సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్
“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. భారతదేశం కేవలం ఒక డిజైన్ గమ్యస్థానంగానే కాకుండా, మైక్రాన్, కేన్స్ కంపెనీల ప్లాంట్ల ద్వారా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు. ఈ పర్యావరణ వ్యవస్థ చిప్ డిజైన్, ఫాబ్రికేషన్, అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్, పరికరాలు, ఖనిజాలు, ప్రతిభావంతుల అభివృద్ధి వంటి విభాగాల్లో విస్తరించి ఉందని ఆయన వివరించారు. భారతదేశం ఇప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో సభ్యురాలిగా చేరిందని, మనం కేవలం ఒక వినియోగదారు దేశం నుంచి ఉత్పత్తి దేశంగా మారుతున్నామని ఆయన పేర్కొన్నారు. మనం వేరే దేశాల చిప్‌లపై ఆధారపడి సార్వభౌమ ఏఐ, సురక్షితమైన 5జి లేదా నమ్మకమైన ఐఓటీని నిర్మించలేమన్నారు. ఐఐటీ కాన్పూర్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ పూర్వ విద్యార్థి అయిన వైష్ణవ్ సెమీ కండక్టర్ రంగంలో భారత విజయానికి బాటలు వేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఆయన ఒక ఆంగ్ల వార్తాపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో సెమీ కండక్టర్ రంగంలో భారత యువతకు లభిస్తున్న అపారమైన అవకాశాల గురించి మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు:
ప్ర: మైక్రాన్, కేన్స్ సంస్థలలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో, ‘మేడ్ ఇన్ ఇండియా’ సెమీకండక్టర్ల తొలి దశ ప్రాధాన్యం ప్రాథమికంగా దేశీయ అవసరాలను తీర్చడమేనని మీరు భావిస్తున్నారా? భారతదేశం ప్రపంచ తయారీ కేంద్రంగా ఏ దశలో అవతరిస్తుందని మీరు భావిస్తున్నారు?
జ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో మన భవిష్యత్తును నిర్ణయించే ఒక పునాది పరిశ్రమను మనం నిర్మిస్తున్నాం. మా వ్యూహం చాలా స్పష్టమైనది. పూర్తి స్థాయి సెమీకండక్టర్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి మేం ‘సెమికాన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనిలో డిజైన్, ఫాబ్రికేషన్, అసెంబ్లీ, టెస్టింగ్, ప్యాకేజింగ్, మాడ్యూల్ తయారీ వంటి అన్ని రంగాలు ఉంటాయి. ‘ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0’ (ఐఎస్ఎం 2.0) దీనికంటే ఒక అడుగు ముందుకు వేసి—చిప్‌ల తయారీకి అవసరమైన పరికరాలు, వాయువులు, రసాయనాలపై దృష్టి పెడుతుంది. మేం కేవలం ఒక భాగాన్ని మాత్రమే కాకుండా, మొత్తం వ్యవస్థను నిర్మిస్తున్నాం. దేశీయ డిమాండ్ మనకు స్థిరమైన పునాదిని ఇస్తుంది. ప్రపంచంలోని చిప్ డిజైన్ ప్రతిభావంతులలో ఐదవ వంతు (20%) మంది భారతదేశంలోనే ఉన్నారు. ప్రపంచంలో మరే ఇతర ప్రాంతమూ అందించలేని మూడు విషయాలను మనం ఒకేసారి అందిస్తున్నాం: పరిమాణం, ప్రతిభ, నమ్మకం.
ప్ర: ఇప్పటివరకు పురోగతి ఎలా ఉంది? ఇందులో ఎదురైన సవాళ్లు ఏమిటి?
