కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బిజెపి శాసనసభా పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వ్యవసాయ మార్కెట్లను సందర్శిస్తోంది. మే 25 నుంచి మే 27 వరకు మూడు రోజుల కొనసాగనుంది.
మే 25న ఎన్. రాంచందర్ రావు, మహేశ్వర్ రెడ్డితో పాటు బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హైదరాబాద్ లోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి వికారాబాద్ జిల్లాకు బయలుదేరడంతో ఈ యాత్ర ప్రారంభమైంది. ముందుగా బిజెపి బృందం వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించింది. అనంతరం అక్కడున్న ఐకేపీ కేంద్రాన్నీ పరిశీలించింది. అటు నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెళ్లి, అక్కడ వ్యవసాయ మార్కెట్ ను సందర్శించింది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంది. వారితో ముఖాముఖి చర్చలు జరిపింది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న భారీ అక్రమాలు, మోసాలను ఈ సందర్భంగా బిజెపి బృందం ఎండగట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు పండించిన ధాన్యానికి సరైన ధర కల్పించడంలో, సమయానికి కొనుగోళ్లు పూర్తి చేయడంలో మరియు ఐకేపీ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని రాంచందర్ రావు మండిపడ్డారు. తాము పండించిన పంటను అమ్ముకోవడానికి రోజుల తరబడి కళ్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోందని, అధికారులు, మిల్లు యజమానుల తీరుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు బిజెపి నాయకుల ప్రతినిధి బృందంతో చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రైతాంగ సమస్యల పరిష్కారానికి, ప్రతి గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఒత్తిడి తెచ్చేందుకు బిజెపి ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడి పోరాడుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు రైతులకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరపకపోవడంతో రైతులు ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు రావడం తీవ్ర విచారకరం. రైతులకు బిజెపి అండగా ఉంటుంది, ఎవ్వరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. గతంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేం భువనగిరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించినప్పుడు, అప్పటికే నల్గొండ జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ సమయంలోనే మేం రైతులకు భరోసా ఇచ్చాం. ఏ ఒక్క రైతు కూడా అధైర్యపడొద్దని, ఆత్మహత్యల వంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కోరుతున్నాం. రైతుల పక్షాన పోరాటంలో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది.
బిజెపి ఈ యాత్రను ప్రకటించగానే, తాము మొత్తం కొనుగోళ్లు చేసేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టింది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉంది. బిజెపి బృందం వస్తోందని తెలిసి, నిన్న రాత్రికి రాత్రి, తెల్లవారుజామున 4 గంటలకే ఇక్కడికి గోనె సంచులు (గన్నీ బ్యాగ్స్) తీసుకొచ్చి దొంగచాటుగా ధాన్యం నింపే ప్రయత్నం చేశారు. ఇక్కడ ధాన్యాన్ని తరలించడానికి లారీలు గానీ, ట్రాక్టర్లు గానీ లేవు. రవాణా సదుపాయాలు కల్పించకుండా నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు అధికారుల సమన్వయ లోపం వల్లే కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పేరుతో రైతులను వేధిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఐకేపీ కేంద్రాల్లో రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోళ్లు జరగడం లేదు. కేవలం వరి ధాన్యమే కాకుండా మక్కలు (మొక్కజొన్న), జొన్నలు లాంటి ఇతర పంటలను కూడా విక్రయ కేంద్రాలకు తెచ్చిన తర్వాత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొనుగోళ్లలో కావాలనే ఆలస్యం చేస్తూ రైతులపై తీవ్ర మానసిక ఒత్తిడి తెస్తున్నారు. రైతులు ఇబ్బంది పడి, విసిగిపోయి చివరకు కేంద్ర ప్రభుత్వం అందించే కనీస మద్దతు ధర (MSP) కన్నా తక్కువ ధరకు తమ పంటను అమ్ముకునేలా పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. రైతులకు నష్టం చేకూర్చి, కష్టపడకుండా దళారులకు, ప్రైవేట్ వ్యాపారులకు, మిల్లర్లకు లాభం చేకూర్చాలనే దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది.” అని అన్నారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ”ఆరుగాలం ఎంతో కష్టపడి రైతన్నలు పండించిన పంట ఈరోజు కల్లాల్లోనే కుళ్లిపోతోంది. కళ్లల్లో ఒత్తులు వేసుకుని ధాన్యం కుప్పలను కాపాడుకోలేక, ఈ మిరమిట్లు గొలిపే ఎండలను తట్టుకోలేక ఎంతో మంది రైతులు కల్లాల పైనే ప్రాణాలు వదులుతున్న దుస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. పంట పండించే క్రమంలో చీడపీడలు, అకాల వర్షాలు, పాముల భయాలను సైతం లెక్కచేయకుండా రైతు ఎంతో కష్టపడతాడు. తీరా పంట చేతికొచ్చాక ప్రతి గింజా కొనుగోలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు రాష్ట్రంలో కనీసం 30 శాతం ధాన్యం కూడా కొనలేదు. రైతులు వర్షాలకు భయపడి తమ పంటను తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాలనే కుట్రతోనే, ప్రభుత్వం కావాలనే కొనుగోళ్లను ఆలస్యం చేసింది.
