Modi in flight

ఇంధన, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలకు పునాది

Modiభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల పర్యటన భారత దౌత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పశ్చిమాసియాలోని వ్యూహాత్మక భాగస్వామి యూఏఈతో పాటు, ఐరోపాలోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మే 15 నుంచి 20 వరకు ఆయన జరిపిన పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికే పరిమితం కాకుండా, భారతదేశ దీర్ఘకాలిక ఇంధన, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలకు గట్టి పునాది వేశాయి. ఈ పర్యటనలో యూఏఈ నుండి 5 బిలియన్ డాలర్లు, ఐరోపా దేశాల (EFTA) నుండి రాబోయే కాలంలో 100 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులకు మార్గం సుగమమైంది. పశ్చిమాసియా సంక్షోభ సమయంలోనూ భారత్‌కు చమురు, గ్యాస్ కొరత రాకుండా యూఏఈతో దీర్ఘకాలిక ఒప్పందాలు దేశ ఇంధన భద్రతకు రక్షణ కవచంగా మారాయి. నార్డిక్ దేశాల (స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్) తో జరిగిన ‘ఇండియా-నార్డిక్ సదస్సు’ ద్వారా హరిత సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతరిక్ష రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగేందుకు పునాది పడింది. ఐరోపా, అరబ్ దేశాలు ప్రధాని మోదీని అత్యున్నత పురస్కారాలతో గౌరవించడం, చారిత్రక వారసత్వ సంపదను తిరిగి అప్పగించడం ద్వారా ప్రపంచ దౌత్య రంగంలో భారతదేశ విశ్వసనీయత, గౌరవం మరింత పెరిగాయని స్పష్టమవుతోంది.

యూఏఈ

‌‌పశ్చిమాసియా సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో మే 15న ప్రధాని మోదీ యూఏఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్-నహ్యాన్‌తో జరిగిన భేటీలో భారత్-యూఏఈ మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. భారత్ లో పెట్రోలియం, ఎల్‌ఎన్‌జీ (LNG), ఎల్‌పీజీ (LPG) నిల్వల పెంపునకు యూఏఈ సహకారం అందించనుంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్‌తో కుదిరిన ఒప్పందం వల్ల భారత్ దేశీయ ఇంధన భద్రత మరింత పటిష్టమవనుంది. భారతదేశంలో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ 5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.41,000 కోట్లకు పైగా) నిధులు కేటాయించేందుకు సిద్ధమైంది. వీటితో పాటు రక్షణ పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం, గుజరాత్‌లో ఓడ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, ఐటీ రంగంలో సూపర్ కంప్యూటర్ క్లస్టర్ల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి.

ప్రధాని మోదీ పట్ల యూఏఈ ప్రభుత్వం తన గౌరవాన్ని చాటుకుంది. మోదీ ప్రయాణిస్తున్న విమానం యూఏఈ గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత యూఏఈకి చెందిన ఎఫ్-16 యుద్ధ విమానం ఎయిర్ పోర్టు వరకు ఎస్కార్ట్‌గా వచ్చింది. అంతేకాదు, ఎయిర్పోర్టులో మోదీకి అల్-నహ్యాన్‌ స్వయంగా స్వాగతం పలికారు. ఇది మోదీకే కాదు, భారత్ కు దక్కిన గౌరవం. 

నెదర్లాండ్స్

మే 16న నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్‌లో ప్రధాని మోదీ పర్యటన సాంస్కృతిక, ఆర్థిక పరంగా అద్భుత విజయాలను సాధించింది. అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాయి. ఈ పర్యటనలో నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రోబ్ జెటెన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాలు మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా రక్షణ, అరుదైన ఖనిజాలు సహా కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం 17 ఒప్పందాలపై భారత్, నెదర్లాండ్స్ సంతకాలు చేశాయి. 