జ: 2022లో మేం ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ఐఎస్ఎం)ను ప్రారంభించినప్పుడు చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి. మేం మూడు ప్రధాన నిర్మాణపరమైన సవాళ్లను దీటుగా ఎదుర్కొన్నాం: పెట్టుబడి పరిమాణం, ప్రతిభ, లెతౌప సాంకేతిక పరిజ్ఞానం. పెట్టుబడుల విషయానికి వస్తే, ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకుంది; తన వాగ్గానాలకు అనుగుణంగా నిర్ణయాత్మక మద్దతును అందించింది. ప్రతిభ విషయానికొస్తే, మనం సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తెచ్చాం. పరిశ్రమల స్థాయిలో ఉపయోగించే అత్యాధునిక ఈడీఏ (ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్) సాధనాలు నేడు 315 కంటే ఎక్కువ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు కేవలం చిప్‌లను డిజైన్ చేయడమే కాకుండా, వాటిని తయారు చేస్తూ మన ల్యాబ్‌లలో పరిశీలిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో ప్రతిభను పెంపొందించే అవకాశం ప్రపంచంలో మరే దేశం ఇవ్వగలదో మీరే చెప్పండి. నేడు 12 ప్లాంట్లకు ఆమోదం లభించింది. ఇందులో 28ఎన్ఎం చిప్స్, సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్‌ల నుంచి అధునాతనమైన 3డి గ్లాస్ ప్యాకేజింగ్, కొత్తగా ఆమోదించబడిన మైక్రో-ఎల్ఇ డి డిస్ప్లే ఫ్యాబ్ వరకు ఉన్నాయి. మైక్రాన్, కేన్స్ సంస్థలు ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. రాబోయే కొన్ని నెలల్లో మరిన్ని యూనిట్ల నుండి చిప్‌లు వస్తాయని ఆశిస్తున్నాం. ఈ పురోగతి అంతా యజ్ఞంలా అమలు చేయడం ద్వారానే సాధ్యమైంది.
ప్రశ్న: రేర్ ఎర్త్ (అరుదైన మూలకాలు), కీలకమైన ఖనిజాల సరఫరాలో ఇబ్బందుల పరిస్థితి ఏమిటి? రాష్ట్రాలు దేశీయ సరఫరా గొలుసును నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?
జ: టెలికాం, ఎలక్ట్రానిక్స్, రవాణా, ఇంధనం, రక్షణ వంటి ప్రతి ఆధునిక పరిశ్రమకు కీలక ఖనిజాలు పునాది లాంటివి. ఒకవేళ వీటికి సంబంధించిన ముడిసరుకులు సురక్షితంగా లేకపోతే, మొత్తం విలువ గొలుసు ప్రమాదంలో పడుతుంది. ఇది కేవలం వాణిజ్యపరమైన సమస్య మాత్రమే కాదు; వ్యూహాత్మక భద్రతకు సంబంధించినది.
మా వ్యూహంలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి.
- జాతీయ కీలక ఖనిజాల కార్యక్రమం ద్వారా అవసరమైన ఖనిజాలను సేకరిస్తాం. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ కారిడార్లను (అరుదైన మూలకాల కారిడార్లు) ఏర్పాటు చేస్తున్నాం. దేశీయ వనరులను వెలికితీసి, స్థానిక ప్రాసెసింగ్, విలువ ఆధారిత వ్యవస్థలను నిర్మించడానికి మేం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాం.
- దీర్ఘకాలిక దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి పునరుత్పత్తికి వ్యవస్థలో భాగంగా చేశాం.
- మూడవది, వ్యూహాత్మక భాగస్వామ్యాలు. సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన కీలకమైన ఖనిజాల లభ్యతకు హామీనిచ్చే ‘ప్యాక్స్ సిలికా’లో భారతదేశం చేరింది. దేశ సరిహద్దుల్లోనూ, అంతర్జాతీయంగానూ సరఫరా గొలుసులను బలోపేతం చేస్తున్నాం, దీనివల్ల ఎక్కడా ఎలాంటి వైఫల్యాలు తలెత్తవు.