తెలంగాణలో ఈసారి దాదాపు 141 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, అందులో 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ క్షేత్రస్థాయిలో చేతులెత్తేసి, అప్పుడే 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని అబద్ధాలు చెప్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి రెండు రోజుల క్రితం కేవలం 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. వారి లెక్కల ప్రకారమే చూసినా అది 30 శాతం మించలేదు. మరి 80 శాతం కొనుగోళ్లు జరిగిపోయాయని ప్రజలను ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారు? తరుగు, సేవ పేరిట ప్రతి గన్నీ బ్యాగ్‌కు (సంచికి) 4 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేస్తున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేస్తామన్న 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో సంచికి 4 కిలోల చొప్పున అదనంగా నొక్కితే.. అది దాదాపు 10 శాతం అంటే 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవుతుంది. ఈ భారీ దోపిడీ సొమ్ము ఎవరి ఖాతాల్లోకి పోతోంది? ఎవరి జేబులు నిండుతున్నాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.” అని అన్నారు.
ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ”రైతులు పంట పండించడానికి పడే కష్టం ఒకెత్తయితే.. తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు (కల్లాలకు) తెచ్చి అమ్ముకోవడానికి పడుతున్న బాధలు మరో ఎత్తు. ఇంతటి తీవ్రమైన ఎండల్లో, కనీస వసతులు లేని కొనుగోలు కేంద్రాల్లో రైతులు 15 రోజుల నుండి 25 రోజుల పాటు ధాన్యం కుప్పల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఈ దారుణ పరిస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యం, కొనుగోళ్ల నిర్వహణలో వారి వైఫల్యమే ప్రధాన కారణం. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సంవత్సరం ఎన్ని క్వింటాళ్ల ధాన్యం మార్కెట్లోకి వస్తుంది? దానికి ఎన్ని గన్నీ బ్యాగులు (గోనె సంచులు) కావాలి? రవాణాకు ఎన్ని లారీలు ఏర్పాటు చేయాలి? అనే కనీస ముందస్తు ప్రణాళికలు ప్రభుత్వం చేయకపోవడం అత్యంత విచారకరం. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి ధాన్యం నిల్వ ఉండటం వల్ల, ఈ మధ్య కాలంలో వస్తున్న అకాల వర్షాలు, గాలివానలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. ఒకసారి కష్టపడి ఎండబెట్టి తేమ శాతం తగ్గించుకున్నాక.. మళ్లీ వర్షం పడి తేమ పెరుగుతోంది. దీంతో అధికారులు మిల్లర్లతో కుమ్మక్కై తేమ నెపంతో కొనుగోళ్లు నిలిపివేస్తున్నారు. దీంతో రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయిస్తున్నారు. వేల రూపాయలు నష్టపోతూ మధ్యవర్తులకు, ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దౌర్భగ్య పరిస్థితిని ఈ ప్రభుత్వం కల్పించింది.” అని అన్నారు.
తెలంగాణ రైతాంగం హక్కుల కోసం, వారికి మద్దతు ధర, సకాలంలో కొనుగోళ్లు జరిగేలా చూసే వరకు బిజెపి తన పోరాటాన్ని కొనసాగించనుంది. ఈ కార్యక్రమంలో ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