11వ శతాబ్దానికి చెందిన, రాజరాజ చోళుడి కాలం నాటి అత్యంత ప్రతిష్టాత్మకమైన చారిత్రక సంపదైన చోళుల రాగి ఫలకాలను నెదర్లాండ్స్ ప్రధాని రోబ్ జెటెన్ అధికారికంగా భారత్‌కు అప్పగించారు. నెదర్లాండ్స్‌లో లీడెన్ ప్లేట్లుగా పిలిచే ఆనైమంగళం రాగి ఫలకాలను తిరిగి పొందాలని భారత్ 2012 నుంచి ప్రయత్నిస్తోంది. మొత్తం 21 పెద్ద ప్లేట్లు, మూడు చిన్న ప్లేట్లు ఉన్నాయి. బరువు 30 కిలోలు, వీటిపై తమిళ భాషలో అక్షరాలు చెక్కి ఉన్నాయి. రాజరాజ చోళ-1 తన కుమారుడైన రాజరాజ చోళ-2కు చేసిన వాగ్దానం ఇందులో ఉంది. ఈ ఫలకాలను తమిళ చోళ రాజవంశానికి చెందిన అత్యంత ముఖ్యమైన చారిత్రక ఆధారాలుగా పరిగణిస్తున్నారు. భారతదేశం వెలుపల తమిళ వారసత్వపు ముఖ్యమైన కళాఖండాల్లో ఇవి కూడా ఒకటి. ఇవి రాజరాజ చోళ-1 కాలానికి సంబంధించినవని చెబుతున్నారు. చోళుల రాజముద్ర కలిగిన కంచు తీగతో వీటిని కట్టి ఉంచారు. ఇవి శతాబ్దాల క్రితమే చేతులు మారి భారత్ నుంచి నెదర్లాండ్స్ చేరాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ హేగ్ ప్రవాస భారతీయుల సదస్సులో ప్రసంగించారు. నెదర్లాండ్స్ రాజు విల్లెమ్- అలెగ్జాండర్, రాణి మక్సిమా దంపతులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. రాయల్ ప్యాలెస్‌లో జరిగిన ఈ భేటీలో భారత్- నెదర్లాండ్స్ సంబంధాలపై చర్చించారు.

స్వీడన్

స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్‌తో గోథెన్‌బర్గ్‌లో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చలు ఇరుదేశాల బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇరుదేశాల మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యం, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం స్ఫూర్తితో తమ ప్రజల ప్రయోజనం కోసం కొత్త అవకాశాలను అన్వేషించాలని నిర్ణయించారు. వ్యాపారం, వాణిజ్యం, టెక్నాలజీ, రక్షణ సహా కీలక రంగాల్లో పరస్పర సహకారంపై సంప్రదింపులు జరిపారు. సహకారమే మన బలమని ఉద్ఘాటించారు. మే 17న స్వీడన్ గోథెన్‌బర్గ్‌కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. మోదీ గౌరవార్ధం ఆయన ప్రయాణించిన విమానానికి స్వీడన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు ఎస్కార్ట్‌గా వచ్చాయి. గోథెన్‌బర్గ్‌ ఎయిర్ పోర్టులో మోదీకి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్‌ సాదర స్వాగతం పలికారు. మోదీకి స్వాగతం పలకడానికి స్వీడన్లోని ప్రవాస భారతీయులు తరలివచ్చారు. మోదీ రాకను పురస్కరించుకొని నిర్వహించిన సంగీత ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపుగా స్వీడన్ అత్యున్నత పురస్కారమైన ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్’ ను స్వీడన్ యువరాణి విక్టోరియా మోదీకి అందజేశారు.

నార్వే 

మే 18న నరేంద్ర మోదీ స్వీడన్ నుంచి నార్వే చేరుకున్నారు. నార్వే ప్రధాని జోనాస్ గార్‌స్టోర్‌తో ఓస్లోలో జరిగిన చర్చలలో ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ (శుద్ధ ఇంధనం) పై దృష్టి సారించారు. రాబోయే 15 ఏళ్లలో నార్వేతో కూడిన యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (EFTA) ద్వారా భారత్‌లో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో పాటు 10 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. గ్రీన్ షిప్పింగ్, బ్లూ ఎకానమీ, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భాగస్వామ్యంతో పాటు, నార్వేలోని భారత పరిశోధన కేంద్రం ‘హిమాద్రి’ కి నార్వే పూర్తి సహకారం అందించనుంది. ఇస్రో, నార్వే స్పేస్ ఏజెన్సీ మధ్య కూడా అవగాహన కుదిరింది. నార్వే అత్యున్నత పౌర పురస్కారం ‘ది గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేనియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్’ను మోదీ అందుకున్నారు. భారత్- నార్వే సత్సంబంధాలను సమున్నత శిఖరాలకు చేర్చేందుకు మోదీ చేస్తున్న కృషి, ఆయన దార్శనిక నాయకత్వానికి గాను మోదీని ఈ పురస్కారంతో గౌరవిస్తున్నట్లు నార్వే ప్రభుత్వం పేర్కొంది. ఈ మెడల్‌ను రాజప్రసాదంలో నార్వే రాజు హరాల్డ్-5 స్వయంగా మోదీకి ప్రదానం చేశారు.

