ప్రయోగశాల నుంచి ప్రజల జీవితాల్లోకి ఆవిష్కరణలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించినట్టు మన ప్రయాణం “ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు, ఆవిష్కరణ నుంచి ప్రభావం వైపు” సాగుతోంది. ఆ మార్పు ఇప్పుడు మన ఉన్నత విద్యా సంస్థలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ వేదికపై కూడా తనదైన ముద్ర వేస్తోంది. ఈ ఏడాది జూన్‌లో ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ‘భారత్ ఇన్నోవేట్స్’ (Bharat Innovates) కార్యక్రమం జరగనుంది. భారతదేశపు అగ్రశ్రేణి సంస్థల నుంచి ఉద్భవించిన 100కు పైగా డీప్-టెక్ సంస్థలు, 50కి పైగా పరిశోధనాత్మక ఆవిష్కరణలు ఈ వేదికపై కొలువుదీరనున్నాయి. ఇవి ఆరోగ్య సంరక్షణ, అధునాతన కంప్యూటింగ్ నుంచి అంతరిక్షం, ఇంధనం, వ్యవసాయ సాంకేతికత వంటి కీలక రంగాలలో అంతర్జాతీయ పరిశ్రమలు, పెట్టుబడిదారులు పరిశోధనా భాగస్వాములతో కలిసి పనిచేయడానికి మార్గం సుగమం చేస్తాయి. అనేక విధాలుగా ఈ ప్రయాణంలో ‘భారత్ ఇన్నోవేట్స్’ తదుపరి కీలక దశను సూచిస్తుంది. మన ప్రయోగశాలల్లో రూపుదిద్దుకుని, మన విద్యాసంస్థల ద్వారా మెరుగులు దిద్దుకున్న ఆలోచనలను ప్రపంచం ముందు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించే వేదిక ఇది. కేవలం ఆవిష్కరించడమే కాకుండా, ఆ ఆవిష్కరణలను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు ఉపయోగపడే పరిష్కారాలుగా మార్చగల మన దేశపు పెరుగుతున్న సామర్థ్యానికి ఇది నిదర్శనం.
గత దశాబ్ద కాలంలో పరిశోధనలను నిజ జీవితంలో ఉపయోగించే విధంగా మార్చే సానుకూల వాతావరణాన్ని భారతదేశం నిర్మించింది. పరిశోధనా వ్యవస్థను నిరంతరం బలోపేతం చేయడం ద్వారా ఈ మార్పు సాధ్యమైంది. డాక్టోరల్ ప్రతిభపై పెట్టుబడులు, దీర్ఘకాలిక నిధుల ప్రణాళికలు, ఆవిష్కరణల పెట్టుబడులు ఇప్పుడు ఒకే తాటిపైకి వస్తున్నాయి. మరోవైపు ‘ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్’ (PMRF) పరిశోధనా రంగాన్ని మరింత సుసంపన్నం చేస్తోంది. ‘అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్’ (ANRF) నిధుల కేటాయింపునకు స్పష్టమైన దిశను నిర్దేశిస్తూ స్థాయిని, పరిధిని పెంచుతోంది. ఇక ‘పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణ’ (RDI) పథకం అభివృద్ధి చెందుతున్న రంగాలలో నష్టభయం (రిస్క్) ఎక్కువగా ఉండి, అధిక ప్రభావం చూపే కార్యక్రమాల కోసం నిధులను అందుబాటులోకి తెస్తోంది. పరిశోధన కేవలం జ్ఞాన పరిధులను విస్తరించడమే కాకుండా నిజ జీవిత సమస్యలను కూడా పరిష్కరించాలనేది దీని వెనకున్న లక్ష్యం.