ప్ర: భారత్ జాతీయ భద్రత, ఆర్థిక సార్వభౌమాధికారానికి సెమీ కండక్టర్ రంగంలో స్వయం సమృద్ధి ఎంతవరకు కీలకం?
జ: గతంలో చమురు దేశానికి ఎంత ముఖ్యమో సెమీ కండక్టర్లు ఇప్పుడు అంతే ముఖ్యం. స్మార్ట్‌ఫోన్ నుంచి ఉపగ్రహం వరకు ప్రతి పరికరం సెమీ కండక్టర్ల ఆధారంగానే నిర్మితమవుతుంది. ఆ చిప్‌లు నమ్మదగినవి కాకపోతే, మన జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుంది. ఆత్మనిర్భర్ సెమీ కండక్టర్ వ్యవస్థను నిర్మించడం ద్వారా మన దేశ ప్రతిభావంతులకు భారతదేశంలోనే అవకాశాలు లభిస్తాయి. మన రక్షణ, అంతరిక్ష వ్యవస్థలు మనం నమ్మే చిప్లపైనే నడుస్తాయి, దీనివల్ల మనం ఇతరుల సరఫరా గొలుసులకు బందీలుగా మారాల్సిన అవసరం ఉండదు. సాంకేతిక ప్రపంచంలో, చిప్‌లను డిజైన్ చేసి తయారు చేసేవారే భవిష్యత్తును శాసిస్తారు. భారతదేశం ఇప్పుడు విశ్వసనీయ భాగస్వామిగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో అధికారికంగా చేరింది. మనం వినియోగదారు దేశం నుంచి ఉత్పత్తి దేశంగా మారుతున్నాం.
ప్ర: ప్రపంచ సెమీ కండక్టర్ దిగ్గజాలకు భారతదేశం నేడు ఎంతవరకు ఆకర్షణీయంగా ఉంది? వియత్నాం లేదా తైవాన్ వంటి కేంద్రాలతో పోలిస్తే భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏమిటి?
జ: ప్రపంచం నేడు భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా మాత్రమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు కొనసాగే సాంకేతిక భాగస్వామిగా చూస్తోంది. మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టేవి మూడు ప్రధాన బలాలు. ఒకటి స్థిరమైన విధానాలు. రాబోయే రెండు దశాబ్దాల కాలానికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. సెమీ కండక్టర్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టే కంపెనీలు 15-20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటాయి, కాబట్టి వారికి ఆ నమ్మకం అవసరం. రెండవది, అసాధారణమైన ప్రతిభ. ఎన్విడియా, ఏఎమ్‌డీ, ఇంటెల్, ఆర్మ్ వంటి దాదాపు అన్ని ప్రముఖ అంతర్జాతీయ సెమీ కండక్టర్ కంపెనీలు తమ కీలకమైన డిజైన్, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను భారతదేశం నుంచే నిర్వహిస్తున్నాయి. ప్రపంచంలోని చిప్ డిజైన్ శ్రామికశక్తిలో 20 శాతానికి పైగా మన దేశంలోనే ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన చిప్‌లు, చివరకు 2ఎన్ఎం చిప్‌లను కూడా భారతదేశంలోనే డిజైన్ చేస్తున్నారు. మూడవది, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మార్కెట్. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెలికాం, వైద్య పరికరాల రంగాలలో డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.
ప్ర: భారత్ పటిష్టమైన సెమీ కండక్టర్ వ్యవస్థను నిర్మించడంలో విజయం సాధిస్తే అది పరిశ్రమలు, స్టార్టప్‌లు, వినియోగదారులపై ఎలాంటి విప్లవాత్మక ప్రభావాన్ని చూపుతుంది?
జ: బలమైన సెమీ కండక్టర్ పర్యావరణ వ్యవస్థ మొత్తం ఆర్థిక వ్యవస్థపై బహుముఖమైన ప్రభావం చూపుతుంది. పరిశ్రమల పరంగా చూస్తే, ఇది స్థిరత్వాన్ని తీసుకువస్తుంది, అస్థిరమైన అంతర్జాతీయ సరఫరా గొలుసులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రక్షణ, అంతరిక్షం, రైల్వేలు, విద్యుత్ వంటి వ్యూహాత్మక రంగాలకు ఇది చాలా కీలకం. స్టార్టప్‌ల విషయానికి వస్తే, ఇది ఒక కొత్త, విస్తృతమైన రంగాలకు- డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, టూల్స్, మెటీరియల్స్, హార్డ్ వేర్- తలుపులు తెరుస్తుంది. వీడియో సర్వైలెన్స్ (సీసీటీవీ పర్యవేక్షణ), డ్రోన్ డిటెక్షన్, ఎనర్జీ మీటరింగ్, మైక్రోప్రాసెసర్లు, ఉపగ్రహ కమ్యూనికేషన్స్, బ్రాడ్‌బ్యాండ్, ఐఓటీ ఎస్ఓసీల (సిస్టమ్-ఆన్-ఎ-చిప్-అంటే అన్ని కంప్యూటర్ భాగాలను ఒకే చిప్‌లో అమర్చడం) వంటి కీలక రంగాలలో ఉపయోగించే చిప్‌లను భారతీయ స్టార్టప్‌లు డిజైన్ చేస్తున్నాయి. చాలా కంపెనీలు తమ ఆవిష్కరణలను ఉత్పత్తులుగా మార్చడానికి గణనీయమైన మొత్తంలో వెంచర్ క్యాపిటల్ నిధులను కూడా సేకరించాయి. ఇక పౌరుల విషయానికి వస్తే, దీనివల్ల మరింత తక్కువ ధరకు సాంకేతికత అందుబాటులోకి వస్తుంది, మెరుగైన సేవలు, సులభంగా అందుకోగలిగే డిజిటల్ సేవలు లభిస్తాయి.
ప్ర: భూమి, నీరు, విద్యుత్, నియంత్రణ చర్యలు భారతదేశ సెమీ కండక్టర్ మిషన్‌కు అత్యంత కీలకం. ఈ మిషన్ విజయవంతమయ్యేలా, రాష్ట్రాల్లో వెనుకబడిపోకుండా ఉండేలా మీరు ఏమిచర్యలు తీసుకుంటున్నారు?
జ: సెమీ కండక్టర్ తయారీకి అవసరమైన ఉన్నత ప్రమాణాల మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడానికి మేం కేంద్ర-రాష్ట్ర సమన్వయ విధానాన్ని అనుసరిస్తున్నాం. ఫ్యాబ్స్ కు అత్యంత స్వచ్ఛమైన నీరు, నిరంతర విద్యుత్ సరఫరా, శుభ్రమైన వాతావరణం అవసరం. భారతదేశంలో ఇంతకుముందు ఏ పరిశ్రమ కూడా ఈ స్థాయి ప్రమాణాలను కోరలేదు. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను అందిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతమైన భాగస్వాములుగా వ్యవహరిస్తున్నాయి. గుజరాత్లో మైక్రాన్ ప్లాంట్ కోసం కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే భూమిని కేటాయించారు. కేన్స్ ప్లాంట్ శంకుస్థాపన నుండి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడానికి కేవలం 14 నెలల సమయం మాత్రమే పట్టింది. ఈ విధమైన వేగమే పెట్టుబడిదారులలో నమ్మకాన్ని కలిగిస్తుంది.
ప్ర: సెమీ కండక్టర్ మిషన్ కింద రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో భారతదేశం ఎలాంటి నిర్దిష్ట మైలురాళ్లను ఆశించవచ్చు?
జ: సనంద్‌లోని మైక్రాన్, కేన్స్ అనే రెండు ప్లాంట్లలో ఇప్పటికే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. జూలైలో మరొక ప్లాంట్ నుంచి, అలాగే 2026 చివరి నాటికి నాల్గవ ప్లాంట్ నుంచి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమవుతుంది. రాబోయే సంవత్సరాల్లో, భారత్ టెలికాం, ఆటోమోటివ్, వినిమయ ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక రంగాల కోసం చిప్‌లను డిజైన్ చేసి తయారు చేస్తుంది. ప్రధాన ఫ్యాబ్ 2028లో ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
ప్రశ్న: సెమీ కండక్టర్ రంగంలో వస్తున్న ఈ ఊపు విస్తృతమైన డిజిటల్ ఇండియా మిషన్ మరియు ఏఐ, 5G, ఐఓటీ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ఎలా అనుసంధానమవుతుంది?
జ: సెమీ కండక్టర్లే డిజిటల్ ఇండియాకు పునాది. సార్వభౌమ ఏఐ, సురక్షితమైన 5జి లేదా నమ్మకమైన ఐఓటీ ని నిర్మించాలంటే మన సొంత సెమీ కండక్టర్ చిప్‌లను అభివృద్ధి చేసుకోవడం తప్పనిసరి. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ (ISM) ప్రధాన చిప్‌లపై దృష్టి సారిస్తుండగా, ‘ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ స్కీం’ (ECMS) సర్క్యూట్ బోర్డులు, సెన్సార్లు, కెపాసిటర్ల వంటి అనుబంధ భాగాల తయారీకి మద్దతు ఇస్తుంది. ఈ రెండు కార్యక్రమాలు కలిసి తక్షణమే ఉపయోగించదగిన ఎలక్ట్రానిక్ వ్యవస్థలను సృష్టిస్తాయి. అంతర్జాతీయ కంపెనీలు ఇప్పటికే భారతదేశంలో సర్వర్లు, టెలికాం పరికరాలను తయారు చేస్తున్నాయి. భారతదేశంలో తయారయ్యే చిప్‌లతో మేం ఈ ఉత్పత్తుల పూర్తి సమూహాన్ని ఇక్కడే తయారు చేస్తాం.
ప్ర: ఏఐ, వేగవంతమైన డిజిటలైజేషన్ కారణంగా హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్లైన్ మోసాల వంటి సైబర్ ముప్పులు వేగంగా పెరుగుతున్నాయి. అందుబాటు ధరల్లో లభించే స్మార్ట్ఫోన్ల ద్వారా కోట్లాది ప్రజలు మన దేశంలో ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ భద్రత కోసం ఎలాంటి చర్యలు అవసరం?
జ: డిజిటల్ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదు. మన పౌరులు సురక్షితంగా ఉన్నామని భావించనప్పుడు డిజిటల్ పరివర్తనకు అర్థమే లేదని ప్రధానమంత్రి తరచుగా చెబుతుంటారు. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు సురక్షితమైన, నమ్మకమైన డిజిటల్ వాతావరణాన్ని కల్పించాలని మేం నమ్ముతున్నాం. కొత్త ఐటీ నిబంధనల ద్వారా ప్లాట్‌ఫారమ్‌ల జవాబుదారీతనాన్ని మేం స్పష్టంగా నిర్వచించాం. ‘సెర్ట్-ఇన్’ (CERT-In) నిజసమయ (real-time) సైబర్ ముప్పులను తిప్పికొడుతుంది; ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’ (DPDP చట్టం) వ్యక్తిగత సమాచారాన్ని రక్షిస్తుంది; ఫైనాన్స్, ఇంధనం, టెలికాం రంగాల కోసం ప్రత్యేక సెర్ట్లను ఏర్పాటు చేశాం, అలాగే కీలకమైన మౌలిక సదుపాయాలకు సైబర్ ఆడిట్లను తప్పనిసరి చేశాం.
ప్రశ్న: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు రోజువారీ జీవితంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి, ఇవి తరచుగా తమ సొంత నిబంధనలతో నడుస్తుంటాయి. ప్రస్తుత మధ్యవర్తిత్వ నియమాలు, రక్షణలు బాగా ఉన్నాయని మీరు భావిస్తున్నారా? లేకపోతే, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడానికి ఇంకా ఏమి చేయవచ్చు?
జ: ‘ఈ కంటెంట్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ప్లాట్‌ఫారమ్‌లు కేవలం చేతులు దులుపుకొనే రోజులు పోయాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పుడు కంటెంట్ వ్యాప్తి, దృశ్యమానత, ఆదాయాన్ని క్రియాశీలంగా నిర్వహిస్తున్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లలోని ఆల్గారిథమ్‌లు ఏ కంటెంట్‌ను ప్రమోట్ చేయాలి, ఎవరు చూడాలి, అది ఎంతవరకు వ్యాపించాలో నిర్ణయిస్తాయి. నేటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు ఇకపై కేవలం డిజిటల్ నోటీసు బోర్డులు లేదా పుస్తకాల షాపులు మాత్రమే కావు. అవి ప్రజలకు ఆశ్రయం ఇచ్చే హోటళ్ల వంటివి. వంద కోట్లకు పైగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు, వేగంగా మారుతున్న కంటెంట్ రంగానికి అనుగుణంగా మేం మా నిబంధనలను మార్చాం. ‘2026 ఐటీ సవరణ నిబంధనలు’ డీప్‌ఫేక్‌లు, ఏఐ-ద్వారా మార్చిన విజువల్స్‌తో సహా కృత్రిమంగా సృష్టించిన కంటెంట్‌ను స్పష్టంగా నియంత్రిస్తాయి. ఆవిష్కరణలను లేదా ప్రైవేట్ పెట్టుబడులను అడ్డుకొనే కఠినమైన నిబంధనలకు వెళ్లకుండా సురక్షితమైన, నైతికమైన ఏఐని ప్రోత్సహించడానికి ఈ నిబంధనావళి స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది.
ప్ర: సోషల్ మీడియా వ్యసనం రోజురోజుకూ అంతర్జాతీయ సమస్యగా మారుతోంది, కొన్ని దేశాలు మైనర్లపై ఆంక్షలను కూడా పరిశీలిస్తున్నాయి. భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం అవసరమని మీరు భావిస్తున్నారా? ఈ సమస్యను పరిష్కరించడానికి సమతుల్యమైన విధానం ఏమిటి?
జ: మా విధానం చాలా సమతుల్యంగా ఉంటుంది; ఇంటర్నెట్ను అందరికీ అందుబాటులో ఉంచుతూనే, వినియోగదారులను, ముఖ్యంగా యువతను రక్షించడం మా లక్ష్యం. పిల్లల సమాచారాన్ని తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి అని డిపీడీపీ చట్టం ఇప్పటికే పేర్కొంది. మేం డిజిటల్ టోకెన్లు, ధృవీకరించిన సమాచార పాయింట్లను ఉపయోగించి ఆచరణయోగ్యమైన, సాంకేతికత-ఆధారిత వయస్సు-ధృవీకరణ విధానాలపై పని చేస్తున్నాం. మేం భద్రతను నిర్ధారించడం, వ్యసనానికి దారితీసే ఫీచర్లపై సహేతుకమైన ఆంక్షలను గట్టిగా సమర్థిస్తాం. భారతదేశంలో పనిచేస్తున్న ప్లాట్‌ఫారమ్‌లు కచ్చితంగా భారతీయ చట్టాలను పాటించాలి, మన యువత భద్రతకు పూర్తి బాధ్యత వహించాలి. ప్లాట్‌ఫారమ్‌లు తమ ఆల్గారిథమ్‌లు, సామజిక విధివిధానాలను రూపొందించేటప్పుడు మన సమాజంలోని వైవిధ్యం, సాంస్కృతిక నేపథ్యాన్ని తప్పనిసరిగా గౌరవించాలి.