మే 19న నార్వే రాజధాని ఓస్లోలో జరిగిన మూడో ఇండియా-నార్డిక్ సదస్సులో భారత ప్రధాని పాల్గొన్నారు. క్లీన్ ఎనర్జీ, సుస్థిరాభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, నవీన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు కీలక రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. మోదీతోపాటు ఐస్లాండ్ ప్రధాని క్రీస్ట్రన్ ఫ్రాస్టాడాటిర్, ఫిన్లాండ్ ప్రధాని పెటెరీ ఓర్పో, డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరిక్సన్, నార్వే ప్రధాని జోనాస్ గార్‌స్టోర్‌, స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఈ సదస్సుకు హాజరయ్యారు. ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానులతో మోదీ వేరువేరుగా సమావేశయమ్యారు. క్లీన్ ఎనర్జీ, వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిరాభివృద్ధి, డిజిటలీకరణ, కృత్రిమ మేధ(ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ తదితర రంగాల్లో పరస్పర సంబంధాలను బలపేతం చేసుకోవడంపై మోదీ చర్చించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ లో పర్యటించాలని మూడు దేశాల ప్రధానులను మోదీ ఆహ్వానించారు. అటు నుంచి మే 19న ఇటలీ చేరుకున్నారు.

Melodyఇటలీ

ఇటలీకి చేరుకున్న మోదీకి ఆ దేశ ప్రధాని మెలోనీ ఘన స్వాగతం పలికారు. ఆనంతరం మోదీ గౌరవార్థం ప్రత్యేక విందు ఇచ్చారు. తర్వాత రోమ్‌లోని ప్రాచీన కట్టడం కొలోజియంను ఇరువురు నేతలు కలిసి సందర్శించారు. ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాలారెల్లాతోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరునాడు మే 20న రోమ్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన ద్వైపాక్షిక చర్చలు అత్యంత ఆత్మీయ వాతావరణంలో, వ్యూహాత్మకంగా జరిగాయి. భారత్-ఇటలీ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2029 నాటికి 20 బిలియన్ యూరోలకు చేర్చాలని ఇరుదేశాలు సంకల్పించాయి. ఇందుకోసం సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక (2025-29) ను ఆమోదించారు. సైనిక హార్డ్ వేర్, ప్లాట్ఫారమ్ సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తికి మార్గం సుగమం చేస్తూ భారత్, ఇటలీ దేశాలు ఒక రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ ఆవిష్కరించాయి. అంతేకాకుండా ఉన్నత విద్య, ఇటలీకి భారతీయ నర్సుల రాకపోకల కోసం ఇరు దేశాలు కొత్త ఫ్రేమ్ వర్క్ ఖరారు చేశాయి. రక్షణ, అంతరిక్షం, కౌంటర్ టెర్రరిజం, విద్య, సైబర్ భద్రత, వ్యవసాయం మరియు సముద్ర రవాణా వంటి రంగాల్లో 10 కీలక ఒప్పందాలు జరిగాయి. 

 ప్రపంచ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయానికి మోదీ చేసిన కృషికి గాను ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) ప్రతిష్టాత్మక ‘అగ్రికోలా మెడల్’ను ఆయనకు బహుకరించింది. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని మెలొనీకి మెలొడీ చాక్లెట్ల ప్యాకెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఇందుకు గాను మోదీకి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోను షేర్ చేశారు. తనకు అందిన బహుమతిని చూపిస్తూ మెలొనీ సరదాగా ‘మెలొడీ’ అనడంతో మోదీ బిగ్గరగా నవ్వేశారు. ఇద్దరి పేర్ల కలయికతో ఏర్పడిన ‘మెలొడీ’ అనే హ్యాష్ ట్యాగ్‌ను 2023లో దుబాయ్‌లో జరిగిన కాప్ సదస్సు సందర్భంగా ఇటలీ ప్రధానమంత్రి సృష్టించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాలలో ఇద్దరు నాయకుల మధ్య జరిగిన ఆత్మీయ సంభాషణల కారణంగా ఈ పదం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ పర్యటన కేవలం దౌత్య సందర్శనలు మాత్రమే కాదు. భారత్ 21వ శతాబ్దపు గ్లోబల్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశలో వేసిన వ్యూహాత్మక అడుగులు. ఇంధన భద్రత నుంచి సాంకేతిక భాగస్వామ్యం వరకు, చారిత్రక వారసత్వం నుండి శాంతి దౌత్యం వరకు ఈ పర్యటన భారత విదేశాంగ విధానంలో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించింది.