో బిజెపి రాష్ట్ర శాఖ రైతుల దగ్గరికి వస్తోంది.