ఆవిష్కరణలు అత్యాధునికంగా ఉండటంతో పాటు అందరికీ అందుబాటులో ఉండేలా, విస్తరించదగినవిగా, సమకాలీన అవసరాలకు తగినవిగా ఉండేలా భారతదేశ విధానం సాగుతోంది. దీని ఫలితాలు ఇప్పుడు మన కళ్లముందే కనిపిస్తున్నాయి. మన ఉన్నత విద్యా సంస్థల నుంచి ఉద్భవిస్తున్న స్టార్టప్‌లు నేడు అన్ని రంగాల స్వరూపాన్ని మార్చివేస్తున్నాయి. ఐఐటీ మద్రాస్‌లో రూపుదిద్దుకున్న ‘ఏథర్ ఎనర్జీ’ (Ather Energy) స్వదేశీ విద్యుత్ వాహన రంగాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఐఐటీ బాంబే నుంచి వచ్చిన ‘సెడెమాక్’ (Sedemac) ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి అగ్రశ్రేణి సంస్థగా ఎదిగింది. ‘ఇమ్యునోఏసీటీ’ (ImmunoACT) సామాన్యులకు అందుబాటులో ఉండే తదుపరి తరం క్యాన్సర్ చికిత్సలను అందిస్తోంది. ‘గెలాక్స్ ఐ’ (GalaxEye) వ్యవసాయం, నౌకాయానం, రక్షణ రంగాలలో ఉపయోగపడే మల్టీ-సెన్సార్ ఉపగ్రహాలను నిర్మిస్తోంది. ‘ట్రైకాగ్ హెల్త్’ (Tricog Health) ప్రపంచవ్యాప్తంగా మూడుకోట్లకు పైగా స్క్రీనింగ్‌ల (పరీక్షల) ను పూర్తి చేసి, గుండె జబ్బులను ముందస్తుగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇవేవీ యాదృచ్ఛిక విజయాలు కావు. పరిశోధన, ఇంక్యుబేషన్ (ప్రారంభ దశలో అందించే చేయూత), వ్యవస్థాపకత ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉన్న వ్యవస్థ ఫలితాలివి.
విద్యాసంస్థల్లో సాంకేతిక విప్లవం
ఈ మార్పు విద్యా సంస్థల లోపల కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ వివిధ రంగాలలో నేరుగా వినియోగించుకోదగిన సాంకేతికతలను రూపొందిస్తున్నాయి. ఐఐటీ మద్రాస్‌లో జరిగిన పరిశోధనలు, పరిశ్రమల పర్యవేక్షణ కోసం ‘ఫైబర్-ఆప్టిక్ సెన్సింగ్ సిస్టమ్స్’ ఆవిష్కరణకు దారితీశాయి. కృత్రిమ మేధ (AI) ఆధారిత రేడియోలాజికల్ సాధనాలు వస్తూత్పత్తి రంగంలో లోపాలను గుర్తించడాన్ని సులభతరం చేస్తున్నాయి. స్వయంప్రతిపత్తి గల (అటానమస్) రోబోటిక్ వ్యవస్థలు రైల్వే భద్రతను మెరుగుపరుస్తున్నాయి. ఖనిజాలు, ధాతువుల రంగంలో సాధించిన పురోగతి వజ్రాల గుర్తింపు, ప్రామాణీకరణను సాధ్యం చేస్తోంది. బయోటెక్నాలజీ రంగంలో జరుగుతున్న కృషి టిష్యూ ఇంజనీరింగ్, పునరుత్పత్తి వైద్యం సామర్థ్యాలను పెంచుతోంది. ఇలాంటి కేవలం 15 సెంటర్స్ అఫ్ ఎక్సలెన్స్ ద్వారానే ఇప్పటివరకు 245కు పైగా పేటెంట్లు, 50కి పైగా స్టార్టప్‌లు ఉద్భవించాయి. ఈ సమూల మార్పు భారతదేశపు స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ పరిమాణంలో కూడా కనిపిస్తోంది. దశాబ్దం క్రితం 500 కంటే తక్కువగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య, నేడు 2.23 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్‌లకు చేరుకుంది. కేవలం గత ఏడాదిలోనే దాదాపు 55,000 స్టార్టప్‌లు కొత్తగా వచ్చాయి. ప్రస్తుతం మనం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ పర్యావరణ వ్యవస్థగా ఎదిగాం. ఇందులో 120కి పైగా యూనికార్న్‌లు (100 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగిన స్టార్టప్ లు) ఉన్నాయి. అంకుర సంస్థలు 23 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించాయి. ఈ అద్భుతమైన వేగానికి ప్రధాన చోదక శక్తి మన ఉన్నత విద్యా సంస్థలే. దేశవ్యాప్త క్యాంపస్‌లలో ఒక స్పష్టమైన సాంస్కృతిక మార్పును మనం చూస్తున్నాం. కేవలం ‘సురక్షితమైన ఉద్యోగాల (ప్లేస్‌మెంట్స్)’ వైపు కాకుండా సొంతంగా ‘పరిశ్రమలను స్థాపించాలనే’ బలమైన ఆకాంక్ష యువతలో పెరుగుతోంది. ‘లక్షల ప్యాకేజీల నుంచి స్టార్టప్‌ల వైపు’ సాగుతున్న ఈ ప్రయాణం, సవాలుతో కూడిన నిర్ణయాలు తీసుకుంటూ, పెద్దయెత్తున సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్న నవతరం ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
ప్రస్తుతం మన దేశంలోని దాదాపు సగం స్టార్టప్‌లు ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నగరాల నుంచి వస్తున్నాయి. 45 శాతానికి పైగా స్టార్టప్‌లలో మహిళలు నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. భారతదేశంలో ఆవిష్కరణలు నేడు దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తూ, అందరినీ కలుపుకొంటూ అట్టడుకు స్థాయికి చొచ్చుకుపోతున్నాయి. ఇదే ‘ఆవిష్కరణల ప్రజాస్వామ్యీకరణ’. విద్యా రంగంలో కృత్రిమ మేధ (AI) పట్ల భారతదేశం అవలంబిస్తున్న విధానంలో కూడా ఇది కనిపిస్తోంది. ‘బోధన్ ఏఐ’ (Bodhan AI) వంటి కార్యక్రమాలు బహుభాషా సాంకేతికతలను ఉపయోగించుకుంటూ, విభిన్న భాషా నేపథ్యాలు ఉన్నవారందరికీ విద్యను మరింత సులభంగా, సమానంగా అందుబాటులోకి తెస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ అందిస్తున్న విస్తృత సహకారాన్ని ప్రతిబింబిస్తాయి. ఇక్కడ ఆవిష్కరణలు కేవలం అత్యాధునికంగా ఉండటమే కాకుండా వివిధ సమాజాలకు అనుగుణంగా మార్పు చెందేవిగా, అందరినీ కలుపుకొని పోయేవిగా, విస్తరించేందుకు అనుగుణమైనవిగా రూపొందించబడుతున్నాయి.
భవిష్యత్తు కార్యాచరణ
మనం భవిష్యత్తు గురించి ఆలోచిస్తే, ఈ ప్రయాణపు తదుపరి దశ ఈ మార్పును మరింత బలోపేతం చేయాల్సి ఉంది. పరిశోధనలను ఉత్పత్తులుగా మార్చడానికి బలమైన మార్గాలను నిర్మించడంతో పాటు, పరిశోధనలలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మేం కట్టుబడి ఉన్నాం. ఈ దిశగా ఒక కీలకమైన అడుగు ఏమిటంటే మరింత ‘ఉత్పత్తి ఆధారిత డాక్టోరల్ పరిశోధనల’ వైపు సాగడం. దీనివల్ల పీహెచ్‌డీ కేవలం సిద్ధాంత గ్రంథానికే పరిమితం కాకుండా, ఒక స్పష్టమైన ఉత్పత్తిగానో లేదా వినియోగంలోకి తెచ్చే సాంకేతికతగానో రూపాంతరం చెందుతుంది. దీని కోసం పరిశ్రమలతో మరింత చురుకైన భాగస్వామ్యం అవసరం. ఉమ్మడి కృషి, ప్రారంభ దశలోనే భాగస్వామ్యం, పరిశోధనలపై దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడం ఇక్కడ అత్యంత కీలకం. పరిశ్రమలు కేవలం ఆవిష్కరణలను స్వీకరించేవారిగా మాత్రమే కాకుండా, వాటిని రూపొందించడంలో క్రియాశీలక భాగస్వాములుగా మారాలి. ఇది ‘ఆవిష్కరణ నుంచి ఆచరణ’ వైపు సాగే ప్రయాణాన్ని వేగవంతం చేస్తుంది. అలాగే సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడంతో పాటు పరిష్కారాలను కనుగొనడంలో సమానమైన నైపుణ్యం కలిగిన సరికొత్త పరిశోధకుల తరాన్ని ఇది సృష్టిస్తుంది. ఇది ‘ఆత్మనిర్భర్ భారత్’ దార్శనికతకు అత్యంత ప్రధానమైనది. భారతదేశంలో భారతదేశం కోసం, ప్రపంచం కోసం సాంకేతికతలను నిర్మించడమే దీని అంతరార్థం. అదేవిధంగా, జ్ఞానం, ఆవిష్కరణ, సమ్మిళిత్వాల ఆధారంగా ముందుకు సాగే ‘వికసిత్ భారత్’ భావనకు కూడా ఇది అంతే కీలకం.
‘భారత్ ఇన్నోవేట్స్’ నేడు భారతదేశపు విశిష్ట, ఉన్నత స్థానాన్ని స్పష్టం చేస్తోంది. అంతకంటే ముఖ్యంగా, భారత్ ఏ దిశగా పయనిస్తోందో ఇది సూచిస్తుంది: భారత్ ఇకపై కేవలం ఆలోచనలను సృష్టించే దేశం మాత్రమే కాదు, వాటిని పూర్తి ఆత్మవిశ్వాసంతో, భారీ స్థాయిలో ఆచరణలో పెట్టే దేశం. ప్రయోగశాలల నుంచి ప్రజల జీవితంలోకి (lab to life) సాగుతున్న ఈ ప్రయాణం ఇప్పటికే వేగం పుంజుకుంది.
ధర్మేంద్ర ప్రధాన్,
కేంద్ర విద్యా శాఖ మంత్రి

